తిరుగులేని నాయకుడు ఏపీ సీఎం వైఎస్ జగన్

AP CM YS Jagan Mohan Reddy South India Big Star In Politics - Sakshi

ఓ వైపు తండ్రి ఆకస్మిక మరణంతో తీరని విషాదం.. మరోవైపు ఆ బాధ తట్టుకోలేక గుండె పగిలిన కుటుంబాలను అక్కున చేర్చుకోవాలనే ఆరాటం.. తండ్రి ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు సంక్షేమ పథకాలు చేరవేయాలనే తపన.. వీటన్నింటికీ రాజకీయ ప్రత్యర్థుల ఒత్తిళ్లు.. వెరసి ఎంపీ పదవికి రాజీనామా చేసి, ప్రజాక్షేత్రంలోనే వారితో ఢీకొట్టేందుకు సిద్ధమయ్యారు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. అక్రమ కేసులు బనాయించి ఉక్కిరిబిక్కిరి చేసినా ధైర్యంగా ముందుకు సాగారు. మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆశయాలకు అనుగుణంగా ఆయన పేరు కలిసి వచ్చేలా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని స్థాపించారు. పదేళ్ల క్రితం నాటి విషయాలు ఇవి. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఆయనకు ఎదురైన సమస్యలు, ఆయనను దొంగదెబ్బ తీసేందుకు, ప్రతిష్ట మసకబార్చేందుకు ప్రత్యర్థులు చేసిన కుట్రలు, కుయుక్తులు బహుశా ఎవరూ చవిచూసి ఉండకపోవచ్చు. అయినా, ధైర్యంగా నిలబడ్డారు. పార్టీ స్థాపించిన మూడేళ్లలోనే అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా పొందారు. 

ఈ క్రమంలో తనను రాజకీయంగా దెబ్బతీసేందుకు అధికార టీడీపీ ఎన్ని ఎత్తులు వేసినా వాటిని చిత్తు చేస్తూనే తాను నమ్మిన విలువలకు కట్టుబడి ప్రజలతో మమేకమయ్యారు. సుదీర్ఘ పాదయాత్ర చేపట్టి వారి సమస్యలు తెలుసుకుని 2019 అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించి సంక్షేమం- అభివృద్ధిని రెండు కళ్లుగా భావించి ప్రజారంజక పాలన చేస్తూ అక్కాచెల్లెమ్మలు, అన్నదమ్ములు, అవ్వాతాతల ఆశీర్వాదంతో ముందుకు సాగుతున్నారు. అధికారం చేపట్టిన నాటి నుంచి నేటి దాకా రాష్ట్రంలో జరిగిన అన్ని ఎన్నికల్లోనూ అధికార పార్టీదే విజయం. ముఖ్యంగా ఇటీవల జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో కనీవిని ఎరుగని రీతిలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ క్లీన్‌స్వీప్‌ చేసింది. నోరు తెరిచి ఒక్కరినీ ఓటు అడగకున్నా తను నమ్మిన, తనను నమ్మిన ప్రజలు సీఎం జగన్‌ పాలనకు మరోసారి పట్టం కట్టారనడానికి ఈ ఫలితాలే నిదర్శనం. 11 కార్పొరేషన్లు, 73 మున్సిపాలిటీల్లో వైఎస్సార్‌ సీపీ జయకేతనం ఎగురవేసింది. 

ఫ్యాన్‌ తుపాన్‌ ముందు సుదీర్ఘ రాజకీయ చరిత్ర గల టీడీపీ ఏమాత్రం నిలవలేక చతికిల పడింది. అపార పాలనా అనుభవం ఉందంటూ, ముఖ్యమంత్రి అన్న కనీస గౌరవం ఇవ్వకుండా సీఎం జగన్‌ను తూలనాడిన మాజీ సీఎం, ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. ఇక మున్సిపల్‌ ఫలితాల ఉత్సాహంతో వైఎస్సార్‌ సీపీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సిద్ధం అవుతుంటే టీడీపీ మాత్రం పూర్తి నిరాశలో కూరుకుపోయింది. మూడు రాజధానుల అంశంలో ప్రజలను రెచ్చగొట్టి ప్రభుత్వానికి ఇబ్బందులు సృష్టించాలన్న తమ పాచికలు పారకపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఈ నేపథ్యంలో టీడీపీ ఇప్పట్లో కోలుకునే ప్రసక్తి లేదని, ఇక బీజేపీ కూడా ఏమాత్రం పోటీనిచ్చే అవకాశం లేదని, కాబట్టి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ వైఎస్‌ జగన్‌ అధికారానికి తిరుగులేదని ఇప్పటి నుంచే రాజకీయ విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 

