కుళ్లు బుద్ధితోనే ఈనాడు తప్పుడు రాతలు 

Kurasala Kannababu Comments On Chandrababu And Eenadu - Sakshi

సీఎం జగన్‌ నాయకత్వంలో రాష్ట్రంలో వ్యవసాయరంగం పురోగతి  

గుడ్‌ గవర్నెన్స్‌ ఇండెక్స్‌లో వ్యవసాయంలో ఏపీ అగ్రగామి అని కేంద్రం చెప్పింది 

సంక్రాంతి మరునాడే రూ.16 వేల కోట్లు పెట్టుబడులు రైతులు నష్టపోయారని రాతలు 

చంద్రబాబుకు అనుగుణంగానే ఈనాడు వార్తలు : మంత్రి కన్నబాబు  

కాకినాడ రూరల్‌: రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో వ్యవసాయరంగం బ్రహ్మాండంగా పురోగమిస్తోందని కేంద్ర ప్రభుత్వం గుడ్‌ గవర్నెన్స్‌ ఇండెక్స్‌ ద్వారా చెప్పినప్పటి నుంచి ఈనాడు కుళ్లుబుద్ధితో వ్యవహరిస్తోందని వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు ధ్వజమెత్తారు. రైతులకు అన్యాయం జరుగుతోందని, వ్యవసాయం అసలు బాగోలేదని ప్రచారం చేస్తూ సంక్రాంతి మరునాడే రూ.16 వేల కోట్ల పెట్టుబడులు నాశనమైపోయాయంటూ తప్పుడు రాతలతో ఈనాడులో బ్యానర్‌ వేశారని దుయ్యబట్టారు.

రాష్ట్రం అంతా దెబ్బతింటోందని, ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని దుర్మార్గంగా, గోబెల్స్‌లాగా రోజూ మాట్లాడుతున్నారని, రాస్తున్నారని మండిపడ్డారు. సోమవారం కాకినాడలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రకృతి వైపరీత్యాలను ఆపుతామంటూ చంద్రబాబులా కల్లబొల్లి మాటలు చెప్పే ప్రభుత్వం తమది కాదన్నారు. రైతులకు ఎక్కడ ఏరకమైన ఇబ్బంది వచ్చినా వారిని ఏ విధంగా ఆదుకోవాలని చూస్తున్నామని, తామరపురుగు ఇతర పంటలకు ఆశించకుండా చర్యలు చేపట్టామని తెలిపారు. పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్రంలో వ్యవసాయమే నాశనమైపోయినట్టు.. రైతులు బతికి బట్టకట్టే పరిస్థితి లేదని ఈనాడులో రాయటం పచ్చి దుర్మార్గమన్నారు. ఈ మధ్యనే చంద్రబాబు విత్తనం నుంచి విక్రయం వరకు దగా అని ఒక కార్యక్రమాన్ని తీసుకుంటే.. దానికి అనుగుణంగా వార్తలు రాస్తున్నారని తెలిపారు. 

పంటలు దెబ్బతిన్నా.. దిగుబడులు తగ్గలేదు 
2021–22 రెండో అడ్వయిజరీ రిపోర్టు ప్రకారం పంటలు దెబ్బతిన్నప్పటికీ దిగుబడులు తగ్గలేదన్నారు. ఖరీఫ్‌లో 80.46 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేశారని తెలిపారు. పంటకోత ప్రయోగాల ద్వారా ఎకరాకు 20 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని ధ్రువీకరించారన్నారు.  రాష్ట్రంలో 8వేల ఆర్‌బీకేల ద్వారా ఇప్పటివరకు 20.36 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు చెప్పారు. హమాలీ చార్జీలు కూడా ఇన్నామని, ధాన్యం డబ్బు 21రోజుల్లో చెల్లిస్తున్నామని చెప్పారు. మొక్కజొన్న, కందుల దిగుబడి బాగుందన్నారు. పత్తి దిగుబడి కొద్దిగా తగ్గినా ధర పెరిగిందని చెప్పారు. పంటలకు ఎంఎస్‌పీ కంటే ఎక్కువ ధరలు లభిస్తున్నాయన్నారు. 

ఏ సీజన్‌కు ఆ సీజన్‌లోనే పంట నష్టపరిహారం 
మరోవైపు పంట నష్టపరిహారాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఏ సీజన్‌కు ఆ సీజన్‌లోనే ఇస్తున్నారని చెప్పారు. గులాబ్‌ తుపానుకు సంబంధించి ఇన్‌పుట్‌ సబ్సిడీ రూ.22 కోట్లను 34,586 రైతుల ఖాతాల్లో 45 రోజుల్లోనే వేశామన్నారు. ఖరీఫ్‌ 2020లో రూ.1,735 కోట్ల క్లెయిమ్‌లు చెల్లించామన్నారు. పరిస్థితులు ఇలా ఉంటే సంక్రాంతి తరువాత ఈనాడు రాసిన రాతలు ఎవరిని ఉద్దేశించి, ఏం సాధించాలని ప్రశ్నించారు. మొన్ననే 3, 4 బస్తాలు ఇస్తుండడంతో రైతులు తమ భూములను కౌలుకు ఇచ్చుకోలేని పరిస్థితి అని రాశారని, ఇప్పుడు ఎకరానికి కౌలు రూ.40 వేలు, రూ.50 వేలు ఉందని రాశారని చెప్పారు. వీటిలో ఏది కరెక్టు అని ప్రశ్నించారు.  

బాబు హయాంలో సంక్రాంతి సంబరాలు.. ఇప్పుడు జూదక్రీడలా? 
రాష్ట్రంలో పెద్దఎత్తున కోడిపందాలు నిర్వహించినట్లు కొన్ని పచ్చపత్రికలు, కొన్ని చానల్స్‌ చాలా దుర్మార్గంగా చూపించాయని చెప్పారు. చంద్రబాబు హయాంలో కోడిపందేలు జరిగితే సంక్రాంతి కోడిపందాలని రాశారని, ఇప్పుడు జూదక్రీడలని రాశారని విమర్శించారు. చంద్రబాబు సీటులో కూర్చుంటే వీళ్లకు సంక్రాంతి ఉన్నట్టన్నారు.  మంత్రి కొడాలి నాని కరోనాతో ఆస్పత్రిలో ఉంటే.. నాని ఇలాకాలో ఏదో జరిగిపోయినట్టు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top