దిగుబడి తగ్గింది.. ధర పెరిగింది
పెద్దపల్లిరూరల్: జిల్లాలో ఈసారి పత్తి సాగు చేసిన అన్నదాతలు.. ఆశించిన దిగుబడి రాలేదని దిగులు పడుతున్నారు. ప్రతీసీజన్‌లో నాలుగుసార్లు పత్తి ఏరి విక్రయించేవారు. ఈసారి రెండుపర్యాయాలు కూడా ఏరడం కష్టంగా మారిందని వాపోతున్నారు. అదికూడా అంతంత మాత్రమే. జిల్లా వ్యాప్తంగా 48,215 ఎకరాల విస్తీర్ణంలో పత్తి పండించారు. 5,78,580 మెట్రిక్ టన్నుల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. కానీ, ఆ స్థాయిలో దిగుబడి వచ్చే పరిస్థితిలేదు.
వాతావరణ ప్రభావమే..
పత్తి పంటపై ఈసారి వాతావరణ పరిస్థితుల ప్రభావం తీవ్రంగా ఉందని వ్యవసాయాధికారులు తెలిపారు. అధిక వర్షాలు, సమయం మించిన తర్వాత ఏకధాటిగా కురిసిన వానలతో గులాబీ తెగులు లాంటివి పంటను ఆశించాయి. ఎకరాకి 10 క్వింటాళ్ల నుంచి 12 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని ఆశిస్తే.. 3 క్వింటాళ్ల నుంచి 4 క్వింటాళ్లకు మించి చేతికి రాలేదని రైతులు వాపోతున్నారు. ఆకు రంగు మారి కాయసైజ్ పెరగలేదని, ఆశించిన దూది రాలేదని అన్నదాతలు చెబుతున్నారు.
కొనుగోళ్లు సగమే..
జిల్లాలో పత్తి దిగుబడి సగానికి పడిపోయిందా? అంటే.. అయి ఉండొచ్చని పత్తి కొనుగోళ్ల తీరును బట్టి చూస్తే తెలుస్తోంది. జిల్లాలో ఏర్పాటు చేసిన సీసీఐ కేంద్రాల ద్వారా గతేడాది (2024 నవంబర్ 30వ తేదీ) వరకు 30,318 క్వింటాళ్ల వరకు పత్తి కొనుగోలు చేశారు. ఈ ఏడాది నవంబర్ 30 వరకు 16,106 క్వింటాళ్ల వరకే కొనుగోలు చేశారు. లైసెన్స్‌డ్ వ్యాపారులు గతేడాది 45 వేల క్వింటాళ్లు కొనుగోలు చేయగా.. ఈసారి 18,211 క్వింటాళ్లే కొనుగోలు చేశారని మార్కెటింగ్ శాఖ అధికారుల గణాంకాలు చెబుతున్నాయి.
సోమవారం కొనుగోళ్లు ఇలా..
పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో సోమవారం వివిధ గ్రామాలకు చెందిన 140 మంది రైతులు తెచ్చిన 518 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసినట్లు మార్కెట్ ఇన్‌చార్జి కార్యదర్శి ప్రవీణ్‌రెడ్డి తెలిపారు. పత్తి క్వింటాల్‌కు గరిష్టంగా రూ.7,261 ధర పలుకగా.. కనిష్టంగా రూ.6,011, సగటు రూ. 7,011గా నమోదై ఉందని ఆయన వివరించారు.
జిల్లా సమాచారం
సాగు విస్తీర్ణం(ఎకరాల్లో) 48,215
దిగుబడి అంచనా(క్వింటాళ్లలో) 5,78,580
నవంబర్ 30 వరకు పత్తి కొనుగోళ్లు
సీసీఐ(క్వింటాళ్లలో) 16,106
విక్రయించిన రైతులు 951
అడ్తిదారులు(క్వింటాళ్లలో) 18,211
విక్రయించిన రైతులు 5,298
2024 నవంబర్‌లో కొనుగోళ్లు
సీసీఐ(క్వింటాళ్లలో) 30,318
అడ్తిదారులు(మెట్రిక్ టన్నుల్లో) 45,000
దిగుబడి తగ్గింది.. ధర పెరిగింది


