తలైవా.. ప్లీజ్‌ ఇటు రావా

Political Parties In Tamil Nadu Asking Rajinikanth To Support For Us - Sakshi

‘రాజకీయాలు వద్దన్నావు.. ఎన్నికలకు వెళ్లనన్నావు.. మీరు వద్దనుకున్నా మీలోని చరిష్మా మాకివ్వు.. మా పార్టీ గెలుపునకు మద్దతుగా నిలువు. కార్యకర్తల్లో నూతన ఉత్తేజం నింపు..’ అంటూ రాష్ట్రంలోని పలు పార్టీలు నటుడు రజనీకాంత్‌ వెంటపడుతున్నాయి. ఆయన్ను ప్రసన్నం చేసుకునేందుకు పోటీపడుతున్నాయి. 

సాక్షి, చెన్నై: అన్నీ అనుకున్నట్లుగా జరిగి గురువారం రజనీకాంత్‌ పార్టీని ప్రకటించి ఉంటే రాష్ట్రమంతా కోలాహలంగా ఉండేది. కానీ పరిస్థితి తారుమారైంది. సంబరాల్లో మునిగి తేలాల్సిన అభిమానుల్లో నిశ్శబ్దం తాండవం చేస్తోంది. రజనీపార్టీ కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకున్న మక్కల్‌ మన్రం నిర్వాహకులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. అయితే రజనీ నిర్ణయం ఒకటి, రెండు పార్టీలకు మినహా అనేకపార్టీలకు ఆనందం కలిగించింది. రాష్ట్రంలో రజనీ ఫాలోయింగ్‌ను ఓటింగ్‌గా మలుచుకోవాలనే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.

రజనీ కరుణాకటాక్ష వీక్షణాల కోసం పలు పార్టీలు ఆయన ఇంటిముందు క్యూకట్టేలా ఉన్నాయి. ఇందులో అందరికంటే ముందు నిలిచింది మక్కల్‌ నీది మయ్యం అధ్యక్షులు, నటుడు కమల్‌హాసన్‌. రాజకీయ పార్టీ పెట్టడం లేదని రజనీ ప్రకటించగానే మిత్రుని మద్దతు కోరుతానని కమల్‌ మొట్టమొదటగా ప్రకటించారు. ఆధ్యాత్మికతతో కూడిన రజనీ రాబోయే ఎన్నికల్లో తమకు అండగా నిలుస్తారని ఆ తరువాత అన్నాడీఎంకే సైతం తన మనసులోని మాటను బయటపెట్టింది. ఇక ప్రధాని నరేంద్ర మోదీకి రజనీకాంత్‌ మిత్రుడు. ఈ మిత్రత్వాన్ని అవకాశంగా తీసుకుని మద్దతు కోరేందుకు కమలనాథులు సిద్ధంగా ఉన్నారు.

బీజేపీ ఇప్పటికే ఆ ప్రయత్నాలను ప్రారంభించినట్లు సమాచారం. ఇక 1996 ఎన్నికల్లో డీఎంకేకు మద్దతు ఇవ్వడం ద్వారా డీఎంకే విజయానికి రజనీకాంత్‌ దోహదపడ్డారు. అప్పటి నుంచి డీఎంకే అధ్యక్షులు స్టాలిన్, రజనీ మధ్య మైత్రిబంధం ఏర్పడింది. అయితే ఈ ఎన్నికల్లో సైతం డీఎంకే తన వంతు ప్రయత్నాలు చేయడం అనుమానమే. ఆనాడు జయపై వ్యతిరేకతతోనే రజనీ అలా వ్యవహరించారేగానీ డీఎంకే గెలుపుపై ఆసక్తితో కాదు. రజనీతో కలిసి పనిచేసేందుకు ఆశపడుతున్నానని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీమంత్రి పీ చిదంబరం ఇటీవలే ట్వీట్‌ చేసి పరోక్షంగా మద్దతు కోరారు. రజనీ కోసం ఎవరి ప్రయత్నాలు వారు మొదలుపెట్టారు. మరి రజనీ ఎవరివైపైనా మొగ్గుచూపుతారా లేక మౌనంగా ఉండిపోతారా అనే ప్రశ్నకు సమాధానం కోసం ఎన్నికల వరకు వేచిచూడక తప్పదు.  

మోదీ, రజనీ నాకు రెండు కళ్లు: అర్జున్‌మూర్తి 
ఇదిలాఉండగా, రాజకీయపార్టీ లేకున్నా రజనీ వెంటే ఉంటానని అర్జున్‌మూర్తి స్పష్టం చేశారు. బీజేపీని వీడి రజనీ పెట్టదలుచుకున్న పారీ్టకి ప్రధాన సమన్వయకర్తగా నియమితులైన అర్జున్‌మూర్తి గురువారం మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ, రజనీ నాకు రెండు కళ్లలాంటి వారు, ఒకరు దేశానికి, మరొకరు తమిళనాడు ప్రజలకు మంచి చేయాలని భావిస్తుంటారు. బీజేపీతో ఎప్పుడూ నా సత్సంబంధాలు ఉన్నాయి. అయినా రజనీని వీడను. వైద్యుల సలహాల వల్ల పార్టీ స్థాపన విరమణ రజనీ మనస్సును బాధించింది. రజనీ నిర్ణయాన్ని అందరూ స్వాగతించాలని కోరారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top