ఓటేసి పోండి
వలస ఓటర్లపై అభ్యర్థుల స్పెషల్ ఫోకస్ రానుపోను ఖర్చులు మావే.. పైఖర్చులు కూడా ఇస్తామంటూ ఆఫర్లు హామీ తీసుకుని ముందుగానే ఫోన్‌పే.. గూగుల్ పేలో చెల్లింపులు ఓటరు జాబితా ఆధారంగా ఓటర్ల అకౌంట్లు సేకరిస్తూ సంప్రదింపులు
బాబాయ్ నమస్తే.. అంతా కుశలమేనా.. సర్పంచ్‌గా పోటీచేస్తున్న.. 11న మన ఊరిలో పోలింగ్ ఉంది. పిన్ని, చిన్నోడు, నువ్వు బుధవారం సాయంత్రంలోగా ఊ రికి వచ్చేలా ప్లాన్ చేసుకో. ఏం ఫికర్ పడకు. రానుపోను చార్జీలతోపాటు పైఖర్చులు కూడా చూసుకుంట. ఈ నంబరుకు ఫోన్ పే ఉందికదా? రవాణా చార్జీలు పంపుత.. లేదా.. మన ఊరోళ్లు మీ కాలనీలో ఎవరైనా ఉంటే ఓ కారు మాట్లాడుకోని అందరూ రండి.. కిరాయి నేనేఇస్త. నామీద ఒట్టే.. నువ్వు తప్పకుండా రావాలి. నాకు ఓటెయ్యాలి. – వివిధ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వలస ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు పడుతున్న పాట్లకు ఇది నిదర్శనం.
సాక్షి పెద్దపల్లి: గ్రామం యూనిట్‌గా జరిగే సర్పంచ్ ఎన్నికల్లో ప్రతీ ఓటు కీలకమే. స్వల్ప తేడా ఓట్లతోనే ఫలితం తారుమారయ్యే అవకాశాలు ఉంటాయి. స్థానిక ఎన్నికలను అభ్యర్థులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ప్రతీ ఓటరుపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. ‘నువ్వా.. నేనా’ అన్నట్లు ఓటర్ల మద్దతు కూడగట్టుకునేందుకు శతవిధాలా యత్నిస్తున్నారు. పోలింగ్ సమీపిస్తున్న కొద్దీ వార్డుల వారీగా అనుకూల ఓటర్లపై ఆరా తీస్తూ వారిని ఎలా కలువాలి? ఎలా తమవైపు తిప్పుకోవాలనేదానిపై ప్లాన్ చేస్తున్నారు.
ఉపాధి కోసం వెళ్లినవారిపై ఫోకస్..
ఉపాధి కోసం వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన గ్రామ ఓటర్లపై అభ్యర్థులు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. ఎంతమంది, ఎక్కడెక్కడ ఉన్నారని ఆ రా తీస్తున్నారు. అభ్యర్థుల కుటుంబసభ్యులు, బూ త్ కన్వీనర్లు, ఏజెంట్ల ద్వారా ఇంటింటికీ తిరిగి ఓ టర్ల వివరాలు సేకరిస్తున్నారు. ఒక్కో గ్రామంలో సుమారు 100 నుంచి 200 మందివరకు వలస ఓ టర్లు ఉన్నట్లు అంచనా వేసుకుంటూ ప్రత్యేకంగా బృందాలనూ రంగంలోకి దింపారు. వలస వెళ్లిన వారికి ఫోన్లపై ఫోన్లు చేయిస్తున్నారు. ఎక్కడ ఉన్నా పోలింగ్‌కు ఒకరోజు ముందుగానే స్వగ్రామాలకు రప్పించి తమకు అనుకూలంగా ఓటు వేయించుకునేందుకు పోటీ పడుతున్నారు. వారి ఫోన్ నంబర్లు సేకరిస్తూ, వాట్సప్ గ్రూప్‌లు క్రియేట్ చేస్తూ వారితో టచ్‌లో ఉంటున్నారు.
ప్రత్యేక వాహనాల ఏర్పాటు..
ఓటరు జాబితా ఆధారంగా వార్డుల వారీగా ఓటర్ల లెక్కలు తీస్తున్నారు. ఒకేచోట ఎక్కువమంది ఉంటే ప్రైవేట్ వాహనం అద్దెకు తీసుకుని రావాలని, లేనిపక్షంలో ఇక్కడి నుంచి పంపిస్తామని హామీ ఇస్తున్నారు. ఎంతమంది ఓటర్లు గ్రామాలకు వస్తున్నారనేది తెలుసుకుని అందుకు సరిపడా డబ్బులు ఫోన్ పే లేదా గూగుల్ పే చేసేందుకు బ్యాంకు ఖాతా వివరాలు, ఫోన్‌పే, గూగుల పే వివరాలు సేకరిస్తున్నారు. రవాణా ఖర్చులకు తోడు పైఖర్చులను సైతం చెల్లింస్తామంటూ ఆఫర్స్ ఇస్తున్నారు.
ముందస్తు చెల్లింపులు కూడా..
ముందుగానే డబ్బులు పంపిస్తే ఓటర్లు తమకు ఓట్లు వేస్తారని, లేకపోతే వేయకపోవచ్చని భావించి కొందరు అభ్యర్థులు ముందుగానే డబ్బులు ఆన్‌లైన్ పేమెంట్స్ చేస్తున్నారు. ఓటర్ల సంఖ్య ఆధారంగా ఒక్కో ఓటరుకు రాకపోకలకయ్యే ఖర్చుతోపాటు అదనంగా ఓటుకు రూ.500 వరకు పంపిస్తున్నట్లు తెలుస్తోంది. జీవనోపాధి కోసం గ్రామాల నుంచి దూరప్రాంతాలకు వెళ్లిన వారు గ్రామాల్లో జరిగే ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చినవారు తమకు వచ్చే కూలి డబ్బులు నష్టపోకుండా చెల్లింపులు చేస్తామంటూ హామీలు గుప్పిస్తున్నారు.


