సంక్షేమ సర్కారుకు లంకతో పోలికా?

CM YS Jagan Comments On Chandrababu And Yellow Media - Sakshi

ఇది ఇలాగే కొనసాగితే తమకు ఒక్కరూ ఓటేయరని దొంగల ముఠా బెంబేలు: సీఎం జగన్‌

మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసి హైదరాబాద్‌లో గడుపుతున్నారు

ప్రధాని నాకు ఏం చెప్పారో సోఫా కింద నక్కి విన్నారా?

అక్కడ గదిలో ఉన్నది మేమిద్దరమే.. 

జగన్‌ వచ్చాక మీకు మంచి జరిగిందా.. లేదా?

ప్రతి అక్కచెల్లెమ్మ, అన్నదమ్ములు ఆలోచించాలి

సాక్షి  ప్రతినిధి, గుంటూరు: పేదలకు సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తే రాష్ట్రం శ్రీలంకగా మారిపోతుందంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు, ఎల్లో మీడియా కలసి దుష్ప్రచారాన్ని ప్రారంభించాయని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పాలన ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో తమకు ఒక్కరు కూడా ఓటు వేయరని ఖజానాను దోచుకున్న దొంగల ముఠా బెంబేలెత్తుతోందని వ్యాఖ్యానించారు. ఎన్నికలు ముగియగానే మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసి హైదరాబాద్‌లో గడుపుతున్నారని ధ్వజమెత్తారు. గురువారం నరసరావుపేటలో వలంటీర్ల సత్కార కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. 

ఎగ్గొడితే అమెరికా అవుతుందా?
పేదలకు సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తే మన రాష్ట్రం శ్రీలంక అవుతుందట. ఎన్నికలప్పుడు ఇచ్చిన ఏ ఒక్క హామీని వారి మాదిరిగా అమలు చేయకపోతే అమెరికా అవుతుందట. వారి మాదిరిగా ప్రజలకు వెన్నుపోటు పొడిస్తే అమెరికా అవుతుందట. ఇలా మాట్లాడుతున్న వారికి మనసు, నీతి, న్యాయం, ధర్మం లాంటి పదాలకు ఏ కోశానైనా అర్థం తెలుసా? నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి పారదర్శకంగా డబ్బులు అందించేలా వారి హయాంలో ఏ రోజూ మంచి చేయలేదు. 

మనుషుల రూపంలో దయ్యాలు..
గతంలో దోచుకున్నది వీళ్లే. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందీ వీళ్లే. మంచి చేయకపోగా మనసున్న మనందరి ప్రభుత్వంపై నిందలు మోపేదీ వీళ్లే. ఇదే చంద్రబాబు, ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే టీవీ 5, ఇదే దత్తపుత్రుడు! రైతులను, పేదలను, అక్కచెల్లెమ్మలను, పిల్లలను ద్వేషించే ఇలాంటి వారిని మనుషులు అనాలా? లేకపోతే మనుషుల రూపంలో ఉన్న దయ్యాలు అనాలా? మీరే ఆలోచించండి. వారికి మద్దతిచ్చి మంచిని ఛిన్నాభిన్నం  చేసే ఈ ఎల్లోమీడియాను మీడియా అనాలా? లేక రక్తపిశాచులు అనాలా? 

సోఫా కింద నక్కారా?
రాష్ట్రానికి ఫలానావి కావాలని అడిగేందుకు నేను ఢిల్లీకి వెళ్లా. అక్కడ ప్రధానమంత్రితో సమావేశం దాదాపుగా గంటకు పైగా మంచి వాతావరణంలో జరిగింది. అక్కడున్నది మేమిద్దరమే. దీన్ని చంద్రబాబు, దత్తపుత్రుడితోపాటు ఎల్లో మీడియా జీర్ణించుకోలేకపోతున్నారు. జగన్‌కు ప్రధాని క్లాస్‌ తీసుకున్నారంటూ ఎల్లో మీడియా కథనాలు రాస్తోంది. ఎల్లో మీడియాలో అగ్రస్థానంలో ఉన్న ఈనాడు, రాధాకృష్ణ, టీవీ 5, చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు వీళ్లంతా.. మోదీగారి సోఫా కిందనో... లేకపోతే నా సోఫా కిందనో నక్కి మా మాటలను విన్నారా? 

జగన్‌ వచ్చాక మంచి జరిగిందా.. లేదా?
ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి అక్కచెల్లెమ్మను, అన్నదమ్ములను మీ గుండెలపై చేయి వేసుకుని ఆలోచన చేయమని కోరుతున్నా. జగన్‌ వచ్చిన తర్వాత మీకు మంచి జరిగిందా? లేదా? అన్నది ఆలోచన చేయమని కోరుతున్నా. మంచి జరిగింది అంటే జగన్‌ను ఆశీర్వదించండి... చెడు జరిగింది అంటే జగన్‌ను ద్వేషించండి. కానీ ఈ ఎల్లో మీడియాను, బాబును, దత్తపుత్రుడిని మాత్రం నమ్మొద్దు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top