
గ్రేటర్ యవనికపై విభిన్న దృశ్యం!
కమల వికాసం..గులాబీ విలాపం..హస్త లాఘవం ..
రాజధానిలో రసవత్తరంగా లోక్‌సభ ఎన్నికల సమరం
సాక్షి, హైదరబాద్: రాష్ట్రంలో వచ్చేనెల జరుగనున్న లోక్‌సభ ఎన్నికలకు దాదాపు నెల రోజుల సమయం ఉంది. రాజధాని హైదరాబాద్ నగరానికి సంబంధించి ఎంఐఎం సంగతలా ఉంచితే..మిగతా మూడు ప్రధాన పారీ్టల్లో మూడు విభిన్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.
కమలం దూకుడు..
మూడో పర్యాయం కూడా దేశంలో అధికార పగ్గాలు చేపట్టాలన్న ఉత్సాహంలో బీజేపీ శ్రేణులు గ్రేటర్ ప్రచార పర్వంలోనూ దూసుకెళ్తూ మిగతా వారికంటే ముందంజలో ఉన్నాయి. గ్రేటర్ పరిధిలోకొచ్చే హైదరాబాద్, చేవెళ్ల, సికింద్రాబాద్, మల్కాజిగిరి లోక్‌సభ స్థానాలకు అందరికంటే ముందే బీజేపీ అభ్యర్థులను ప్రకటించడంతో వారిప్పటికే ప్రచారం ప్రారంభించారు. ప్రజలను కలుస్తున్నారు. జాతీయ స్థాయిలో వెలిగిపోతున్న మోదీ ప్రభను వివరిస్తూ దేశం కోసం చేసిన కార్యక్రమాలను చెబుతున్నారు. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్‌షాలు ఇప్పటికే ఓ రౌండ్ పర్యటించారు. ఈ నెల 13 తర్వాత మరో దఫా రానున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో డజను సీట్ల గెలుపు లక్ష్యంగా గ్రేటర్‌లోని నాలుగింటిపైనా కన్నేయడంతోపాటు మూడింట నెగ్గేలా వ్యూహరచన చేశారు. నియోజకవర్గాల వారీగా ప్రచారం జోరుగా సాగుతోంది. టిఫిన్ భేటీలు నిర్వహించారు. నోటిఫికేషన్ వెలువడ్డాక మరింత దూకుడు పెంచనున్నట్లు పారీ్టవర్గాల సమాచారం. బూటకపు గ్యారంటీలంటూ కాంగ్రెస్‌పై విమర్శల వర్షం గుప్పిస్తున్నారు. బీఆర్‌ఎస్ ఫోన్ ట్యాపింగ్‌లను ప్రస్తావిస్తున్నారు. పాదయాత్రలతో ఇంటింటికీ ప్రచారం ఇప్పటికే మొదలుకాగా, మరింత ముమ్మరం కానుంది.
సాధారణ ప్రచారం కంటే సోషల్‌మీడియా పవర్ తెలిసినందున ప్రతిరోజూ తప్పనిసరిగా కొన్ని పోస్టులుండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ పార్లమెంట్‌లో వరుసగా నెగ్గుతూ వస్తున్న అసదుద్దీన్ ఒవైసీపై పోటీకి హిందూ ధర్మ సంరక్షణ, సంఘ్ నేపథ్యం కలిగిన కొంపెల్ల మాధవీలతను బీజేపీ నిలబెట్టింది. ఇటీవల ‘ఆప్‌కీ అదాలత్’ ఇంటర్వ్యూలో ఆమె ఇచి్చన సమాధానాలు అసాధారణమైనవని, తర్కంతో మాట్లాడటమే కాక దృఢమైన అంశాలు ప్రస్తావించారని స్వయానా మోదీ ‘ఎక్స్’ వేదికగా పోస్టు చేశారు. దీంతో ఆమె ఎవరో తెలుసుకోవాలన్న ఆసక్తి నగర ప్రజల్లో పెరిగింది. ఇలా.. వివిధ అంశాల్లో బీజేపీ మిగతా
పారీ్టల కంటే ముందంజలో ఉంది.