అంతేకాదు దక్షిణ భారతదేశంలో శక్తిమంతమైన ముఖ్యమంత్రిగా, పార్టీ అధినేతగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎదగడంలో ఏమాత్రం అతిశయోక్తిలేదనే వాదనలు కొనసాగుతున్నాయి. వాస్తవానికి, తెలంగాణలో.. ఉద్యమ పార్టీ నుంచి పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా రూపాంతరం చెంది, అధికారం చేపట్టిన టీఆర్‌ఎస్‌కు తొలి ఐదేళ్ల పాలన నల్లేరు మీద నడకలా సాగిపోయింది. కానీ రెండో టర్మ్‌లో అదే స్థాయిలో ప్రజలను ఆకట్టుకోలేకపోయింది. దీంతో, టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు కూడా సఫలమవుతున్నాయని చెప్పడానికి ఇటీవలి దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్‌ఎంసీ ఫలితాలే నిదర్శనం.

ఇక తమిళనాడులో అధికార అన్నాడీఎంకేకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయనేది బహిరంగ రహస్యమే. 234 స్థానాలున్న ఆ రాష్ట్రంలో  ఏప్రిల్‌ 6న అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో సర్వేలన్నీ ప్రజాతీర్పు డీఎంకేకు అనుకూలంగా ఉందని చెబుతున్నాయి. కాబట్టి, ఆ పార్టీ అధినేత ఎంకే స్టాలిన్‌ను ముఖ్యమంత్రిగా చూసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆయన సీఎం అయినప్పటికీ కూటమి ప్రభుత్వానికి నాయకత్వం వహించాల్సి ఉంటుంది. మరో దక్షిణాది రాష్ట్రం కేరళలోనూ అదే రోజున అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరుగనుంది. ఎల్డీఎఫ్‌ కూటమికి నేతృత్వం వహిస్తున్న, సీపీఐ ముఖ్యనేత, సీఎం పినరయి విజయన్‌ అధికారానికి ఇప్పటికిప్పుడు వచ్చిన ముప్పేమీ లేకపోయినా, మొన్నటి గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసులో ఆయన పేరు వినిపించడం సంచలనంగా మారింది.

ఇక కర్ణాటకలో రాజకీయ అనిశ్చితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జేడీఎస్‌- కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలదోసిన బీజేపీలో అంతర్గత విభేదాలు ఉన్నాయనే వార్తలు తరచుగా వినిపిస్తూనే ఉన్నాయి. సీఎం బీఎస్‌ యడియూరప్ప సీఎం పీఠానికి ఏ వైపు నుంచి ముప్పు ముంచుకు వస్తుందో తెలియని పరిస్థితి. ఇలా దక్షిణ భారతదేశ రాష్ట్రాల్లోని సమకాలీన పరిస్థితులను విశ్లేషిస్తే, సొంతంగా అధికారం చేపట్టిన ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌ తిరుగులేని నాయకుడిగా ఎదిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని రాజకీయ పండితులు అంటున్నారు. ఇందుకు సంబంధించి ‘జగన్ ఈజ్‌ సౌత్స్‌ బిగ్‌స్టార్‌’ పేరిట దక్కన్‌ క్రానికల్‌ ఎడిట్‌ పేజీలో ఓ కథనం వెలువడింది.

చదవండి: అపూర్వం...అనితర సాధ్యం.. ఈ విజయం..

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top