తాగునీటికి ఇబ్బంది రానీయొద్దు
పెద్దపల్లిరూరల్: పట్టణ ప్రజలు తాగునీటికి ఇబ్బదులు పడకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్‌ను ఆదేశించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సోమవారం ఆయన వివిధ అభివృద్ధి పనులపై సమీక్షించారు. పాత వాటర్ ట్యాంక్‌ను కూల్చివేసి కొత్తది నిర్మించే వరకు తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలన్నారు. అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని, మార్చి చివరినాటికి ఆస్తిపన్ను, ట్రేడ్ లైసెన్స్, రెన్యూవల్ తదితర పన్నులు నూరుశాతం వసూలు చేయాలని ఆదేశించారు. ఇంటింటికీ వెళ్లి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలని ఆయన సూచించారు.
హౌస్‌ల విభజనతో విద్యార్థులకు మేలు
పెద్దపల్లి: పాఠశాల విద్యార్థులను రెడ్‌హౌస్(అ బ్దు ల్ కలాం), గ్రీన్‌హౌస్(శకుంతలదేవి), బ్లూహౌస్ (సీవీ రామన్), ఎల్లోహౌస్(రవీంద్రనాథ్ ఠాగూర్)లుగా విభజించి విద్యాబోధన చేస్తే విద్యార్థులకు ఎంతోమేలు చేకూరుతుందని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలుర హైస్కూల్, జిల్లా గ్రంథాలయం, ఆర్డీవో కార్యాలయాన్ని కలెక్ట ర్ సందర్శించి పలు సూచనలు చేశారు. జెడ్పీహెచ్‌ఎస్‌లో నాలుగు హౌస్‌లు ఏర్పాటు చేసిన హెడ్‌మాస్టర్, ఉపాధ్యాయులను అభినందించారు. ఆర్డీవో గంగయ్య, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్, ఎంఈవో సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులపై సమీక్షిస్తున్న కలెక్టర్ శ్రీహర్ష


