
రేపు తుక్కుగూడలోకాంగ్రెస్ బహిరంగ సభను 10 లక్షల మందితో నిర్వహించాలి
మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలకు సీఎం, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం
ఖర్గే, రాహుల్, ప్రియాంకహాజరయ్యే సభను విజయవంతం చేయడంపై ప్రత్యేక దృష్టి
సభాస్థలి వద్ద ఏర్పాట్ల పరిశీలన.. అక్కడే గంటన్నరపాటు సమావేశం
పార్కింగ్‌కు ఇబ్బందుల్లేకుండా చూడాలని ఆదేశం
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికలకు జాతీయ స్థాయిలో శంఖారావంగా కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో ఈ నెల 6న నిర్వహించనున్న జన జాతర బహిరంగ సభను విజయవంతం చేయడంపై ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్ ఎ. రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టిపెట్టారు. 60 ఎకరాల మైదానంలో నిర్వహించే ఈ సభ ఏర్పాట్లను మంత్రివర్గ సహచరులు, పార్టీ ఎంపీ అభ్యర్థులతో కలసి పర్యవేక్షిస్తున్నారు.
ఇందుకోసం పార్టీ నేతలతో వివిధ కమిటీలు ఏర్పాటు చేసిన సీఎం... గురువారం సాయంత్రం స్వయంగా సభా వేదిక వద్దకు వెళ్లి, మంత్రులు, పార్టీ నేతలతో సుమారు గంటన్నరపాటు సమావేశమయ్యారు. పదేళ్ల తరువాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సత్తా చాటేలా 10 లక్షల మందితో కనీవినీ ఎరుగని రీతిలో సభ నిర్వహించేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు.
ఈ భేటీలో మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, సీతక్క, ఎమ్మెల్యేలు రాజగోపాల్‌రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి, దానం నాగేందర్, పలువురు ఎంపీ అభ్యర్థులు పాల్గొన్నారు.
10 లక్షల జనం తరలాల్సిందే
పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ నేత ప్రియాంకా గాంధీ హాజరయ్యే ఈ సభ ద్వారా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ సత్తా చాటాలని రేవంత్‌రెడ్డి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. ఈ సభా వేదిక నుంచే జాతీయ స్థాయిలో పార్టీ మేని ఫెస్టోను విడుదల చేయడంతోపాటు అధికారంలోకి వస్తే అమలు చేయనున్న ఐదు గ్యారంటీలను కూడా రాహుల్ గాంధీ ప్రకటించనున్న నేపథ్యంలో సభకు దేశవ్యాప్తంగా ప్రాచుర్యం లభించనుందని రేవంత్ పేర్కొన్నారు.
అందువల్ల సభను విజయవంతం చేసేందుకు ఉమ్మడి 10 జిల్లాల నుంచి మొత్తం 10 లక్షల మంది ప్రజలను సభకు తరలించాల్సిందేనని స్పష్టం చేశారు. ఇందుకోసం అన్ని జిల్లాల మంత్రులు, ఇన్‌చార్జి మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలతోపాటు పార్టీ ఎంపీ అభ్యర్థులు కూడా శ్రద్ధ తీసుకోవాలని సీఎం చెప్పినట్లు సమాచారం.
ప్రధానంగా హైదరాబాద్, రంగారెడ్డి, పాలమూరు, నల్లగొండ, ఖమ్మం, మెదక్ జిల్లాల నుంచి భారీగా జన సమీకరణ జరపాలని రేవంత్ స్పష్టం చేసినట్లు తెలిసింది. సభ జరిగే మైదానం పక్కనే సుమారు 300 ఎకరాల ఖాళీ స్థలం అందుబాటులో ఉండటంతో సభకు వచ్చే వాహనాల పార్కింగ్‌కు ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగానికి సీఎం ఆదేశాలు జారీ చేశారు.
జగ్జీవన్ జీవితం స్ఫూర్తిదాయకం: రేవంత్
సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌రామ్ జీవితం స్ఫూర్తిదాయకమని, దేశానికి ఆయన చేసిన సేవ లు చిరస్మరణీయమని సీఎం రేవంత్ కొనియాడా రు. జగ్జీవన్‌రామ్ 117వ జయంతిని పురస్కరించుకొని ఆయన సేవలను స్మరించుకున్నారు.