టిడ్కో ఇళ్లు ఎలా ఉన్నాయో చూడండి!

Kodali Nani Comments On TDP And Chandrababu Naidu - Sakshi

లబ్ధిదారులకు గృహాలను చూపించిన మంత్రి కొడాలి నాని

గుడివాడ రూరల్‌: టీడీపీ హయాంలో నిర్మించిన టిడ్కో గృహాలను రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) సంబంధిత లబ్ధిదారులకు సోమవారం చూపించారు. టిడ్కో గృహాలను వెంటనే లబ్ధిదారులకు ఇవ్వకపోతే వచ్చే జనవరిలో తామే ఇస్తామంటూ చంద్రబాబు, టీడీపీ నేతలు చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు మంత్రి  నాని సుమారు 5వేల మంది లబ్ధిదారులతో కలసి స్థానిక వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌ నుంచి మల్లాయపాలెంలోని టిడ్కో గృహ నిర్మాణ సముదాయం వరకు సోమవారం పాదయాత్ర నిర్వహించారు.

అక్కడ నిర్మాణంలో ఉన్న బ్లాక్‌ల తీరును, ఇప్పటివరకు నిర్మాణ పనులు ఏ దశలో ఉన్నాయనే విషయాలను అధికారుల ద్వారా లబ్ధిదారులకు వివరించే ప్రయత్నం చేశారు. టీడీపీ హయాంలో నిర్మించిన గృహాలకు ఎటువంటి మౌలిక సదుపాయాలు కల్పించని విషయాన్ని లబ్ధిదారులకు నేరుగా చూపించారు. ఏ ఒక్క గృహానికి ఫ్లోరింగ్‌ లేదని, కనీసం మంచినీటి పైప్‌లైన్‌ కూడా ఏర్పాటు చేయలేదని, విద్యుత్‌ సౌకర్యం అసలే లేదని, మురుగునీరు పోయేందుకు డ్రెయినేజీ సదుపాయం కూడా కల్పించలేదని లబ్ధిదారులకు వివరించారు. 

మే నెల నాటికి గృహ ప్రవేశాలు
అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడుతూ.. గృహ సముదాయాల్లో అసంపూర్తిగా మిగిలిపోయిన పనులను ఇప్పటికే చేపట్టామని.. వాటిని సంపూర్ణంగా అభివృద్ధి చేసి వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో మొదటి విడత లబ్ధిదారులకు అందజేస్తామని చెప్పారు. 2021 డిసెంబర్‌ నాటికి మొత్తం లబ్ధిదారులందరికీ గృహాలు ఇస్తామన్నారు.  గుడివాడలో లబ్ధిదారులకు ఇళ్లు నిర్మించి ఇవ్వకుంటే 2024 ఎన్నికల్లో తాను పోటీ చేయనని అన్నారు. పేదలకు ఇచ్చేందుకు కొనుగోలు చేసిన భూముల విషయంలో అవినీతి జరిగినట్టు నిరూపిస్తే తాను ఇక్కడే ఉరి వేసుకుంటానని, నిరూపించలేకపోతే చంద్రబాబు ఆ పని చేయడానికి సిద్ధమా అని సవాల్‌ చేశారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top