మీ నిర్వాకం వల్లే పోలవరం జాప్యం

Ambati Rambabu Fires On Chandrababu And Polavaram - Sakshi

మీ బాగోతాలపై చర్చకు సిద్ధమా? 

చంద్రబాబు, దేవినేని ఉమాకు జల వనరుల మంత్రి అంబటి సవాల్‌  

కమీషన్ల కక్కుర్తితో ప్రణాళిక లేకుండా పనులు చేయలేదా? 

పునరావాసం కల్పించకుండానే ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లు ఎలా నిర్మించారు? 

వరద ఉధృతి పెరగడంతోనే డయాఫ్రమ్‌ వాల్‌ విధ్వంసం  

ఈ పాపాలు నాడు ఈనాడు రామోజీకి కన్పించలేదా? 

ఇప్పుడు ఆ పాపాలను ఈ ప్రభుత్వానికి అంటగడతారా? 

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనులు సాగిస్తోంది

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్‌ వాల్‌ విధ్వంసం కావడానికి.. ప్రాజెక్టు పనుల్లో జాప్యం చోటుచేసుకోవడానికి చంద్రబాబు నేతృత్వంలోని గత ప్రభుత్వమే కారణమని జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తేల్చి చెప్పారు. ఈ అంశంపై చర్చకు సిద్ధమా అంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, మాజీ మంత్రి దేవినేని ఉమాలకు సవాల్‌ విసిరారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు కమీషన్ల కక్కుర్తితో.. ప్రణాళిక లేకుండా పనులు చేయడం వల్లే  పోలవరం ప్రాజెక్టుకు శాపంగా మారిందనే వాస్తవాన్ని దాచిపెట్టి.. ఆ నెపాన్ని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ప్రభుత్వంపై నెడుతూ ‘ఈనాడు’ రామోజీరావు కట్టుకథలు అచ్చేస్తున్నారని మండిపడ్డారు. వాటిని ప్రజలు విశ్వసించరని చెప్పారు. మంత్రి అంబటి ఇంకా ఏమన్నారంటే.. 

కమీషన్ల కక్కుర్తి చారిత్రక తప్పిదం  
► బాబు అధికారంలో ఉన్నప్పుడు 2018 నాటికే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. మరి ఎందుకు పూర్తి చేయలేకపోయారు? అప్పట్లో కమీషన్లు వసూలు చేసి చంద్రబాబుకు ఇచ్చి, ఆయన నుంచి వాటాలు పొందడానికే దేవినేని ఉమా పరిమితమయ్యారు. అపర మేధావిననే ఉమా మాట దేవుడెరుగు.. తెలంగాణ సీఎం కేసీఆర్‌ చెప్పినట్టు దేవినేని ఉమా ఆడో మగో పరీక్ష చేయించుకుని, డాక్టర్‌ నుంచి సర్టిఫికెట్‌ తెచ్చుకుంటే మంచిది.  
► వరద ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్‌ వేను పూర్తి చేశాక.. నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తూనే ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లు చేపట్టి పూర్తి చేయాలి. అప్పుడు స్పిల్‌ వే మీదుగా వరద ప్రవాహాన్ని మళ్లించి.. రెండు కాఫర్‌ డ్యామ్‌ల మధ్యన ప్రధాన డ్యామ్‌(ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌) నిర్మాణానికి పునాది డయాఫ్రమ్‌ వాల్‌ను వేయాలి. ఆ తర్వాత దానిపై ప్రధాన డ్యామ్‌ నిర్మించాలి. 
► అయితే అపర మేధావినని చెప్పుకునే చంద్రబాబు కమీషన్ల కక్కుర్తితో స్పిల్‌ వేను పూర్తి చేయకుండానే.. ఎగువ, దిగువ కాపర్‌ డ్యామ్, డయాఫ్రమ్‌ వాల్‌ పనులను సమాంతరంగా చేపట్టారు. 35 మీటర్ల కాంటూర్‌ పరిధిలోని 56 గ్రామాలకు పునరావాసం కల్పించకుండా చేపట్టిన ఈ పనుల వల్ల.. వరద ఎగదన్ని నిర్వాసితులను ముంచెత్తుతుందని పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ), కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) హెచ్చరించింది.  
► ఎగువ కాఫర్‌ డ్యామ్‌లు రెండు చోట్ల.. దిగువ కాఫర్‌ డ్యామ్‌లో ఒక చోట వరద ప్రవాహం దిగువకు వెళ్లేలా ఖాళీ ప్రదేశాలను వదిలారు. అయితే 2019, 2020లో వచ్చిన భారీ వరదలకు డయా ఫ్రమ్‌ వాల్‌ దెబ్బతింది. డయాఫ్రమ్‌ వాల్‌కు రూ.399 కోట్లు, ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ల పనులకు రూ.176 కోట్లను బిల్లులు చేసిన చంద్రబాబు.. కమీషన్లు దండుకున్నారు. ఈ తప్పిదం ఈనాడు రామోజీకి కన్పించలేదు.  

2024లో మీరంతా గుక్కపట్టి ఏడ్వక తప్పదు 
► ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ బాధ్యతలు స్వీకరించాక ప్రణాళికాయుతంగా పోలవరం ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. కరోనా కష్టకాలంలోనూ.. వరద ఉద్దృతిలోనూ రికార్డు సమయంలో స్పిల్‌ వే, అప్రోచ్‌ చానల్, స్పిల్‌ చానల్, ఫైలట్‌ చానల్‌ పూర్తి చేశారు. ► ఎగువ కాఫర్‌ డ్యామ్‌ను 42.5 మీటర్లకు పూర్తి చేసి.. 35 మీటర్ల కాంటూర్‌ పరిధిలోని ముంపు గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించి.. స్పిల్‌ వే మీదుగా 6.1 కి.మీల పొడవున గోదావరి ప్రవాహాన్ని గతేడాది జూన్‌ 11న మళ్లించారు. చంద్రబాబు తప్పిదం చేసి ఉండకపోయుంటే ఈ పాటికే పోలవరం పూర్తయ్యేది. 
► బాబు చేసిన తప్పిదాన్ని జాతీయ, అంతర్జాతీయ నిపుణులను సంప్రదించి సరిచేస్తున్నాం. ఢిల్లీ–ఐఐటీ రిటైర్డు డైరెక్టర్‌ వీఎస్‌ రాజు నేతృత్వంలోని ఎనిమిది మంది నిపుణుల బృందం శుక్ర, శనివారాల్లో పోలవరాన్ని పరిశీలించింది. వారి సూచన మేరకు పనులు చేపడతాం.  
► చంద్రబాబు తప్పిదం వల్ల ఏర్పడిన గోతులను పూడ్చటానికి రూ.800 కోట్లు.. రెండు కాఫర్‌ డ్యామ్‌ల మధ్య నీటిని తోడేయడానికి రూ.2,100 కోట్లు ఖర్చు అవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ పాపం చంద్రబాబుది కాదా?
► ఎవరెన్ని విష ప్రచారాలు చేసినా, పోలవరాన్ని పూర్తి చేస్తాం. 2024 ఎన్నికల్లో రెండో సారి సీఎంగా వైఎస్‌ జగన్‌ ప్రమాణ స్వీకారం చేస్తారు. అప్పుడు చంద్రబాబు, రామోజీ, ఏబీఎన్‌ రాధాకృష్ణ, టీవీ5 నాయుడులు గుక్కపట్టి ఏడ్వక తప్పదు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top