కాంగ్రెస్‌: సంఘర్షణ

Rahul Gandhi Visit in Warangal on the May 6th - Sakshi

6న వరంగల్‌లో రైతు సంఘర్షణ సభకు రాహుల్‌

 7న ఓయూ పర్యటన కార్యక్రమంతో పెరిగిన వేడి

 రాహుల్‌గాంధీ ఓయూకి వచ్చి తీరుతారంటున్న కాంగ్రెస్‌

గాంధీభవన్‌లో ఓయూ విద్యార్థి నేతలతో జగ్గారెడ్డి భేటీ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో రాజకీయమంతా రాహుల్‌గాంధీ చుట్టూనే తిరుగుతోంది. ఈ నెల 6,7 తేదీల్లో రాహుల్‌ రాష్ట్ర పర్యటన ఖరారు కావడం, ఆయ న్ను ఉస్మానియా యూనివర్సిటీకి తీసుకురావాలంటూ విద్యార్థి సంఘాల నేతలు రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకత్వాన్ని కోరడం తెలిసిందే. అందుకు టీపీసీసీ అనుమతించి షెడ్యూల్‌లో ఓయూ సందర్శనను చేర్చడం, ఈ మేరకు ఓయూ వీసీని అనుమతి కోరడమూ తెలిసిందే. కాగా వర్సిటీ వర్గాలు నిరాకరించడంతో మొదలైన వివాదం రోజురోజుకూ వేడెక్కుతూ గత ఆరు రోజులుగా కొనసాగుతూనే ఉంది. నిరసనలు, దిష్టిబొమ్మల దహనాలు, అరెస్టులతో ఓయూ ప్రాంగణంలో ఉద్రిక్తత నెలకొనగా, ఎన్‌ఎస్‌యూఐ నాయకుడు బల్మూరి వెంకట్‌ సహా 18 మందిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపడంతో సీన్‌ చంచల్‌గూడ జైలుకు మారింది. మరోవైపు రాహుల్‌ రాకను నిరసిస్తూ టీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో ఓయూలో రాహుల్‌ దిష్టిబొమ్మను దహనం చేయడంతో వివాదం మరింత ముదిరింది.

రెండు కార్యక్రమాలతో మరింత హీటు
    రాహుల్‌గాంధీని ఉస్మానియాకు తీసుకెళ్లి తీరుతామని చెప్తున్న కాంగ్రెస్‌ నేతలు.. ఆయన షెడ్యూల్‌లో చంచల్‌గూడ జైల్లో విద్యార్థి నేతలతో ములాఖత్‌ను కూడా చేర్చడం తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఇటు ఓయూ సందర్శన, అటు చంచల్‌గూడ జైల్లో ములాఖత్‌ను రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రతిష్టాత్మకంగా భావిస్తుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందో, ఈనెల 7న రాహుల్‌ హైదరాబాద్‌ పర్యటనలో ఏమవుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు రాహుల్‌గాంధీ విదేశాల్లో ఓ చైనా అధికారితో కలిసి పబ్‌లో కలిసి ఉన్న వీడియోను బీజేపీ నేత ఒకరు మంగళవారం సామాజిక మాధ్యమాల్లో విడుదల చేయడం, అది వైరల్‌ కావడం, దీనిపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పందించడం కొత్త వివాదానికి దారి తీసింది.  రాహుల్‌గాంధీ ఓయూకి వెళ్లి విద్యార్థులకు పబ్‌ల గురించి చెప్తారా అని ఆయన ప్రశ్నించగా.. పేకాట ఆడుతూ కెమెరాలకు చిక్కిన మంత్రి కూడా రాహుల్‌ను విమర్శించడం సిగ్గు చేటని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌లు జగ్గారెడ్డి, మహేశ్‌కుమార్‌గౌడ్‌లు కౌంటర్‌ ఇచ్చారు. రాహుల్‌ ఓ వివాహానికి హాజరయ్యారంటూ కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌   వివరణ ఇచ్చారు. బీజేపీ నేత ప్రకాశ్‌ జవదేకర్‌ షాంపెయిన్‌ ఓపెన్‌ చేస్తున్న ఓ ఫోటోను ట్విటర్‌లో పోస్టు చేశారు. దీనిపై ఇరు వర్గాలు మాటల తూటాలు పేల్చుకుంటున్నాయి. 

