Huzurabad Bypoll: ఈటల రాజేందర్ గెలుపు ఖాయం: బండి సంజయ్‌

Bandi Sanjay Exudes Confidence Of Etela Winning In Huzurabad By Poll - Sakshi

సాక్షి, కరీంనగర్‌: దళిత బంధు పేరిట మరోసారి ఎన్నికల్లో మోసం చేసేందుకు సీఎం కేసిఆర్ కుట్రలు పన్నుతున్నారని బీజేపి రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపి బండి సంజయ్ కుమార్‌ ఆరోపించారు. దళిత బంధులో భాగంగా పదిమందికో ఇరవై మందికో పదిలక్షల చొప్పున ఇచ్చి ఆయనకు సంబంధించిన వారితో కోర్టులో పిటిషన్ వేయించి తాను ఇస్తానంటే కొందరు కోర్టుకు వెళ్ళి అడ్డుకుంటున్నారనే నింద ఈటల రాజేందర్‌పై నెట్టుతాడని విమర్శించారు. దళిత బంధుకు బిజేపి వ్యతిరేకం కాదని సంజయ్ స్పష్టం చేశారు. దళిత బంధుతో పాటు రాష్ట్రంలోని ప్రతి వెనకబడిన కుటుంబానికి పదిలక్షల రూపాయలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజలు టీఆర్ఎస్ పార్టీ జిమ్మిక్కులను అర్థం చేసుకోవాలని కోరారు.

హుజూరాబాద్‌లో మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ చేపట్టిన ప్రజా దీవెన యాత్ర కొనసాగుతోంది. ఆరవ రోజు ఇల్లందకుంట మండలంలో జరిగిన పాదయాత్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఈటలకు సంఘీబావం తెలిపారు. అనంతరం బహిరంగ సభను ఉద్దేశిస్తూ మాట్లాడారు. ఈటల రాజేందర్ గెలుపు ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. నిన్ననే హుజూరాబాద్ నియోజవర్గానికి సంబంధించిన సర్వే వచ్చిందని, కేసీఆర్ ఇంటలిజెన్స్ ద్వారా తెచ్చుకున్న సర్వేలోనే ఈటలకు అనుకూలంగా 71శాతం ప్రజలు ఉన్నారని తేలిందన్నారు. దీంతో సీఎం కేసీఆర్‌కు పాలుపోవడం లేదని అన్నారు. ఇక టీఆర్ఎస్‌ పార్టీకి నియోజకవర్గంలో అభ్యర్థే లేడని ఎద్దేవా చేశారు.

హుజురాబాద్ ఎన్నికలు కేవలం నియోజకవర్గానికే సంబందించినవి కాదని.. రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన ఎన్నికలని బండి సంజయ్‌ కుమార్‌ అన్నారు. దేశంలో అతి పెద్ద అవినీతి పరుడు కేసీఆర్ అని, అబద్దాలతో బురిడి కొట్టించే కేసీఆర్‌కు నిద్ర పట్టడం లేదని విమర్శించారు. పాస్ పోర్ట్ బ్రోకర్ కేసీఆర్, తన సంతకం కూడ ఫోర్జరీ చేశాడని ఆరోపించారు. దళితులపై ప్రేమ ఒలకబోస్తున్న కేసిఆర్, అంబేద్కర్ వర్ధంతి, జయంతి వేడుకలకు ఏనాడైనా వచ్చిండా అని ప్రశ్నించారు. కేసీఆర్ వ్యవహారం అంత 90ఎంఎల్‌ చరిత్ర అని విమర్శించారు. ఈటలను హత్య చేసే దమ్ముందా బిడ్డా.. బట్టలు ఇప్పి కొడతామని హెచ్చరించారు. బిజేపి కార్యకర్తలకు దేనికైనా తెగించి కొట్లాడే దమ్ముందని తెలిపారు. అధికార దుర్వినియోగంతో తమ కార్యకర్తలను బెదిరించాలని చూస్తే ఖబద్డార్ అని హెచ్చరించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top