
అభివృద్ధి పనులు పర్యవేక్షించాలి
పెద్దపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన అభివద్ధి పనులను పర్యవేక్షించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. అదనపు కలెక్టర్ వేణుతో కలిసి శనివారం పాఠశాలల్లో చేపట్టిన ప్రగతి పనులపై శ్రీహర్ష సమీక్షించారు. జిల్లాకు కేటాయించినా.. వినియోగించకపోవడంతో రూ.4.5 కోట్లను ఆర్‌బీఐ వెనక్కి తీసుకున్నట్లు ప్రాథమికంగా సమాచారం అందిందన్నారు. ప్రభుత్వ శాఖల్లో ఉపయోగించని బ్యాంకు ఖాతాల వివరాలపై తనకు నివేదిక అందించాలని సూచించారు. ప్రీ ప్రైమరీ స్కూళ్ల పకడ్డందీగా నిర్వహించాలన్నారు. జిల్లాలో 60 ప్రీ ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయని, ఇందులో విధులు నిర్వహించేందుకు వచ్చిన దరఖాస్తుల్లో మెరిట్ ఆధారంగా పారదర్శకంగా టీచర్లను ఎంపిక చేశామని తెలిపారు. కాగా, జాబ్ మేళాలో ఉద్యోగాలు సాధించిన గుర్రాల సింధుజ, పెర్క సాయి సింధు, మినీష ఓడనాలాను కలెక్టర్ అభినందించారు. డీఈవో మాధవి, అకడమిక్ మానిటరింగ్ అధికారి పీఎం షేక్ పాల్గొన్నారు.
4న అవగాహన సదస్సు..
భారత వాయుసేనలో చేరేందుకు ఆసక్తికలిగిన యువతకు అవగాహన కల్పించేందుకు ఈనెల 4న బందంపల్లి స్వరూప గార్డెన్స్‌లో సదస్సు నిర్వహిస్తామని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. వాయుసేనలో ఉద్యోగావకాశాలు, పరీక్ష విధానం, సిలబస్, ఎంపిక ప్రక్రియపై వాయుసేన అధికారులు అవగాహన కల్పిస్తారని, ఆసక్తిగలవారు హాజరు కావాలని కలెక్టర్ సూచించారు. వివరాలకు 99497 25997, 83330 44460 ఫోన్‌నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు.