సీఎం జగన్‌ చాకచక్యం | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ చాకచక్యం

Published Tue, Dec 5 2023 1:08 PM

KSR Comment On Capability of CM YS Jagan - Sakshi

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన సమర్ధతను, చాకచక్యాన్ని నిరూపించుకున్నారు. ఏపీ ప్రయోజనాలను ఎలా పరిరక్షించుకోవచ్చో చేసి చూపించారు. నాగార్జున సాగర్ వద్ద ఏపీకి సంబంధించిన పదమూడు గేట్లను, ఆ ప్రాంతంలోని హెడ్ రెగ్యులేటర్ ను రాష్ట్ర అధీనంలోకి  తీసుకుని , కేంద్రం స్పందించేలా చేయడంలో జగన్ ప్రభుత్వం కృతకృత్యమైంది. ఇందులో ఎక్కడా తెలంగాణకు అన్యాయం జరగకుండా, వారి ప్రయోజనాలకు విఘాతం కలిగించకుండా తెలివైన వ్యూహాన్ని అమలు చేశారు. తనకు ఎంతో అనుభవం ఉందని ప్రచారం చేసుకునే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను అధికారంలో ఉన్నప్పుడు చేయలేకపోయిన పనిని జగన్ చేసి శభాష్ అనిపించుకున్నారు.

✍️ఏపీ ప్రయోజనాలు కోరుకునే ప్రతి ఒక్కరు సంతోషించేలా చేశారు. కాకపోతే ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వంటివారు ఏపీ తన వాటా తాను తెచ్చుకున్నా, దానిని తప్పుగా చిత్రీకరిస్తూ మరోసారి ఏపీ ప్రజలపై తమకు ఉన్న కక్షను బహిర్గతం చేసుకున్నారు.  గొడవలు, రచ్చ జరగకుండా సరిగ్గా తెలంగాణ ఎన్నికల పోలింగ్ రోజును ఏపీ ప్రభుత్వం ఇందుకు ఎంపిక చేసుకోవడం కూడా చెప్పుకోదగినదే. దీనికి ,తెలంగాణ ఎన్నికల రాజకీయానికి కొందరు అంటగట్టే యత్నం చేసినా, అందులో అంత హేతుబద్దత కనిపించడం లేదు.

✍️బీఆర్‌ఎస్‌కు ప్రయోజనం కలిగించడానికని కొందరు అతి తెలివి రాజకీయనేతలు వ్యాఖ్యలు చేశారు. కాని అది అవాస్తవమని ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి. నాగార్జున సాగర్ ఎడమ కాల్వ ప్రాంతంలో ఉన్న నల్లొండ, ఖమ్మం జిల్లాల పరిధిలో అత్యధికం అసెంబ్లీ సీట్లను  కాంగ్రెస్ పార్టీనే గెలుచుకుంది. కృష్ణా బోర్డుకు సాగర్ , శ్రీశైలం ప్రాజెక్టులను అప్పగించి , ఇరు రాష్ట్రాలకు న్యాయంగా నీటి పంపిణీ చేయాలన్న  ముఖ్యమంత్రి జగన్ సూచన అమలు అయ్యే అవకాశం ఇప్పుడు  ఏర్పడింది.   ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు ప్రభుత్వం తరపున ఈ ఘటనపై వివరించిన తీరు కూడా చక్కగా ఉంది. ఎక్కడా ఎవరిని రెచ్చగొట్టకుండా, బేలెన్స్ గా మాట్లాడి ఏపీ ప్రభుత్వ వైఖరిని సమర్దించుకున్నారు.

✍️రాష్ట్ర విభజన సమయంలోనే నీటి తగాదాలు వస్తాయని చాలామంది భావించారు. ప్రత్యేకించి నీటి ఎద్దడి ఉన్న సమయంలో  ఈ సమస్యలు అధికంగా ఉంటాయి. అదే సమయంలో ఏ రాష్ట్రం నిబంధనలు పాటించకపోయినా ఇబ్బంది వస్తుంది. ఈ విషయంలో తెలంగాణలోని అప్పటి  కేసీఆర్‌ ప్రభుత్వం కాస్త దుందుడుకుగానే వ్యవహరించింది. అయినా  తెలంగాణలోని కొన్ని రాజకీయపార్టీలు  కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టే విదంగా నీటి రాజకీయాలు చేశాయి. విభజన చట్టం ప్రకారం శ్రీశైలం ప్రాజెక్టు  నిర్వహణ ఏపీకి అప్పగించారు. సాగర్ ప్రాజెక్టు బాద్యత తెలంగాణాది.   శ్రీశైలంలో కీలకమైన భూగర్భ  జలవిద్యుత్ కేంద్రం తెలంగాణ పరిధిలో ఉంది. దానికి నిర్దిష్ట మట్టం ఉంటేనే నీటిని వాడుకోవాలి. కాని తెలంగాణ విద్యుత్ అవసరాల రీత్యా ప్రభుత్వం ఆ నిబంధనను పట్టించుకోలేదు. ఏపీ అధికారులను అటు వైపు రానివ్వడం లేదు. తన కోటా కంటే అదనపు నీటిని వాడుతోంది. తద్వారా శ్రీశైలంలో సరైన నీటి మట్టం లేక రాయలసీమకు కీలకమైన పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని విడుదల చేయడం కష్టం అవుతోంది.

✍️అయినా కేంద్రం ఎలాంటి  పరిష్కారం చూపలేకపోయింది. అలాగే కృష్ణానది జలాల బోర్డు కూడా నివారించలేకపోయింది. ఇక సాగర్ ప్రాజెక్టులో కూడా తెలంగాణ ప్రభుత్వ దయాదాక్షిణ్యాల మీద ఏపీ ఆధారపడవలసి వస్తోంది. ఏపీకి తన కోటా ప్రకారం నీటిని విడుదల చేయాలని పదే,పదే అడగవలసి వస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా రెండు రాష్ట్రాల పోలీసులు మొహరించి ఘర్షణ పడినంత పని అయింది. అయినా సమస్య పరిష్కారం కాలేదు. ఆ సమయంలోనే చంద్రబాబు ఓటుకు నోటు కేసులో ఇరుక్కోవడంతో  ఆయన చెప్పాపెట్టకుండా హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లిపోవలసి రావడం,కేసు భయంతో తెలంగాణ ప్రభుత్వంపై గట్టిగా మాట్లాడలేకపోవడం వంటివి జరిగాయి. దాంతో ఏపీ పరిధిలోని సాగర్ గేట్లపై కూడా తెలంగాణ అధికారులే పెత్తనం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో జగన్ ప్రభుత్వం దీనిపై పలుమార్లు ఆలోచించింది.

✍️ఇప్పటికే రెండు,మూడు సార్లు తమ భూ భాగాన్ని స్వాధీనం చేసుకోవాలని యోచించి, పరిస్థితిని  మదింపు చేసుకుంటూ వాయిదా వేసిందని సమాచారం. గత నాలుగేళ్లుగా వరదజలాలు బాగానే రావడంతో పెద్ద ఇబ్బంది రాలేదు. ఈ ఏడాది కర్నాటక ప్రాంతంలో వర్షాలు సరిగా కురవకపోవడంతో జలాశయంలోకి నీరు ఆశించిన విధంగా రాలేదు. ఫలితంగా ఏపీ, తెలంగాణలలో ఒత్తిడి ఏర్పడింది. మరో వైపు సాగర్ కుడి కాల్వ ఉన్న పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల పరిధిలో నీరు పూర్తి స్థాయిలో అందక రైతులు సమస్యలు ఎదుర్కుంటున్నారు.

✍️తాగు నీటి అవసరాలు కూడా ఏర్పడ్డాయి. ఇదే అదనుగా తీసుకున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియా సంస్థలు రైతులను రెచ్చగొట్టే విధంగా కరువు, కరువు అంటూ సాగర్లో నీరు ఉన్నా ఇవ్వలేకపోతున్నారంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాయసాగాయి. తద్వారా తెలుగుదేశం పార్టీకి మేలు చేయాలని యత్నించాయి. అలాంటి తరుణంలో జగన్ మాస్టర్ స్ట్రోక్ కొట్టారు. తెలంగాణ పోలీసులు ఎన్నికలలో బిజీగా ఉన్న టైమ్ చూసుకుని తమ పోలీసులను అక్కడకు  పెద్ద ఎత్తున పంపించి తమ భూమిని తమకు దక్కేలా చేసుకున్నారు. తెలంగాణ ఇరిగేషన్ అధికారులు  కరెంటు సరఫరా నిలిపివేసినా, ప్రత్యామ్నాయ మార్గం ద్వారా కరెంటు లైన్ వేసుకుని కాల్వ గేట్లు ఎత్తేలా ఏపీ అధికారులు  చేయగలిగారు.

✍️తద్వారా పల్నాడు తదితర ప్రాంతాలకు జగన్ ప్రభుత్వం  నీరివ్వడంతో  ఈనాడు,ఆంద్రజ్యోతి మీడియా రివర్స్‌లో ఏడవడం ఆరంభించాయి. తమ వాటాకు రావల్సిన నీటిని తప్ప, ఒక్క చుక్క కూడా అదనంగా వాడుకోబోమని అంబటి రాంబాబు చెప్పడం సమంజసమైన పనే. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఆ ప్రాంత ప్రయోజనాల కోసమే తప్ప తెలంగాణ ఎన్నికల కోసం కాదన్నది అర్దం అవుతుంది. నిజంగా అలాంటి ఆలోచన ఉంటే ఏ వారం ముందో జగన్ ప్రభుత్వం ఈ విధంగా పోలీసులను పంపించి హడావుడి చేసి ఉంటే నానా రభస అయి ఉండేది. అప్పుడు ఏమైనా బీఆర్‌ఎస్‌ సెంటిమెంట్ రెచ్చగొట్టుకునే అవకాశం ఉండేదేమో! పైగా తెలంగాణ ఎన్నికలు కేవలం సాగర్ గేట్లు, ఏపీ వైఖరిపైనే ఆధారపడి ఉండవు. కాంగ్రెస్ నేతలు కొందరు ఏపీ చర్య వల్ల కాంగ్రెస్ కు నష్టం కలిగి, బిఆర్ఎస్ కు లాభం జరుగుతుందేమోనని అనుమానించారు. కాని పోలింగ్ నాడు ఈ అంశం తెలంగాణలో పెద్ద చర్చనీయాంశం కాలేదన్నది వాస్తవం.ఎన్నికల ఫలితాలు కూడా అదే విషయాన్ని స్పష్టం చేశాయి. కాకపోతే ఈ చర్య ద్వారా ఏపీలో జగన్ హీరో అయిపోయారన్నదే తెలుగుదేశం బాధ. వారికన్నా రామోజీరావు, రాధాకృష్ణల  ఏడుపు ఎక్కువ  అని వేరే చెప్పనవసరం లేదు. అందువల్లే జగన్ ప్రభుత్వం సాగర్ పై దండయాత్ర చేసిందని, జగన్నాటకం అని ఈ పత్రికలు రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్దంగా రాశాయి.

✍️అదే పని చంద్రబాబు చేసి ఉంటే ఆయన అదరగొట్టారని రాసి ఉండేవారు.టీవీలలో హోరెత్తించేవారు. ఇక్కడ తెలంగాణ రైతులకు నష్టం కలగాలని ఎవరూ కోరుకోరు. అలాగని ఏపీ లో రైతుల కష్టాలను కూడా చూడవలసిన బాద్యత  ప్రభుత్వం పై ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం ఏపీ పోలీసులపై కేసు పెట్టినా ఏమీ కాదు. దానికి ప్రతిగా  ఏపీ ప్రభుత్వం తెలంగాణ పోలీసులపై కేసు పెట్టింది! గతంలో ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన చంద్రబాబు  బుకాయించడమే కాకుండా, కేసీఆర్‌ పైనే ఎదురు కేసు పెట్టారు. అక్రమంగా టెలిఫోన్ టాపింగ్ చేశారంటూ హడావుడి చేశారు. ఆ తర్వాత కేసీఆర్‌, చంద్రబాబులు రాజీపడిపోయారు. ఏపీ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తూ చంద్రబాబు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిని వదలుకుని వెళ్లిపోయారు.ఇప్పుడు జగన్  తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగించకుండా ఏపీ హక్కులను పరిరక్షించుకోవడంలో  సఫలం అయ్యారని చెప్పవచ్చు.

✍️తెలంగాణలో వచ్చేది ఏ ప్రభుత్వం అన్నదానితో నిమిత్తం లేకుండా వ్యవహరించారు.  తమ జోలికి రాకుండా,పదే,పదే నీటి సరఫరా కోసం  తెలంగాణపై ఆధారపడే పరిస్థితి లేకుండా ఏపీ  ప్రభుత్వం జాగ్రత్తపడింది.కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీతో సమన్వయం చేసుకుని సమస్యను పరిష్కరించుకోవాలి. కేంద్రం కూడా ఇప్పుడు పూర్తి బాద్యత తీసుకోక తప్పదు.  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నట్లుగా ఈ ప్రాజెక్టులను  కృష్ణా బోర్ కు అప్పగించాలని కేంద్రం సూచించగా అందుకు  ఏపీ అంగీకరించింది కాని, తెలంగాణ ఒప్పుకోలేదు.బోర్డు అధీనంలో ఉంటే ఏమి జరుగుతుందో కాని, రెండు రాష్ట్రాల మధ్య గొడవ నేరుగా ఉండేదికాదేమో! ఈ వ్యవహారాలలో కేంద్రం  నిర్దిష్టంగా దశ,దిశను చూపలేకపోతోంది. విభజన చట్టం ప్రకారం ఆస్తుల పంపిణీ కూడా ఇంతవరకు కేంద్రం చేయలేకపోయింది. కోర్టులు కూడా తేల్చలేకపోతున్నాయి.

✍️ముఖ్యమంత్రి జగన్ ఇంత సున్నితమైన సమస్యను పరిష్కారం చేయడానికి తీసుకున్న చొరవ  విజయవంతం అవుతున్నందుకు ఏపీ ప్రజలు సంతోషిస్తున్నారు. అంతేకాక అవసరమైతే తమ తరపున ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికి , తమ ప్రయోజనాలను కాపాడడానికి జగన్ ఏ మాత్రం వెనుకంజ వేయరన్న సంగతి ప్రజలకు అర్ధం అయింది. దీనివల్ల తెలుగుదేశంకు నష్టం వస్తుందని భయపడే, ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియా సంస్థలు ఇందులో కూడా జగన్ పై ఏవేవో కారుకూతలు రాస్తూ వార్తలు ఇచ్చారు. రాష్ట్రం విలన్ అయిందని ఆంధ్రజ్యోతి అడ్డగోలుగా వ్యాఖ్యానించింది. తద్వారా ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు ఈ మీడియా శత్రువని మరోసారి రుజువైంది. ఏపీ ప్రజలకు జగన్ హీరో అన్న సంగతి  నిర్దారణ అయింది.


:::కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్

Advertisement
 
Advertisement
 
Advertisement