
సాక్షి, హైదరాబాద్: పదేళ్లు తానే సీఎంగా ఉంటానని, ప్రజలు ఆశీర్వదిస్తే ఇంకో పదేళ్లు ఇందిరమ్మ రాజ్యమే ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వెంటనే అధికారంలోకి వస్తామని కేసీఆర్ అంటున్నాడని, కేసీఆర్ ఎట్లా వస్తడో ఆయన సంగతేందో చూస్తానని అన్నారు. ‘చంద్రశేఖర్‌రావు.. నీకు సూటిగా సవాలు విసురుతున్నా..ఈ పదేళ్లలో నా ఒక్క వెంట్రుకనైనా పీకుతావేమో చూడు..’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఖేల్ ఖతం..దుకాణ్ బంద్ అయ్యిందని అన్నారు. శాసనసభకు రావడానికి చేతకాని కేసీఆర్ వీల్ చైర్లలో నల్లగొండ సభకు వెళ్లి సెంటిమెంట్ డ్రామాలకు తెర తీస్తున్నారని విమర్శించారు.
ప్రజలు మళ్లీ కేసీఆర్ మాయలో పడవద్దని అన్నారు. బుధవారం మధ్యాహ్నం ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో.. పోలీసు, జైళ్లు, అగ్నిమాపక, ఎక్సైజ్, రవాణా శాఖల్లో కానిస్టేబుళ్లుగా ఎంపికైన మొత్తం 13,445 మంది అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలను సీఎం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. ‘కేసీఆర్ 3,565 రోజులు అధికారంలో ఉన్నారు. అప్పుడే మా ప్రభుత్వం ఏమీ చేయలేదని విమర్శలు చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు పదవులు లేకపోతే నెలల సమయం కూడా ఆగకుండా తన కూతురు కవితతో సహా అందరికీ పదవులు ఇచ్చారు.
జూన్ 2, 2014న తెలంగాణ ఏర్పడిన గంటల వ్యవధిలోనే తన కుటుంబ సభ్యులకు మంత్రి పదవులు ఇచ్చుకున్నారు. 2019లో కూతురు కవిత ఓడిపోతే కేసీఆర్‌కు ఎంతో దుఖం వచ్చింది. ఆరు నెలలు తిరగకముందే ఎమ్మెల్సీ చేశాడు. ఇలా కుటుంబ సభ్యులు, బంధువులకు రాజకీయ పదవులు లేకపోతే వంద రోజులు కూడా ఆగని కేసీఆర్...నిరుద్యోగుల్ని మాత్రం పట్టించుకోలేదు. దాదాపు పదేళ్లుగా 30 లక్షల మంది యువత ఉద్యోగాలకు కోసం ఎదురు చూసేలా చేశారు.
ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రయత్నం చేస్తుంటే..కాళ్లలో కట్టె పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. గత ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ సమాజం తిరస్కరించింది. కామారెడ్డిలో కేసీఆర్‌ను అక్కడి ప్రజలు బండకేసి కొట్టి ఓడించారు. తెలంగాణను కుటుంబం కోసం బలి ఇచ్చిన కేసీఆర్‌కు తెలంగాణ యువ పోలీసులు తగిన బుద్ధి చెబుతారు. గత ప్రభుత్వంలోని కంచర గాడిదలను ఇంటికి పంపించి, రేస్ గుర్రాలను ప్రభుత్వంలోకి తెచ్చుకున్నామని ప్రజలు అనుకుంటున్నారు..’ అని రేవంత్ అన్నారు.
నేను రేవంత్ అన్నలా అండగా ఉంటా..
‘కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజుల వ్యవధిలోనే ఉద్యోగ నియామకాలకు సంబంధించిన కోర్టు సమస్యలు పరిష్కరిస్తూ ఒక్కో విభాగంలో ఉద్యోగ నియామక పత్రాలు ఇస్తోంది. నిరుద్యోగులతో సంతోషం పంచుకోవాలనే ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు ఇస్తున్నాం. ఎల్బీ స్డేడియంలో ముఖ్యమంత్రిగా నేను పదవీ స్వీకారం చేసినప్పుడు ఎంత సంతోషం కల్గిందో..అంతే ఆనందం పోలీస్ కానిస్టేబుల్ నియామక పత్రాలు ఇస్తున్నప్పుడు కల్గుతోంది. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు రేవంత్ అన్నగా అండగా ఉంటా. అధైర్యం వద్దు. యువత పోటీ పరీక్షలకు సిద్ధం కావాలి. రాష్ట్రాన్ని సాధించుకున్న యువతకు ప్రభుత్వంలో, ప్రైవేటులో ఉద్యోగాలు, ఉపాధి కలి్పంచే బాధ్యత సీఎంగా నేను తీసుకుంటా.
2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తాం
ఉద్యోగ నియామకాలలో తప్పిదాలకు తావు లేకుండా, ఎవరికీ నష్టం లేకుండా చర్యలు తీసుకుంటాం. రాబోయే రోజుల్లో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాం. టీఎస్‌పీఎస్సీలో గతంలో జరిగిన అక్రమాలను నిలువరిస్తాం. పదేళ్లుగా గ్రూప్–1 పరీక్ష నిర్వహించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే 567 పోస్టుల భర్తీ ప్రక్రియ మొదలు పెట్టాం.
నిరుద్యోగులకు నష్టం జరగకుండా వయో పరిమితిని 44 ఏళ్ల నుంచి 46 ఏళ్లకు పెంచాం. అయితే పంజాబ్‌లో యువత గంజాయి, డ్రగ్స్‌తో నిర్వీర్యమైంది. ఆ పరిస్థితి తెలంగాణలో రాకుండా టీఎస్ న్యాబ్ విభాగాన్ని ఏర్పాటు చేసి పట్టిష్టం చేస్తున్నాం. పోలీస్ శాఖలో కొత్తగా భర్తీ అవుతున్న వారు కూడా తెలంగాణను గంజాయి, మత్తుపదార్థాలు లేని రాష్ట్రంగా మార్చుతామని ప్రతినబూనాలి. రాష్ట్రంలో డ్రగ్స్ వాడాలంటే వణుకు పుట్టే పరిస్థితి రావాలి..’ అని సీఎం అన్నారు.
ఆ సంతకం రైతులకు మరణ శాసనం
‘కృష్ణా నీటిని ఏపీ కేటాయిస్తూ కేసీఆర్ పెట్టిన ఆ సంతకం ఇప్పుడు తెలంగాణకు గుదిబండగా..ఇక్కడి రైతులకు మరణశాసనంగా మారింది. ఈ పరిస్థితుల్లో సెంటిమెంట్‌ను రెచ్చగొట్టేందుకే కేసీఆర్ నీళ్ల దారి పట్టిండు. మేడిగడ్డ అనే మేడిపండులోని అవినీతి పురుగులు బయటపడతాయన్న భయంతోనే కృష్ణానదీ జలాల అంశాన్ని తెరపైకి తెచ్చారు. నీళ్లు, నిధులు, నియామకాలపై చర్చ కోసం అసెంబ్లీకి రమ్మంటే.. నల్లగొండకు వెళ్లి కేసీఆర్ బీరాలు పలుకుతున్నాడు.
‘కంచర గాడిదలను ఇంటికి పంపించి రేస్ గుర్రాలను తెలంగాణ ప్రజలు తెచ్చుకున్నారని, ఆ కంచర గాడిద మళ్లీ అధికారం రావడం కలలో మాట’ అని శాసనసభలో ఒక అటెండర్ నాతో అన్నాడు..’ అని రేవంత్ చెప్పారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్రానికి తెల్ల ఏనుగులా మారిందని అన్నారు. ప్రజల తీర్పు గౌరవించలేని స్థితిలో కేసీఆర్ ఉన్నారని, అధికారం పోయినా ఆయన భాష మారలేదని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో బానిస భవన్‌గా మారిన ప్రగతి భవన్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాభవన్‌గా మార్చామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.