
ఇసుక ట్రాక్టర్ ఢీకొని ఏసీపీ తండ్రి మృతి
● ప్రమాద స్థలాన్ని సందర్శించి కంటతడి ● అతివేగం, అజాగ్రత్తతో ప్రమాదం
మంచిర్యాలక్రైం: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పాత మంచిర్యాల వద్ద రహదారిపై శుక్రవారం ఇసుక ట్రాక్టర్ ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈయన్ను పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ తండ్రి గజ్జి ఐలయ్య(64)గా గుర్తించారు. వివరాలిలా ఉన్నాయి. జైపూర్ మండలం రసూల్‌పల్లి గ్రామంలో సింగరేణి రిటైర్డు ఉద్యోగి గజ్జి ఐలయ్య నివాసం ఉంటున్నాడు. ఈయన కుమారుడు గజ్జి కృష్ణ పెద్దపల్లి ఏసీపీగా పని చేస్తున్నారు. ఐలయ్య శుక్రవారం ఉదయం వ్యక్తిగత పనిపై ద్విచక్ర వాహనం మీద హాజీపూర్ వెళ్లి తిరిగి మంచిర్యాలకు వస్తున్నాడు. పాతమంచిర్యాల వద్దకు రాగానే వెనుకాల నుంచి వస్తున్న ఇసుక ట్రాక్టర్ అతివేగంగా ఐలయ్య ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో కిందపడిన ఐలయ్య తలపై నుంచి ట్రాక్టర్ టైరు వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ట్రాక్టర్ డ్రైవర్ అతివేగం, అజాగ్రత్త వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపించారు. సంఘటన స్థలాన్ని పెద్దపల్లి ఏసీపీ కృష్ణ, డీసీపీ ఎగ్గడి భాస్కర్, ఏసీపీ ప్రకాష్, సీఐ ప్రమోదర్‌రావు పరిశీలించారు. తండ్రి మృతదేహాన్ని చూసి కృష్ణ బోరున విలపించారు. ఐలయ్యకు భార్య కొమురవ్వ, కూతురు సమ్మక్క, కుమారుడు కృష్ణ ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.

ఇసుక ట్రాక్టర్ ఢీకొని ఏసీపీ తండ్రి మృతి