సర్కారు జాప్యం.. విద్యార్థులకు శాపం | - | Sakshi
Sakshi News home page

సర్కారు జాప్యం.. విద్యార్థులకు శాపం

Nov 2 2025 8:11 AM | Updated on Nov 2 2025 8:11 AM

సర్కారు జాప్యం.. విద్యార్థులకు శాపం

సర్కారు జాప్యం.. విద్యార్థులకు శాపం

● ఉన్నత విద్యకు మళ్లీ బ్రేక్‌ ● రేపటి నుంచి డిగ్రీ కళాశాలల నిరవధిక బంద్‌ ● తారస్థాయికి చేరుతున్న ఫీజు పోరు

సిరిసిల్లకల్చరల్‌: పెండింగ్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధుల విడుదలలో జాప్యం ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థుల పాలిట శాపంగా మారుతోంది. ప్రతీసారి హామీలే తప్ప నిధులు విడుదలలో ప్రభు త్వం మీనమేషాలు లెక్కిస్తుండడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాలు మరోసారి విద్యాసంస్థల నిరవధిక బంద్‌కు నిర్ణయం తీసుకున్నాయి.

నాలుగేళ్లుగా బకాయిలే..

నాలుగేళ్లుగా ఫీజు బకాయిలతో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని అన్ని డిగ్రీ, పీజీ, వృత్తి విద్యా కళాశాలల నిర్వహణ భారంగా మారింది. ప్రధానంగా సంప్రదాయ డిగ్రీ కోర్సులు నిర్వహించే గ్రామీణ ప్రాంత కళాశాలల స్థితి ఆగమ్యగోచరంగా మారింది. కళాశాల భవనాల అద్దెలు మొదలు సిబ్బంది జీత భత్యాలు ఇవ్వలేక చేతులెత్తేశాయి. చాలా వరకు కళాశాలల్లో లెక్చరర్లకు జీతాలు లేక కుటుంబాలు రోడ్డున పడే దుస్థితి ఏర్పడింది.

హామీలు.. నీటిమీద రాతలే

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడేనాటికి రెండేళ్ల బకాయిలు పేరుకుపోయాయి. ప్రజాప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు సకాలంలో విడుదల చే స్తామని చెప్పిన పెద్దలు మాట నిలుపుకోవడంలో విఫలమయ్యారు. గతేడాది పరీక్షలు వాయిదా వేస్తామన్న తీర్మానానికి తలొగ్గి నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఇటీవల దసరాకు ముందు రూ.300కోట్లు, దీపావళి సమయానికి మరో రూ.300 కోట్లు విడుదల చేస్తామన్న అధికారులు అమలులో విఫలమయ్యారు. ఈ ఏడాది ప్రవేశాల సమయంలో కాస్త నెమ్మదించిన యాజమాన్యాలు మరోసారి ఫీజు పోరుకు సిద్ధమయ్యాయి. టోకెన్లు విడుదలైన మొత్తం రూ.1200 కోట్లు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. నిధులు విడుదల చేయకపోతే నిరవధిక బంద్‌ పాటిస్తామని కళాశాలల యాజమాన్య సంఘం తేల్చిచెప్పింది. దీంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.

విజిలెన్స్‌ కొరడా

కళాశాలల యాజమాన్యాలపై మరో పిడుగు పడింది. అన్ని కళాశాలలపై విజిలెన్స్‌ అధికారుల తనిఖీలకు ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం బకాయిలు విడుదల చేశాక తనిఖీలకు సహకరిస్తామని యాజమాన్యాలు అంటున్నాయి. తమహక్కుగా ఉన్న బకాయిలను అడిగితే విజిలెన్స్‌ తనిఖీల పేరుతో భయభ్రాంతులకు గురిచేసేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వం దమన నీతిని యాజమాన్యాల సంఘం ఎండగడుతోంది.

శాతవాహన వీసీకి సమ్మె నోటీస్‌

శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల బంద్‌ నిర్ణయాన్ని వైస్‌చాన్స్‌లర్‌కు చేరవేయాలని సుప్మా కార్యవర్గం నిర్ణయించింది. శనివారం మధ్యాహ్నం వర్సిటీ రిజిస్ట్రార్‌ను కలిసిన యాజమాన్య సంఘం రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సుప్మా ప్రతినిధులు శ్రీపాద నరేశ్‌తో కూడిన బృందం లేఖ ద్వారా సమ్మె నోటీస్‌ అందజేశారు. బకాయిలు పూర్తిగా విడుదల చేస్తే తప్ప బంద్‌ విరమించేది లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే 1,3,5 సెమిస్టర్‌ పరీక్ష ఫీజుల గడువు కూడా పూర్తయింది. త్వరలో సెమిస్టర్‌ పరీక్షల నిర్వహణకు యూనివర్సిటీ అధికారులు సమాయత్తమవుతున్నారు. ఈ నేపథ్యంలో బంద్‌ నిర్ణయం విద్యార్థుల ఫలితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని తల్లిదండ్రులు వాపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement