నమ్మించి నట్టేట ముంచడంలో చంద్రబాబు దిట్ట.. ఆ ఇద్దరు నేతల పరిస్థితేంటో!

Chandra Babu Naidu Creates Dailama On Assembly Ticket Nuziveedu - Sakshi

గాలిలో ఎగిరొచ్చినవాళ్ళకు టిక్కెట్లు పచ్చపార్టీలో మామూలే. పైగా రాత్రికి రాత్రే ఇన్చార్జ్లను మార్చడం కూడా చంద్రబాబుకు అలవాటే. ఏలూరు జిల్లా నూజివీడులో కూడా ఇప్పుడు అదే పరిస్థితి కనిపిస్తోందట. ఇక్కడ ఇద్దరు నేతలకు చంద్రబాబుకు హామీ ఇచ్చారట. చంద్రబాబు సంగతి తెలిసి ఇద్దరూ అయోమయానికి గురవుతున్నారట. ఇంతకీ ఆ ఇద్దరూ ఎవరో చూద్దాం.

నమ్మించి నట్టేట ముంచడంలో దేశంలోని రాజకీయ నాయకులందరి కంటే నాలుగాకులు ఎక్కువ చదివింది టీడీపీ అధినేత చంద్రబాబునాయుడే అని అందరి ఏకాభిప్రాయం. చంద్రబాబును నమ్మితే నట్టేట మునగడం ఖాయమని ఇప్పటికే పచ్చ పార్టీలో పనిచేసిన అనేకమంది నాయకుల స్వానుభవం కూడా. తాజాగా ఏలూరు జిల్లా నూజివీడులో కూడా అదే ఫార్ములా అమలు చేయబోతున్నారట చంద్రబాబునాయుడు. ప్రస్తుతం నూజివీడు నియోజకవర్గానికి ఇంఛార్జిగా ముద్రబోయిన వెంకటేశ్వరరావు వ్యవహరిస్తున్నారు. గత రెండు ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ఈసారి ఎలాగైనా గెలవాలని ఆయన పట్టుదలగా ఉన్నారు. ఐతే ముద్రబోయిన నూజివీడులో కొందరికి మాత్రమే చేరువయ్యారు. కమ్మసామాజిక వర్గ నేతలు ఆయన్నింకా గుర్తించడంలేదట. అందుకే ఈసారి కమ్మనేతను నిలిపితేనే నూజివీడులో సహకరిస్తామని లోకల్ తమ్ముళ్లంతా తేల్చేయడంతో పాటుగా, ముసునూరు మండలానికి చెందిన పర్వతనేని గంగాధరరావును తెరపైకి తెచ్చారట. గంగాధర్ నూజివీడులో ఎంట్రీ ఇవ్వడంతోనే ఫంక్షన్లు, ప్రారంభోత్సవాలు అంటూ గ్రామాలన్నీ తిరిగేస్తున్నారు. నియోజకవర్గ ఇన్చార్జ్ ముద్రబోయిన వ్యతిరేక వర్గాన్నంతా తనవైపు లాగేసుకున్నారట. దీంతో గంగాధరే ఈసారి క్యాండెట్ అని కమ్మనేతలంతా ఫిక్సయిపోయారని టాక్. 

చంద్రబాబు తీరుతో షాక్‌
ఇంతవరకూ బాగానే ఉన్నట్లు కనిపిస్తున్నా..ఇటీవల నూజివీడులో చంద్రబాబు పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలతో మళ్లీ కన్ఫ్యూజన్ మొదలైందట. చంద్రబాబు పర్యటన మొత్తం ఖర్చంతా పర్వతనేని గంగాధరే భరించారట. నియోజకవర్గ వ్యాప్తంగా జనసమీకరణకు, వారి భోజన ఏర్పాట్లకు డబ్బును మంచినీళ్లలా ఖర్చుచేశారట. దీంతో ఏర్పాట్లపై చంద్రబాబు సైతం ఖుషీ అయిపోయారట. కట్ చేస్తే మీటింగ్ దగ్గరకు వచ్చే సరికి చంద్రబాబు వ్యవహరించిన తీరుతో పర్వతనేని వర్గం షాకయ్యిందని టాక్. ముద్రబోయిన మినహా తన పక్కన ఎవరూ ఉండటానికి వీల్లేదంటూ చంద్రబాబు హుకుం జారీ చేయడంతో గంగాధర్ ఖంగుతిన్నారట. చంద్రబాబు అలా అనేసరికి ముద్రబోయిన కూడా హ్యాపీగా ఫీలై...ఇక టిక్కెట్ తనకే అనే క్లారిటీకి వచ్చేశారట. 

ఇదిలా ఉంటే అధినేత పర్యటనకు ఖర్చంతా భరిస్తే తనను పక్కకు కూడా రానివ్వకపోవడంపై గంగాధర్ అసంతృప్తితో రగిలిపోయారట. దీంతో ఇటీవల తన మద్దతుదారులను వెంటేసుకుని హైదరాబాద్లో చంద్రబాబును కలిసి నా లెక్కేంటో తేల్చాలని పట్టుబట్టారట పర్వతనేని గంగాధర్. నూజివీడు కమ్మ నేతలంతా ఎట్టిపరిస్థితుల్లోనూ సీటు గంగాధర్ కే ఇవ్వాలని.. లేనిపక్షంలో తాము సహకరించేది లేదని తేల్చేయడంతో.. చంద్రబాబు సైతం వారి ముందు సరేనని తలాడించారట. ఐతే నూజివీడులో అలా ... హైదరాబాద్ లో మరోలా ఇరు వర్గాలకు టిక్కెట్ మీకే అని అభయం ఇచ్చేలా చంద్రబాబు వ్యవహరించిన తీరు ఇప్పుడు నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారిందట. 

కట్ చేస్తే నూజివీడు మీదే ఆశలు పెట్టుకుని పార్టీ కోసం కష్టపడుతున్న ముద్రబోయిన, తాను రియల్ ఎస్టేట్లో సంపాదించిన డబ్బంతా ఖర్చు చేస్తున్న గంగాధర్ ఆలోచనలో పడ్డారట. 2009లో రాత్రికి రాత్రి చిన్నం రామకోటయ్య నూజివీడు ఇంఛార్జిగా బాధ్యతలు చేపట్టి టిక్కెట్ ఖరారు చేయించుకున్నారు. ఇప్పుడు కూడా తమకు 2009లో ఎదురైన పరిస్థితులు వస్తే ఏం చేయాలంటూ.. అటు ముద్రబోయిన ఇటు పర్వతనేనికి టెన్షన్ మొదలైందట. చినబాబును, చంద్రబాబును నమ్ముకున్నందుకు తమను నట్టేట ముంచరు కదా అని తమ అనుచరుల వద్ద బాధపడుతున్నారట ఈ నాయకులిద్దరూ. మరి చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి.

పొలిటికల్‌ ఎడిటర్‌, సాక్షి వెబ్‌డెస్క్‌

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top