చదవాలి.. రాయాలి.. రాణించాలి
చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి నాలుగు గ్రూపులుగా ఏర్పాటు చేయాలని నిర్ణయం క్రమశిక్షణ.. మంచి భవిష్యత్.. నాయకత్వ లక్షణం లక్ష్యం ప్రభుత్వ స్కూళ్ల హెచ్‌ఎంలకు కలెక్టర్ శ్రీహర్ష ఆదేశం
పెద్దపల్లి: చదువులో వెనుకబడిన విద్యార్థులు కూడా ఉన్నతంగా రాణించేలా కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ఇందుకోసం వారితోనే నాలుగు క్లబ్‌లు ఏర్పాటు చేయాలని ఆయన నిర్ణయించారు. వీటికి రెడ్, గ్రీన్, ఎల్లో, బ్లూ హౌస్‌లుగా నామకరణం చేశారు. వీటిద్వారా ఆటాపాటలు, విద్యలోనూ వెనుకబడిన విద్యార్థులను గుర్తిస్తారు. చదవడం రాయడం, విద్యలో రాణించడం, ఉజ్వలమైన భవిష్యత్ అందించడం లక్ష్యంగా ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు చొరవ తీసుకోవాలని అధికారులు సూచించారు. క్రమశిక్షణ, ఉత్తమ భవిష్యత్ నిర్మాణం, నాయకత్వ లక్షణ పెంపు లక్ష్యంగా తీర్చిదిద్దాలన్నారు. వారంలో ఒకరోజు (సోమవారం) మినహా ఐదురోజులపాటు ఒక్కో కార్యక్రమం నిర్వహించాలని ప్రణాళిక తయారు చేశారు.
మంగళవారం : మొక్కలు నాటి.. నీళ్లుపోసి..
ప్రభుత్వ పాఠశాలల పరిసరాల్లో మొక్కలు నాటి సంరక్షించడం, పోషక విలువలు కలిగిన తోట నిర్వహణ, విద్యుత్, నీటి సంరక్షణ బాధ్యతలు చేపడతారు. విద్యార్థులు ప్రజలను చైతన్యవంతం చేసి పర్యావరణాన్ని పరిరక్షిస్తారు. ఈ ప్రక్రియను ఎకోక్లబ్ అని కూడా వ్యవహరిస్తారు.
బుధవారం : పుస్తక పఠనం
విద్యార్థులు నిత్యం పుస్తక పఠనం, భాషపై పట్టు సాధించడం, సృజనాత్మక పెంపొందించేలా కార్యక్రమాల నిర్వహణ. గ్రంథాలయాలు, రోజువారీ స్టడీతోపాటు కవితలు చదవడం, రాయడం, వ్యాసరచన పోటీలు నిర్వహిస్తారు.
గురువారం : డ్రగ్స్‌కు దూరం..
మాదకద్రవ్యాలకు దూరంగా ఉండేలా టీనేజ్‌లో విద్యార్థులు వ్యసనాల బారినపడే ప్రమాదం ఉంది. వ్యసనం ద్వారా కలిగే నష్టాలు, ఉజ్వల భవిష్యత్ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చైతన్యవంతం చేస్తారు. రోడ్డు భద్రత, సైబర్ నేరాలు, సోషల్ మీడియాను బాధ్యతగా వినియోగించడం, సామాజిక బాధ్యతలు, సంప్రదాయాలు, విలువలు, జీవన విధానంపై ఉదయం, సాయంత్రం ప్రార్థన సమయంలో వివరిస్తారు.
శుక్రవారం : ఫిర్యాదులు
బాలికలు, మహిళల రక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తారు. డయల్ 100, 1098, 15100 హెల్ప్‌లైన్ నంబర్ల గురించి వివరిస్తారు. గుడ్, బ్యాడ్‌టచ్‌లపైనా అవగాహన కల్పి స్తారు. ప్రతీపాఠశాలలో ఫిర్యాదుల పెట్టె ఏర్పాటు చేస్తారు. ఇబ్బందులు, సమస్యల కోసం ఫిర్యాదు పెట్టెను వినియోగించాలి. పరస్పర సహకారం, భావోద్వేగాల నియంత్రణ, ఐక్యత, స్నేహపూర్వక వాతావరణం క్లబ్‌ల ధ్యేయం.
శనివారం : ఆటాపాటలు
ఆటాపాటలతోపాటు యోగా సాధన ద్వారా కలిగే ప్రయోజనాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. వాటిపై తర్ఫీదు ఇస్తారు. నైపుణ్యం పెంపొందిస్తారు. ఉన్నతంగా రాణించేలా ఉపాధ్యాయులు బాధ్యత తీసుకుంటారు.
పాఠశాలల సమాచారం
ఉన్నత 104
కేజీబీవీలు 10
మోడల్ 7
విద్యార్థులు 37,108