డీలా పడ్డ గులాబీ
ఇక పదేళ్లపాటు ఓ వెలుగు వెలిగిన గులాబీ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలు కావడం, పార్టీ దళపతి కాలు విరగడం, ఎమ్మెల్సీ కవిత అరెస్టు, ఫోన్‌ట్యాపింగ్‌లు రేపుతున్న దుమారం తదితరమైనవి ఆ పార్టీని కోలుకోలేకుండా చేస్తున్నాయి. ప్రతిపక్షాల చర్యల్ని కేటీఆర్ ఎంతగా తిప్పికొడుతున్నా, అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరిస్తున్నా పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం తగ్గలేదు. పార్టీ అభ్యర్థులను ఎంతో ముందస్తుగా ప్రకటించిన చరిత్ర ఉన్న ఆ పార్టీ ప్రస్తుతం అభ్యర్థుల కోసం వెతుక్కునే దుస్థితి ఎదురైంది. పిలిచి టిక్కెట్టిస్తామన్నా ముందుకొచ్చేవారు లేకుండా పోయారు. పైసలు..ప్రచారం అన్నీ చూసుకుంటామన్నా పోటీచేసేందుకు గతంలో మాదిరి పోటీ లేదని పార్టీ నేతలే అంటున్నారు. సికింద్రాబాద్‌లో పోటీ చేసేందుకు తలసాని శ్రీనివాస్‌యాదవ్ ససేమిరా అనడంతో పద్మారావును కూర్చోబెట్టి ఒప్పించాల్సి వచి్చంది.
చేవెళ్లలో రంజిత్ రెడ్డి బీఆర్‌ఎస్‌కు చేయిచ్చి కాంగ్రెస్ పంచన చేరారు. దాంతో అక్కడ కాసాని జ్ఞానేశ్వర్‌ను దింపారు. మల్కాజిగిరిలోనూ ఉన్నవారిలో రాగిడి లక్ష్మారెడ్డికి ఇచ్చారు. అక్కడ పోటీ చేసేందుకు మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖరరెడ్డి వెనుకడుగు వేశారు. హైదరాబాద్‌పై ఎలాగూ ఆశల్లేవు కనుక ఎవరైనా ఒకటే కావడంతో గడ్డం శ్రీనివాస్‌యాదవ్‌కు టిక్కెట్టిచ్చారు. మరోవైపు ఎవరు ఎప్పుడు పారీ్టకి గుడ్‌బై చెబుతారో తెలియక,పార్టీ నేతలు గట్టు దాటకుండా చేసేందుకు పడరాని పాట్లు పడాల్సి వస్తోంది. ఎలాగోలా అభ్యర్థుల్ని ప్రకటించినా ప్రచారంలో జోష్ లేదు. ఎవరూ పెద్దగా ప్రజల్లోకి వెళ్లడం లేరు. కేవలం అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పార్టీ క్యాడర్‌తో సమావేశాలు తప్ప ప్రజల ముందుకెళ్లింది లేదు. ఇక మిగిలిన సమయంలోనైనా పుంజుకుంటారో లేదో వేచి చూడాల్సిందే.
‘ఆకర్ష్ పై’ కాంగ్రెస్ దృష్టి!
ఇక రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టి..విజయోత్సాహంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రచారం కంటే ఎక్కువగా ఇతర పారీ్టల నేతలు/అభ్యర్థులను తమవైపు ఆకర్షించడమే పనిగా పెట్టుకుంది. వారిని తమవైపు గుంజితే చాలు.. తమ బలం పెరిగిందని ప్రజలు ఓట్లేస్తారని భావిస్తున్నట్లున్నారు. కార్పొరేటర్లు, కౌన్సిలర్లను చేర్చుకుంటూ ముందుకు సాగుతోంది. మూడు సీట్లు పక్కా కొట్టాల్సిందేనని పార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చెబుతున్నప్పటికీ ఇంకా ప్రజల మధ్యకు వెళ్లలేదు. సికింద్రాబాద్‌లో దింపిన దానం నాగేందర్‌ను, మల్కాజిగిరిలో నిలబెట్టిన సునీతా మహేందర్‌రెడ్డిని, చేవెళ్లలో రంజిత్‌రెడ్డిని బీఆర్‌ఎస్ నుంచి లాగడం తెలిసిందే.
సికింద్రాబాద్ టిక్కెట్‌ను ప్రకటించినప్పటికీ దానం నాగేందర్ విముఖంగా ఉన్నట్లు చెబుతున్నారు. మరోవైపు పార్టీ మారితే చర్యలుండాల్సిందన్న రాహుల్‌గాంధీ వ్యాఖ్యలు కాంగ్రెస్‌కు ఇరకాటంగా మారాయి. అసెంబ్లీ ఎన్నికల గెలుపే ఈ ఎన్నికలకూ అక్కరకొస్తుందని, పారీ్టలోకి ఎక్కువ మందిని రప్పించడంపై దృష్టి సారించిన పారీ్ట.. ప్రజల మధ్యకు వెళ్లడం ఇంకా ప్రారంభించలేదు. చేరికలు, సభలతోనే ఇప్పటివరకు సరిపోయింది. మున్ముందు వైఖరి ఎలా ఉంటుందో చూడాల్సిందే.