పీటీఎం.. సిగ్గుచేటు!
మమ్మల్ని విమర్శించే ముందు..
వారేం చేశారో చెప్పాలి: రాజన్నదొర
సినిమా
సెట్టింగ్‌లతో
సాక్షి, పార్వతీపురం మన్యం: చంద్రబాబు ప్రభు త్వం గత 18 నెలల పాలనలో వైద్య, విద్యా రంగాలను పూర్తిగా భ్రష్టు పట్టించిందని వైఎస్సార్సీపీ నేతలు, మాజీ ఉపముఖ్యమంత్రులు పీడిక రాజన్న దొర, పాముల పుష్పశ్రీవాణి, మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పాలనలో ప్రజలకేం చేశామో చెప్పుకోలేకే.. సీఎం చంద్రబాబు పార్వతీపురం జిల్లాలో పేరెంట్–టీచర్ సమావేశంలో విమర్శలకు దిగారని తెలిపారు.
భామిని ఆదర్శ పాఠశాలలో జరిగిన పీటీఎంలో తరగతి సెట్టు వేయడం సిగ్గు చేటన్నారు. సినిమా సెట్టింగులు వేస్తే.. పాఠశాలల్లో లోటుపాట్లు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. పార్వతీపురంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజుతో కలిసి శనివారం వారు మీడియాతో మాట్లాడారు. జిల్లాకు చంద్రబాబు హామీలిస్తారనుకుంటే ఉసూరుమనిపించారని అన్నారు. తన శాఖలో ఏం జరుగుతుందో తెలియని గుమ్మడి సంధ్యారాణి ఓ ఫెయిల్యూర్ మంత్రి అని విమర్శించారు.
చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్య, వైద్య వ్యవస్థలు పూర్తిగా నాశనమయ్యాయని మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర అన్నారు. ముఖ్యమంత్రి పర్యటనలో జిల్లాకు వరాలు కురిపిస్తారని ఆశించిన వారికి భంగపాటే మిగిలిందన్నారు. 2022లో పార్వతీపురం మన్యం జిల్లా ఏర్పడగా.. తాము జిల్లా అభివృద్ధికి ఏమీ చేయలేదని చెబుతున్న అధికార పార్టీ నేతలు.. అసలు ఈ 18 నెలల కాలంలో చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నాడు–నేడు నిధులతో గత ప్రభుత్వం మెట్టవలస, నగులు, పెద్దవలస తదితర గ్రామాల్లో తలపెట్టిన పాఠశాల భవనాలను ఎందుకు పూర్తిచేయలేకపోయారో మంత్రి సంధ్యారాణి సమాధానం చెప్పాలన్నారు.
● గిరిజన విశ్వవిద్యాలయాన్ని సాలూరు నియోజకవర్గానికి తీసుకువస్తే... ఇక్కడ అవసరం లేదు, దానిని ఎస్.కోట నియోజకవర్గంలో పెట్టండని చెప్పిన పెద్ద మనిషి.. ఇప్పుడు గిరిజన సంక్షేమశాఖ మంత్రి కావడం దౌర్భాగ్యమన్నారు. గిరిజన విద్యాసంస్థల్లోని కాంట్రాక్టు ఉపాధ్యాయుల ఉద్యోగాలు పోవని కౌన్సిల్ సాక్షిగా అబద్ధాలు చెప్పిన మంత్రి సంధ్యారాణి.. ఇప్పుడు చేసిందేమిటన్నారు. కౌన్సిల్లో అబద్ధాలు చెప్పినందుకు వారిపై సభాహక్కులు నోటీసులు కూడా ఇవ్వొచ్చన్నారు. పీవీటీజీ పీఓను మంత్రి సంధ్యారాణి కక్షగట్టి సస్పెండ్ చేశారని ఆరోపించారు. గిరిజన విద్యార్థుల మరణాలకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. దీనికి ప్రతిగా మంత్రిని సస్పెండ్ చేయాలన్నారు. పోలవరం నియోజకవర్గంలో ఒక విద్యార్థి చనిపోతే స్వయంగా అధికారులతో కలిసి వెళ్లి ఆ కుటుంబానికి రూ.10 లక్షలు ఆర్థిక సాయం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. గిరిజన ప్రాంతాల్లో రేషన్ బియ్యంకోసం గిరిజనులు అవస్థలు పడుతున్నా మంత్రికి పట్టకపోవడం విచారకరమన్నారు. అన్ని విధాలా మంత్రిగా విఫలమైన సంధ్యారాణి.. వైఎస్ జగన్‌ను విమర్శంచడం, ఆమె వాడు తున్న భాష సంస్కారహీనతను తెలియజేస్తుందన్నారు.
● ‘దండిగాం వంతెన నిర్మాణం కోసం రూ.11 కోట్లు మంజూరు చేయించాం. దుగ్గేరుమండలంలోని ఆడారుగెడ్డలో రూ.6 కోట్లతో మరో బ్రిడ్జి మంజూరు చేయిస్తే.. ఆ పనులు కూడా చేయించడం లేదు. సాలూరు మండలం శివరాంపురంలో మరో రూ.6 కోట్లతో బ్రిడ్జి మంజూరు చేయిస్తే.. ఆ పనులు కూడా మొదలుపెట్టడం లేదు. మా హయాంలో మంజూరైన, ప్రారంభించిన ఏ పనులనూ పూర్తి చేయడం లేదు కానీ... మా హయాంలో ప్రారంభమై పనులు పూర్తయిన వాటికి మాత్రం ప్రారంభోత్సవాలు చేస్తారు. సాలూరులో 100 పడకల ఆస్ప త్రికి సంబంధించి వారి హయాంలో కేవలం మెమో మాత్రమే జారీ చేశారు. మా ప్రభుత్వ హయాంలో 75 శాతం పనులు పూర్తిచేశాం. కరోనా కారణంగా పనులు ఆలస్యమైతే... ఇవాళ రూ.5 కోట్లు తెచ్చి వారే పూర్తి చేసినట్లు గొప్పలు చెప్పుకుంటున్నారు. గతంలో వారు మొదలుపెట్టిన పనులన్నీ తాము బాధ్యతతో పూర్తి చేశాం.’ అని తెలిపారు.
● మంత్రి సంధ్యారాణి పీఏతో పాటు ఆమె కుటుంబ సభ్యుల మీద ఆరోపణలు వస్తే.. దానికి తాము కారణమని చెప్పడం ఏమిటన్నారు. ఆ ఘటనతో పార్టీకి ఏం సంబంధమని ప్రశ్నించారు. ‘గిరిజనులకు మేలు చేయకుండా, మా పై నిందలు వేయడం ద్వారా మీ మంత్రి పదవిని కాపాడుకుందామనుకుంటున్నారే తప్ప.. గిరిజనులకు మేలు చేయాలన్న ఆలోచన లేద’ని విమర్శించారు.
కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు కనీసం 18 నెలల తర్వాతైనా తీరుతాయని ఆశించిన పార్వతీపురం జిల్లా వాసులకు నిరాశే మిగిలిందని మాజీ ఎమ్మెల్యే కళావతి అన్నారు. ‘మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై సంధ్యారాణి మాట్లాడిన తీరు తీవ్ర అభ్యంతరకరం. గిరిజనులున్నా, గిరిజన విద్యార్థులన్నా చంద్రబాబు ప్రభుత్వానికి, మంత్రి సంధ్యారాణికే చిన్నచూపు. ట్రంకుపెట్టులు, గ్లాసులు, ఆర్వోప్లాంట్లు ఇచ్చామని మంత్రి సంధ్యారాణి చెప్పడం సిగ్గుచేటు. అవి ప్రతి ఏటా పిల్లలకు అందిస్తారని మంత్రికి కనీస అవగాహన లేకపోవడం దారుణం. వైఎస్.జగన్ హయాంలో ఈ రాష్ట్రంలో విద్యావ్యవస్థలో సమూల మార్పులు చేశారన్నది పచ్చినిజం. నిన్న సీఎం చంద్రబాబు సభలో అనర్గళంగా ఇంగ్లిష్‌లో మాట్లాడిన విద్యార్థుల ప్రతిభ వెనుక వైఎస్ జగన్ ఉన్నారు.’ అని చెప్పారు తన పీఏ ఒక మహిళా ఉద్యోగిని వేధిస్తే... న్యాయం చేయలేని మహిళా సంక్షేమశాఖ మంత్రి సంధ్యారాణి.. రాష్ట్రంలో ఉన్న కోట్లాది మంది మహిళలకు ఏం రక్షణ కల్పించగలరని ప్రశ్నించారు. ‘మీ పనితీరుపై మీ పార్టీ నేతలే పెదవి విరుస్తున్నారు. మీ భాష, సంస్కారహీనం గిరిజనులకే తలవంపులు తెస్తోంద’ని అన్నారు.
