
14 స్థానాల్లో గెలుపు లక్ష్యంగా కాంగ్రెస్ ప్రణాళికలు
మొత్తం 17 లోక్‌సభా స్థానాలు మూడు కేటగిరీలుగా విభజన
ఏ కేటగిరీలో 8, బీ కేటగిరీలో 6, సీ కేటగిరీలో 3 నియోజకవర్గాలు
8 స్థానాల్లో కష్టపడితే గెలవొచ్చని భావిస్తున్న అధికార పార్టీ
6 నియోజకవర్గాల్లో గెలుపు కష్టమైనా గట్టిగా కృషి చేయాలని యోచన
3 స్థానాల్లో గెలుపు అంత సులభం కాదనే భావన
ప్రతి కేటగిరీకి ప్రత్యేక వ్యూహాలు అమలు చేసేలా కసరత్తు
జాతీయ మేనిఫెస్టోతో పాటు 23 అంశాలతో కూడిన రాష్ట్ర మేనిఫెస్టో ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రణాళిక
నామినేషన్ల ఘట్టం ప్రారంభమయ్యాక ఉధృతంగా ప్రచారం
3 స్థానాలపై ప్రత్యేక దృష్టి
రాష్ట్రంలోని మూడు స్థానాల్లో గెలుపు అంత సులభమేమీ కాదని కాంగ్రెస్ భావిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్‌లో ఎంఐఎం, మెదక్‌లో బీఆర్‌ఎస్, కరీంనగర్‌లో బీజేపీలను నిలువరించడం కష్టమేనని నాయకత్వం అంచనా వేస్తున్నట్లు సమాచారం. అదే సమయంలో ప్రత్యేకంగా దృష్టి పెడితే గెలుపు అసాధ్యమేమీ కాదని కూడా అంతర్గత చర్చల్లో అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలుస్తోంది.హైదరాబాద్‌లో పరిస్థితి ఎలా ఉన్నా మెదక్‌లో మాత్రం బీసీ కార్డు ఉపయోగపడుతుందని, కరీంనగర్‌లో ధీటైన అభ్యర్థి కోసం వెతుకుతున్నామని, మొత్తం మీద మూడుచోట్లా విజయం లక్ష్యంతో గట్టిపోటీ ఇస్తామని నేతలు చెబుతున్నారు.
ముఖ్యంగా పార్టీ జాతీయ మేనిఫెస్టోతో పాటు 23 అంశాలతో రూపొందించిన తెలంగాణ ప్రత్యేక మేనిఫెస్టోను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తామని, 100 రోజుల రేవంత్ నేతృత్వంలోని ప్రభుత్వ పాలన గురించి ప్రజలకు వివరించి ఓట్లు అడుగుతామని అంటున్నారు. ఇప్పటికే పార్లమెంటు నియోజకవర్గాల వారీ సమీక్షలు పూర్తయిన నేపథ్యంలో ఇక అసెంబ్లీ స్థాయి సన్నాహక సమావేశాలకు సన్నద్ధమవుతున్నామని, నామినేషన్ల ఘట్టం ప్రారంభం నుంచి ఎన్నికల ప్రచారాన్ని మరింత ఉధృతం చేస్తామని చెబుతున్నారు.
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కనీసం 14 లోక్‌సభా స్థానాల్లో విజయం సాధించాలని కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం మూడంచెల వ్యూహాన్ని అమలు చేయనుంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఓట్లు, ఆ ఎన్నికల తర్వాత పార్టీ బలాబలాల్లో చోటుచేసుకున్న మార్పులు ప్రాతిపదికన రాష్ట్రంలోని మొత్తం 17 లోక్‌సభ స్థానాలను 3 కేటగిరీలుగా విభజించింది.
