
అభ్యర్థికి నియామక పత్రం అందజేస్తున్న సీఎం రేవంత్. చిత్రంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: పదేళ్ల పాటు ప్రజలను గోస పెట్టిన కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులు ఉరితాళ్లు కట్టుకుని వేలాడినా.. ప్రజలు సానుభూతి చూపరని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఇంటికి కూత వేటు దూరంలో ఉన్న అసెంబ్లీకి రావడానికి కేసీఆర్‌కు చేత కాలేదు కానీ, కట్టె పట్టుకొని సానుభూతి కోసం నల్లగొండకు వెళ్లారని విమర్శించారు. గురువారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో గురుకుల ఉపాధ్యాయ నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పేదల కోసం పని చేస్తుంటే.. మామా అల్లుళ్లు తమను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారని దుయ్యబట్టారు. గత ప్రభుత్వం చేసిన దోపిడీని చూపించేందుకే మేడిగడ్డకు వెళ్లామని, ప్రాజెక్టు పేక మేడలా కూలిపోయే పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. ప్రాజెక్టులపై చర్చ పెడితే అసెంబ్లీకి రాకుండా పారిపోయారన్నారు.
ఔరంగజేబు అవతారమెత్తాల్సిందే
హరీశ్‌రావు పదవి కోసం ఔరంగ జేబు అవతారమెత్తాల్సిందేనని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ‘నువ్వు రాజీనామా చెయ్.. నేను చేసి చూపిస్తా’ అని హరీశ్‌రావు చెబుతున్నారని, దీనిని బట్టి సీఎం కావడానికి హరీశ్‌రావు.. మరో ఔరంగజేబు కావాల్సిందేనని ఎద్దేవా చేశారు. అధికారం కోసం సొంత వాళ్లపైనే కర్కశంగా ప్రవర్తించిన చరిత్ర ఔరంగజేబుదని గుర్తు చేశారు. పదేళ్లు అధికారంలో ఉన్నపుడు గాలికి తిరిగారా? అని ప్రశ్నించారు. దోచుకున్నది దాచుకోవడానికి బీఆర్‌ఎస్ పదేళ్లు పనిచేసిందన్నారు. ఒక రైతు బిడ్డ సీఎం కుర్చీలో కూర్చుంటే కేసీఆర్ కళ్లు మండుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
త్వరలో గ్రూప్–1 పరీక్ష నిర్వహిస్తాం
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగ నియామకాలపై దృష్టి సారించిందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. యూపీఎస్సీ తరహాలో టీఎస్‌పీఎస్సీలో నియామకాలు చేపట్టాలని నిర్ణయించామని. త్వరలో గ్రూప్–1 పరీక్ష నిర్వహిస్తామన్నారు. అధికారం చేపట్టిన 70 రోజుల్లోనే దాదాపు 25వేల ఉద్యోగ నియామకాలు చేపట్టామని వివరించారు. ప్రతి నియోజకవర్గంలో ఒకే కాంప్లెక్స్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు.
విద్యార్థుల్లో సోదర భావం మరింత పెంపొందించేందుకు గురుకుల పాఠశాలలన్నింటినీ ఒకే గొడుకు కిందకు తెస్తామన్నారు. పైలట్ ప్రాజెక్టుగా కొండగల్‌లో సుమారు 20 ఎకరాల్లో వంద కోట్ల వ్యయంతో గురుకులాల సముదాయం నిర్మించనున్నట్లు వెల్లడించారు. అన్ని నియోజకవర్గాల్లో ఇందుకు కావాల్సిన స్థలాలను సేకరించాలని అధికారులకు ఆదేశాలిస్తున్నట్లు చెప్పారు. త్వరలో మెగా డీఎస్సీ ద్వారా నియామకాలను చేపడతామన్నారు.
వైఎస్సార్‌ది జనరంజక పాలన
దివంగత వైఎస్సార్ హయాంలో జనరంజక పాలన సాగిందని రేవంత్‌రెడ్డి చెప్పారు. 2004లో ఇదే ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్సార్ సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణ, విద్యుత్ బకాయిల మాఫీ, ఉచిత విద్యుత్, ఆరోగ్య శ్రీ, ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు, ఫీజురీయింబర్స్‌మెంట్ తదితర సంక్షేమ పథకాలు అమలు చేసిందని గుర్తు చేశారు. ఆదే స్ఫూర్తి, ఆలోచనతో తిరిగి ప్రభుత్వం ఏర్పాటు కోసం ప్రయత్నించామన్నారు. కాంగ్రెస్ విజయంలో నిరుద్యోగుల కృషి మరవలేదని చెప్పారు..
గ్రీన్ చానల్ ద్వారా మెస్ చార్జీలు: మంత్రి పొన్నం
ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ గురుకులాలకు మెస్ చార్జీలను గ్రీన్ చానల్ ద్వారా అందించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. 2004–14 మధ్య మెస్ చార్జీలన్నీ గ్రీన్ చానల్ ద్వారా పేమెంట్ అయ్యేవని, కానీ 2014 తరువాత రెండేళ్ల వరకు మెస్ చార్జీలు రాక నాణ్యత కొరవడిందని ఆవేదన వ్యక్తం చేశారు. గురుకులాలు ఎంతోమంది ఐఏఎస్, ఐపీఎస్‌లతోపాటు ఎంతో ఉన్నత స్థానాల్లో ఉన్న వారిని తయారుచేశాయని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తదితరులు మాట్లాడారు.