సీఎం చంద్రబాబు పర్యటనపై ప్రజలు పెట్టుకున్న నమ్మకం ఒమ్ము అయిందని మాజీ డిప్యూ టీ సీఎం పుష్పశ్రీవాణి అన్నారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులతో పాటు కొత్త ప్రాజెక్టులు మంజూరు చేస్తారనుకున్న ఆశలన్నీ అడియాసలయ్యాయన్నారు. చంద్రబాబు పీటీ ఎం కార్యక్రమం తూతూమంత్రంగా సాగిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో విద్యావ్యవస్థలో సమూలమార్పులు, కొత్త సంస్కరణలు తీసుకొచ్చి విద్యావ్యవస్థను దూసుకుపోయేలా చేసింది జగన్ ప్రభుత్వమే. నాడు–నేడు ద్వారా దశలవారీగా 45 వేల స్కూళ్లు బాగుచేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వసతి దీవెన, విద్యాదీవెన, అమ్మఒడి, ఐబీ, 8వతరగతి పిల్లలకు ట్యాబుల పంపిణీతో పాటు నాడు–నేడు ద్వారా 9 అంశాలతో కూడిన వసతులు కల్పించి.. విద్యావ్యవస్థలో మార్పులు తీసుకొచ్చారు. గత ప్రభుత్వంలో 83 లక్షల మంది తల్లులుంటే... ఇవాళ కేవలం 66 లక్షల మంది తల్లులకు మాత్రమే చంద్రబాబు ప్రభుత్వం తల్లికి వందనం ప్రకటించింది. అందులో 63 లక్షల మందికి మాత్రమే తల్లికి వందనం నగదు అందించారని తెలిపారు.
‘ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం మరీ దారు ణం. 8 త్రైమాసికాలకు సంబంధించి రూ.5,600 కోట్లు చెల్లించాల్సి ఉంటే... రూ.700 కోట్లు మాత్రమే చెల్లించి రూ.4,900 కోట్లు బకాయిలు పెండింగ్.. వసతి దీవెన ఏడాదికి రూ.1,100 చొప్పున రెండేళ్లలో రూ.2200 కోట్లు పెండింగ్.. మొత్తం రూ.7800 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంలో డబ్బులు చెల్లించకుండా పెండింగ్‌లో ఉంచారు.
‘ప్రైవేటు, ప్రభుత్వ విద్యాసంస్థల్లో గతంలో 1 నుంచి ఇంటర్ వరకు 87.41 లక్షల మంది ఉంటే.. ఇవాళ 78.89 లక్షలమందికి తగ్గారు. 9.5 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు. విద్యా ప్రమాణాలు తగ్గిపోవడమే ఇందుకు కారణం.
