విద్వేషాలతో విధ్వంసం రేగితే దేశం వందేళ్లు వెనక్కు పోతుంది 

Kcr Fires on Bjp Communal Politics in India - Sakshi

విద్వేషాలతో విధ్వంసమే

మోదీ మీ ఆటలిక సాగవ్‌ 

తస్మాత్‌ జాగ్రత్త .. ప్రజలు గమనిస్తున్నారు 

దేశానికి తెలంగాణ లాంటి దిశానిర్దేశం కావాలి

టీఆర్‌ఎస్‌ ప్లీనరీ ముగింపు ప్రసంగంలో కేసీఆర్‌   

సాక్షి, హైదరాబాద్‌: ‘నరేంద్ర మోదీ...తస్మాత్‌ జాగ్రత్త. మీ ఆటలు ఇక సాగవు. ప్రజలు అంతా గమనిస్తున్నారు. మేల్కొంటారు. విద్వేషాలు పెంచడం వల్ల ఒకసారి విధ్వంసం రేగితే దేశం వందేళ్లు వెనక్కు పోతుంది.  అబద్ధాల పునాదుల మీద విద్వేషాలు పెంచడం అత్యంత ప్రమాదకరం..’అని టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు హెచ్చరించారు. బుధవారం సాయంత్రం ఆయన పార్టీ ప్లీనరీలో ముగింపు ఉపన్యాసం ఇచ్చారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను మరోసారి తూర్పారబట్టారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..  

హిందూ మతానికి వచ్చిన భయమేంటి? 
500 సంస్థానాలను విలీనం చేయడం ద్వారా భారతదేశం ఫెడరల్‌ శక్తిగా ఏర్పడింది. ఇలాంటి దేశంలోకి భయంకర విషాన్ని చొప్పిస్తున్నారు. ఏం ఆశించి ఇదంతా చేస్తున్నారు? ఇప్పటికిప్పుడు హిందూ మతానికి వచ్చిన భయం ఏంటో తెలియడం లేదు. దేశంలో రాష్ట్రపతి, ప్రధానమంత్రి, హైకోర్టు సీజే, ఒకరిద్దరు మినహా ముఖ్యమంత్రులంతా హిందువులే. ఈ పరిస్థితుల్లో హిందూ మతానికి వచ్చిన ప్రమాదమేంటి? గల్ఫ్‌ దేశాలు పెట్రోల్‌ బావులు రానంత వరకు పేద దేశాలే. ఆ తరువాత ధనికమయ్యాయి. పూర్తి ఇస్లామిక్‌ దేశాలు భవిష్యత్తును ఊహించి టూరిజాన్ని అభివృద్ధి చేశాయి. యూఏఈ, ఇతర దేశాల్లో హిందూ గుడులు కట్టిస్తున్నారు. హిందూ టూరిస్టుల కోసం వాళ్లు మత సహనం పాటిస్తున్నారు. అమెరికా పూర్తిగా క్రైస్తవ దేశం. అయినా అక్కడ ఏ మూలకు వెళ్లినా వెంకటేశ్వర స్వామి దేవాలయాలు ఉంటాయి. కానీ ఇక్కడ పొద్దున లేస్తే మతం. నీకు మనిషి కావాల్నా? మతమా? మనుషుల మధ్య చిచ్చు పెట్టే ఇంత సంకుచిత ఆలోచనలు అవసరమా? విద్వేషాలతో విధ్వంసం రేగితే దేశం వందేళ్లు వెనక్కి పోతుందనడానికి    జయప్రభ అనే రచయిత్రి నాకు చేసిన మెస్సేజ్‌ నిదర్శనం. 

ఎనిమిదేళ్లలో దేశానికి ఏం చేశారు?  
దేశానికి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యి ఎనిమిదేళ్లయింది. ఈ ఎనిమిదేళ్లలో ఏ రంగంలో అభివృద్ధి సాధించారు? వ్యవసాయ, విద్యుత్, ఉత్పాదక, పారిశ్రామిక మొదలైన రంగాల్లో ఎక్కడుంది అభివృద్ధి? కలలు కని సాకారం చేసుకోవచ్చని తెలంగాణ నిరూపించింది. దేశానికి అలాంటి దిశానిర్దేశం కావాలి.  

దేశ రాజకీయాల్లో కీలకపాత్రకు ప్రణాళికలు 
దేశ రాజకీయాల్లో రాబోయే రోజుల్లో కీలకపాత్ర పోషించబోతున్నాం. ఈ మేరకు ప్రణాళికలు రూపొందిస్తున్నం. మనం బాగుపడితే సరిపోదు. మన రాష్ట్రం ఉజ్వలంగా ఉండాలంటే.. దేశ రాజకీయాలు కూడా గొప్పగా ఉండాలని ప్లీనరీలో అందరూ చెప్పారు. ఆ మేరకు తప్పకుండా భవిష్యత్‌లో సరైన నిర్ణయాలు తీసుకొని, మన పాత్ర ఎలా ఉండాల్నో ఆలోచించుకొని ముందుకుపోవడం జరుగుతుంది. దేశ రాజకీయాలు, వ్యవస్థ, దేశ సమగ్ర స్వరూపం, ఉన్న వనరులేంటి? వసతులేంటి? అనేది చర్చిస్తున్నాం. దేశ విదేశాల్లో ఉన్న ఆర్థికవేత్తలను కూడా ఆహ్వానిస్తున్నాం. మేధావులను పిలుస్తున్నాం. హార్వర్డ్‌ యూనివర్సిటీ నుంచి కొందరు ముందుకు వస్తున్నరు. చర్చలు జరుగుతయ్‌.. వాళ్లంతా తేలుస్తారు.  

రిటైర్డ్‌ ఉన్నతాధికారులతో సదస్సు  
హైదరాబాద్‌లో 2 వేల మంది రిటైర్డ్‌ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ ఆఫీసర్లతో సదస్సు నిర్వహించబోతున్నాం. తెలియని విషయాలు తెలిసినట్లు నటించి భంగపాటుకు గురయ్యే బదులు ఏ పని చేపట్టినా సమగ్ర దృక్పథంతో, ఆలోచనతో ముందుకు వెళ్లాలి.  

కొత్త పంథాలో పురోగమించాలి 
75 సంవత్సరాల స్వాతంత్య్ర ఫలితం, ఉద్యమం ఆకాంక్షలు సాఫల్యం కాలేదని మనం చూసిన భారతదేశం చెబుతోంది. అందువల్ల ఈ సాధారణ రాజకీయ వ్యవస్థ నుంచి, ఫ్రంట్‌లు, టెంట్ల బాధ నుంచి బయటపడి కొత్త పంథాలో ముందుకు పురోగమించాలి. ఇందుకు ఏరకమైన పద్ధతులు ఎంచుకోవాలి? ఎలాంటి నిర్మాణాత్మక మార్పులు తీసుకురావాలి? ఏరకమైన విధానాల రూపకల్పన జరగాలనే దానిపై మథనం జరగాలి. దేశంలో నీళ్లు ఉన్నయ్, కానీ రైతులకు రావు. దేశంలో కరెంటు ఉన్నది, దాన్ని వినియోగించే సత్తా దేశాన్ని పాలిస్తున్న వారికి లేదు. మంచినీళ్లు, విద్యుత్, విద్య, వైద్యం ప్రాథమిక అవసరాలు. ఇవి కూడా 75 ఏళ్లలో సమకూర్చలేని పరిస్థితి. 

ధరలు పెరుగుతాయని ఎప్పుడో చెప్పా.. 
తెలంగాణలో భూముల ధరలు కోట్లు పలుకుతాయని 1987లోనే చెప్పిన. 1987లో నేను సత్యనారాయణ, మజ్జి తులసీదాస్‌ కలిసి కేరళకు వెళ్లాం. అక్కడ అప్పుడే ఎకరాకు కోట్లలో ధరలు. అక్కడ భూమి తక్కువ. వనరులు ఎక్కువ కావడమే అందుకు కారణం. అయితే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తెలంగాణలో కూడా భూముల విలువలు కోట్లకు పెరుగుతయ్‌ అని నేను చెప్పా.  ఇప్పుడది నిజమైంది. 

టీఆర్‌ఎస్‌కు రూ.1,000 కోట్ల ఆస్తులు  
జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలంటే అనేక రకాల వనరులు, డబ్బు కావాలని.. వాటిని ఎలా సమకూర్చుకుంటారని కొంతమంది మిత్రులు నన్ను అడిగారు. టీఆర్‌ఎస్‌కు రూ.1,000 కోట్ల ఆస్తులున్నాయి. ఇందులో రూ.865 కోట్ల నగదు బ్యాంకులో ఉంది. రూ. కోటి విరాళాలు ఇచ్చే సభ్యులు ఉన్నారు. లక్ష, వెయ్యి రూపాయలు విరాళాలు ఇచ్చేవారూ ఉన్నారు. బ్యాంకులో ఉన్న నగదు మీద రూ.3.84 కోట్ల వడ్డీ నెలనెలా వస్తుంది. దేశ రాజధాని ఢిల్లీలో, అలాగే హైదరాబాద్‌లో కేంద్ర కార్యాలయాలు ఉన్నాయి. 31 జిల్లాల్లోనూ పార్టీ కార్యాలయాలు ఉన్నాయి. భవిష్యత్తులో అన్ని నియోజకవర్గాల్లోనూ ఏర్పాటు చేస్తాం.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top