ప్రతిపక్షాలు ప్రమాదకర రాజకీయాలు చేస్తున్నాయి

Sajjala Ramakrishna Reddy Comments On Opposition Parties - Sakshi

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

దివాలా తీసిన టీడీపీ మత రాజకీయాలకు పాల్పడుతోంది

సాక్షి, అమరావతి: ప్రతిపక్షాలు ప్రమాదకర రాజకీయాలు చేస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఒక పథకం ప్రకారమే ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. దివాలా తీసిన టీడీపీ మత రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. ఉన్మాద స్థితిలో ఉన్నవారే విధ్వంసానికి పాల్పడుతున్నారని విమర్శించారు. ఇలాంటి నీచ రాజకీయాలను సీఎం జగన్‌ సహించరని చెప్పారు. రామతీర్థం ఘటన కుట్రేనని, ఉద్దేశపూర్వకంగానే ధ్వంసం చేశారని చెప్పారు. దాడుల్లో పాల్గొన్నవారిని పట్టుకొని కఠినంగా శిక్షిస్తామని అన్నారు. మఠాధిపతులు, పీఠాధిపతులు సంయమనం పాటించాలని కోరారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సజ్జల ఏమన్నారంటే..

కులమతాలకు అతీతంగా జగన్‌ పాలన
‘రాష్ట్రంలో కులమతాలకు అతీతంగా జగన్‌ పాలన సాగిస్తున్నారు. ఎవరి మత విశ్వాసాలు వారివి. ప్రతిపక్షాలు అత్యంత ప్రమాదకరమైన రాజకీయాలకు తెరలేపాయి. మతాలు, దేవుళ్లతో ఆడుకుంటున్నాయి. వరుసగా, ఒక పథకం ప్రకారం ఎక్కడైతే భద్రత ఏర్పాట్లు సరిగ్గా ఉండవో, జన సంచారం ఉండదో అక్కడ చిన్న చిన్న గుళ్లను టార్గెట్‌ చేసి దాడులు చేస్తున్నారు. విగ్రహాలను విరగగొట్టడం, వెంటనే ఒక ఉద్యమం చేపట్టడం చేస్తున్నారు. ఇలా రాష్ట్రంలోని ఆలయాల్లో విగ్రహాలకు నష్టం కలిగించడం ద్వారా సీఎం జగన్‌కు, ప్రభుత్వానికి, వైఎస్సార్‌సీపీకి ఏం ప్రయోజనం? సీఎం ఇలాంటి తుచ్ఛమైన, నీచమైన ఆలోచనలు చేయరు. రాష్ట్రంలో 60 వేల ఎకరాలకు పైగా స్థలాన్ని సేకరించి, వేలాది కోట్లు వెచ్చించి కొనుగోలు చేసి పేదలకు పట్టాలిస్తున్న సందర్భంలో ప్రభుత్వం దీని గురించిన పబ్లిసిటీ పొందాలనుకుంటుందా? లేక ఆలయాల్లో విగ్రహాలు పగులగొట్టి ప్రచారం చేసుకోవాలనుకుంటుందా? రాజకీయంగా దివాలా తీసి అడ్రస్‌ గల్లంతైన టీడీపీకి ఇలాంటివి ప్రయోజనకరం. 

చంద్రబాబు పూర్తిగా మత రాజకీయాలు చేస్తున్నారు
టీడీపీ కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టి లబ్ధి పొందాలనుకుంటోంది. చంద్రబాబు మత రాజకీయాలు చేస్తున్నారు. జగన్‌పై ప్రజల్లో అనుమానాలు కలిగించొచ్చు అన్న దురాలోచనతో బాబు ఇలా చేస్తున్నారేమో. బీజేపీ తనను కలుపుకొనిపోతుందని భావించి కూడా చంద్రబాబు ఇలా చేస్తున్నారేమో అన్న అనుమానం కూడా వస్తోంది. మతం అనేది ముందు నుంచీ బీజేపీ అజెండాలో ఉంది. జీహెచ్‌ఎంసీ, దుబ్బాక ఎన్నికల ఫలితాలు చూశాక.. తిరుపతి ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ కూడా పాగా వేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు ఆ పార్టీ నేతల ఉపన్యాసాల ద్వారా అర్థమవుతోంది.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top