2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వంలో ఏటా మధ్యాహ్న భోజనానికి రూ.400 కోట్లు మాత్రమే ఖర్చుపెట్టగా.. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఏడాదికి రూ.1400 కోట్లు ఖర్చుపెట్టారు. గత ప్రభుత్వ మార్కు కనిపించకూడదన్న దురుద్దేశంతో ట్యాబుల పంపిణీ, టోఫెల్ ఇలా అన్నిరకాల కార్యక్రమాలనూ నిలిపివేశారు. ముఖ్యమంత్రి కార్యక్రమంలో జిల్లాలో ఉన్న పెండింగ్ సమస్యలు ప్రస్తావించడం ద్వారా ప్రజలకు మంత్రి మేలు చేస్తారని ఎదురుచూస్తే... మంత్రి సంధ్యారాణికే ఆహ్వానం లేనట్టుంది. ముందురోజు పాత్రికేయుల సమావేశంలో సీఎం చంద్రబాబు సభను మనందరం విజయవంతం చేయాలన్న మంత్రే సమావేశంలో కనిపించలేదు. మీకు ఆహ్వానం లేదా? సమావేశానికి రావద్దని చెప్పా రా? మాట్లాడితే జగన్‌కు గిరిజనులంటే చులకనా? గౌరవం లేదని చెబుతారు... అలాంటిది మీ ప్రభుత్వంలో మీ ముఖ్యమంత్రే ఒక గిరిజన మంత్రికి గౌరవం ఇవ్వలేదు. అలాంటి మీరు మీ స్థాయి తెలుసుకోకుండా జగన్‌ను వ్యక్తిగతంగా విమర్శిస్తారా? మీ పనితీరు, ప్రభుత్వ తీరుపై ప్రశ్నిస్తే.. మీరు మాత్రం వ్యక్తిగతంగా దాడులకు దిగుతారు తప్ప, అడిగిన ప్రశ్నలకు జవాబు మీ నుంచి రాదు. కానీ గత ఐదేళ్లలో గిరిజనులను చులకనగా చూశారని, రోడ్లు వేయలేదని, ఆర్వో ప్లాంట్లు పెట్టలేదంటూ పచ్చి అబద్ధాలు చెప్పా రు. జగన్ ప్రభుత్వంలో గిరిజనులకు డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా మొత్తం రూ.19వేల కోట్లు ఖర్చు పెట్టారు. గిరిజన ప్రాంతాల్లో మెడికల్‌కాలేజీ, గిరిజన యూనివర్సిటీ, మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి, ఇంజినీరింగ్ కాలేజీలు జగన్ హయాంలోనే వచ్చాయి.
దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఒకే స్కూల్‌లో 200 మంది పచ్చకామెర్ల బారిన పడిన ఘటనలు ఎక్కడైనా ఉన్నాయా? ఇది చంద్రబాబు ప్రభుత్వ అసమర్థ పాలన కాదా? అనారోగ్యంతో చనిపోయిన గిరిజన పిల్లల కుటుంబాలకు కనీసం ఎక్స్ గ్రేషియా కూడా ఇప్పించలేని సంధ్యారాణి ఓ అసమర్థ మంత్రి అని పుష్పశ్రీవాణి విమర్శించారు. ఒక బాధిత మహిళ తనకు అన్యాయం జరగకపోతే.. మంత్రి పీఏపై ఫిర్యాదు చేయగలుగుతుందా? సాటి మహిళగా మీరే సమాధానం చెప్పండి. బాధ్యతగల మంత్రిగా విజ్ఞతతో వ్యవహరించండి, లేనిపక్షంలో సహించేది లేదు’ అని హెచ్చరించారు.
రాష్ట్రంలో విద్యావ్యవస్థను భ్రష్టు పట్టించిన చంద్రబాబు ప్రభుత్వం
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడమే వారి పని..
18 నెలల్లో ఏం చేశామో చెప్పుకోలేకే ఆ నిందలు
సెట్లు వేస్తే పాఠశాలల్లో లోటుపాట్లు ఎలా తెలుస్తాయి?
ఉసూరుమనిపించిన చంద్రబాబు మన్యం జిల్లా పర్యటన
పీటీఎం.. సిగ్గుచేటు!
పీటీఎం.. సిగ్గుచేటు!
పీటీఎం.. సిగ్గుచేటు!