ఏ కేటగిరీ కింద కష్టపడితే గెలుపు సులభమేనని ధీమాగా ఉన్న స్థానాలు, బీ కేటగిరీ కింద ఎంత కష్టమైనా గట్టిగా కృషి చేస్తే గెలుపొందొచ్చని భావిస్తున్న నియోజకవర్గాలు, సీ కేటగిరీలో గెలుపు అంత సులభం కాదని భావిస్తున్న స్థానాలను చేర్చింది. ఈ మేరకు మూడు కేటగిరీల్లో మూడు ప్రత్యేక వ్యూహాలను అమలు చేయనుంది. ఈ మేరకు ఇప్పటికే పార్టీ ఇన్‌చార్జిలుగా ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ద్వితీయ శ్రేణి కేడర్‌కు సీఎం, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేస్తున్నారనే చర్చ గాందీభవన్ వర్గాల్లో జరుగుతోంది.
8 చోట్ల మెజారిటీపై దృష్టి: గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చాలాచోట్ల 20 వేల కంటే ఎక్కువ మెజార్టీ సాధించింది. 20–50 వేల మధ్య మెజార్టీ సాధించిన స్థానాలు 40 వరకు ఉన్నాయి. ఇందులో పార్లమెంటు స్థానాల వారీగా పరిగణనలోకి తీసుకుంటే కనీసం ఎనిమిది చోట్ల కాస్త కష్టపడితే విజయం ఖాయమని కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తోంది.
ఇందులో నల్లగొండ, భువనగిరి, ఖమ్మం, మహబూబాబాద్, పెద్దపల్లి, నాగర్‌కర్నూల్, వరంగల్, జహీరాబాద్ నియోజకవర్గాలున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా స్థానాల్లో సాధ్యమైనంత మెజార్టీ సాధన దిశగా వ్యూహరచన చేస్తున్నట్లు సమాచారం. ఈ వ్యూహంలో భాగంగా ఆయా జిల్లాల పరిధిలోని మంత్రులు, లోక్‌సభ ఇన్‌చార్జులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఎన్నికల ప్రక్రియలో చురుగ్గా పాల్గొనేలా చూసుకోవాలని, అలాగే పోలింగ్ రోజున అప్రమత్తంగా ఉంటే సరిపోతుందని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తున్నట్లు తెలిసింది.
ఆరుచోట్ల జాగ్రత్తగా..
కాంగ్రెస్ పార్టీ అంతర్గత లెక్కల ప్రకారం బీ కేటగిరీలో ఆరు స్థానాలున్నాయని తెలుస్తోంది. ఆదిలాబాద్, నిజామాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్, మహబూబ్‌నగర్ స్థానాల్లో గెలుపు కష్టమైనా.. అందుకోసం గట్టిగా కృషి చేయాలని అంచనా వేస్తున్నట్లు సమాచారం. మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం తాను ప్రాతినిధ్యం వహిస్తున్నది కావడంతో ఈ నియోజకవర్గాన్ని సీఎం రేవంత్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇక్కడ కాంగ్రెస్ మాజీ నేత, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె.అరుణ పోటీ చేస్తున్న నేపథ్యంలో ఎలాగైనా కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డిని గెలిపించడం ద్వారా ఉమ్మడి పాలమూరు రాజకీయాల్లో ఆధిపత్యం చాటాలని ఆయన పట్టుదలతో ఉన్నట్టు చెబుతున్నారు. ఇక నిజామాబాద్‌లో జీవన్‌రెడ్డి, ఆదిలాబాద్‌లో ఆత్రం సుగుణ అభ్యర్థిత్వాలు కలిసి వస్తాయని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
వీరిద్దరికీ ఉన్న మంచి పేరుకు తోడు పార్టీ అభ్యర్థిత్వాలు కలిసి రేసులో ప్రతిపక్షాల కంటే ముందే ఉంటామనే ధీమాతో అధికార పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి స్థానాలకు గ్రేటర్ హైదరాబాద్‌తో సంబంధమున్న నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూసుకుంటే ఇక్కడ గెలుపు కష్టమేనని, అయితే మారిన రాజకీయ పరిణామాలు, అభ్యర్థుల ఖరారులాంటి అంశాలు విజయానికి బాటలు వేస్తాయని భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ ఆరు స్థానాల్లో ఏ స్థానానికి ఆ స్థానంలో ప్రత్యేక ప్రణాళికలను అమలు చేయనున్నట్లు తెలుస్తోంది.