‘గులాబ్‌’ పోయింది.. గులాబీ చీడ మిగిలింది 

Bandi Sanjay Slams TRS - Sakshi

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ 

హుజూరాబాద్‌లో ఫాంహౌస్‌ స్కెచ్‌లు పనిచేయవని వ్యాఖ్య 

సాక్షి, సిద్దిపేట: ‘తెలంగాణలో గులాబ్‌ తుపాను పోయింది. గులాబీ చీడ మాత్రం మిగిలే ఉంది’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ టీఆర్‌ఎస్‌నుద్దేశించి వ్యాఖ్యానించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీచీడను వదిలించి బీజేపీ ఆధ్వర్యంలో పేదల ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో 33వ రోజు ప్రజాసంగ్రామ పాదయాత్ర కొనసాగింది. కోహెడ మండల కేంద్రంలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ వరి వేస్తే ఉరి అని చెప్పిన సీఎం ఫాంహౌస్‌కు వెళ్లి పోయారని, ఈ విషయంలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం వల్ల రాష్ట్రంలో ఐదుగురు రైతులు మృతి చెందారని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం భూసార పరీక్షల కోసం ఇచ్చిన రూ.120 కోట్లను వినియోగించకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. ‘కేసీఆర్‌.. రాష్టానికి ఎన్ని కంపెనీలు తెచ్చావ్, ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చావ్‌ , ఆ జాబితా ఇస్తే నీకు తోమాల సేవ, పల్లకీ సేవ చేస్తా, జాబితా ఇవ్వకుంటే బడితేపూజ తప్పద’ని హెచ్చరించారు.హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌ను గెలిపించి ప్రధాని మోదీకి గిఫ్ట్‌గా ఇస్తామని ప్రటించారు. హుజూరాబాద్‌లో ఫాంహౌస్‌ స్కెచ్‌లు పనిచేయవన్నారు.  

బీజేపీలో కార్యకర్త సీఎం అయ్యే అవకాశం 
సామాన్య కార్యకర్త కూడా సీఎం అయ్యే అవకాశం ఉన్న ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని గోరఖ్‌పూర్‌ ఎంపీ, సినీనటుడు రవికిషన్‌ అన్నారు. బీజేపీ కుటుంబ పార్టీ, వంశపారంపర్య పార్టీ కాదని, కార్యకర్తలు నడిపే పార్టీ అని స్పష్టం చేశారు.  

కేసీఆర్‌ సారూ... డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఎప్పుడిస్తవ్‌? 
సాక్షి, హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మరో లేఖాస్త్రం సంధించారు. ప్రజాసమస్యలు, టీఆర్‌ఎస్‌ ఎన్నికల హామీలపై ఆయన బహిరంగలేఖల పరంపర కొనసాగుతోంది. రాష్ట్రంలోని పేదలకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఎప్పుడిస్తారో చెప్పాలని డిమాండ్‌ చేస్తూ తాజాగా బుధవారం మరో బహిరంగ లేఖ రాశారు. ‘ఇరుకైన ఇంట్లో ఆలుమగలు కాపురం చేయడమే కష్టం. అల్లుడు, బిడ్డ వస్తే తలదాచుకునేదెలా? గత ప్రభుత్వాలు ఇరుకైన ఇళ్లు పేదలకు ఇచ్చింది. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాగానే డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు నిర్మించి ఇస్తాం’అని 2014, 2018 ఎన్నికల ప్రచారసభల్లో కేసీఆర్‌ హామీ ఇచ్చినమాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. మేనిఫెస్టోల హామీలలో ఎన్ని అమలు చేశారనే దానిపై చర్చించడానికి సిద్ధమేనా? అని సంజయ్‌ సవాల్‌ విసిరారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top