ఓయూకు వెళ్లాల్సిందే..!
    ఉస్మానియా వర్గాలు అనుమతినిచ్చినా ఇవ్వకపోయినా రాహుల్‌గాంధీని ఓయూకి తీసుకెళ్లాలని కాంగ్రెస్‌ పార్టీ యోచిస్తోంది. అందులో భాగంగానే టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి నేతృత్వంలో ఓయూ విద్యార్థి నేతలు మంగళవారం గాంధీభవన్లో సమావేశమయ్యారు. మరోమారు ఓయూ వీసీని కలవాలా? లేక కోర్టు ద్వారానే అనుమతి తెచ్చుకోవాలా? అనే అంశంపై చర్చించారు. రాహుల్‌ పర్యటన కోసం టీపీసీసీ ఏర్పాటు చేసిన కమిటీల్లో జగ్గారెడ్డి అధ్యక్షతన ఉస్మానియా ఏర్పాట్ల కమిటీ ఉంది. దీంతో రాహుల్‌ ఓయూకి ఖచ్చితంగా వెళ్తారనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. కాగా ఓయూ సందర్శన అనుమతి దరఖాస్తును పరిశీలించాలని వీసీకి హైకోర్టు ఆదేశాలివ్వడం, ఆయన అనుమతి నిరాకరించిన సంగతి విదితమే. దీనితో మరోసారి కోర్టు తలుపు తట్టాలని భావిస్తున్న కాంగ్రెస్‌ పిటిషన్‌ దాఖలు చేయనున్నట్లు సమాచారం. 

‘ములాఖత్‌’తో మరో టెన్షన్‌
    ఎన్‌ఎస్‌యూఐ నాయకుడు బల్మూరి వెంకట్‌ తదితరులను పరామర్శించేందుకు గాను రాహుల్‌ గాంధీని చంచల్‌గూడ జైలుకు తీసుకెళ్లాలని కూడా కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు అనుమతి కోసం జైలు సూపరింటెండెంట్‌కు వినతిపత్రం ఇచ్చింది. అయితే చంచల్‌గూడ జైలులో ములాఖత్‌కు జైళ్ల శాఖ అనుమతిస్తుందా లేదా అన్నది రాహుల్‌ టూర్‌లో తాజా టెన్షన్‌గా మారింది. ఈ రెండు కార్యక్రమాలకు అనుమతిని బట్టి రాహుల్‌ టూర్‌ షెడ్యూల్‌ ఫైనల్‌ కానుంది. 

వరంగల్‌లో ఏం చెబుతారో..? 
    ఇక ఈనెల 6వ తేదీన వరంగల్‌లో జరిగే ‘రైతు సంఘర్షణ సభ’లో రాహుల్‌గాంధీ ఏం చెప్తారన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ఆ సభ నుంచే కాంగ్రెస్‌ పార్టీ రైతు విధానాన్ని రాహుల్‌ ప్రకటిస్తారని రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు చెపుతున్న నేపథ్యంలో ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు? టీఆర్‌ఎస్, బీజేపీలను ఎలా టార్గెట్‌ చేస్తారన్నది కూడా చర్చనీయాంశమవుతోంది.

టూర్‌ కమిటీలు ఏర్పాటు..
    రాహుల్‌ రాష్ట్ర పర్యటన విజయవంతం కోసం కాంగ్రెస్‌ పార్టీ పలు కమిటీలను ఏర్పాటు చేసింది. ఆహ్వానం, సమన్వయం, మీడియా అండ్‌ పబ్లిసిటీ, బహిరంగ సభ నిర్వహణ, ప్రొటోకాల్, ఓయూ ఏర్పాట్లు, రాహుల్‌ను కలిసే నేతల పరిచయం, హెలిప్యాడ్, జన సమీకరణ, పార్కింగ్, గ్రౌండ్, వరంగల్‌ అలంకరణ, మెడికల్‌ ఎమర్జెన్సీ, నీరు, మజ్జిగ సరఫరాల కోసం ప్రత్యేకంగా కమిటీలను ప్రకటించింది. జన సమీకరణ కోసం అన్ని లోక్‌సభ నియోజకవర్గాలకు విడివిడిగా కమిటీలు ఏర్పాటు చేసింది. కాగా రాహుల్‌ హైదరాబాద్‌లో దామోదరం సంజీవయ్య వర్ధంతి కార్యక్రమంలో కూడా పాల్గొననున్నారు. ఈ మేరకు నెక్లెస్‌రోడ్డులోని దామోదరం సంజీవయ్య పార్కు సందర్శనను కూడా షెడ్యూల్‌లో చేర్చారు. అయితే రాహుల్‌ రాష్ట్ర పర్యటన పూర్తి స్థాయి షెడ్యూల్‌ బుధవారం ఖరారవుతుందని గాంధీభవన్‌ వర్గాలు వెల్లడించాయి. 
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top