దోమతెరలు ఏవి బాబూ?
సీతంపేట:
జ్వరాల వ్యాప్తితో ఏజెన్సీ వణుకుతోంది. మలేరియా కారక దోమలు జనాలపై దాడిచేస్తున్నాయి. అస్వస్థతకు గురిచేసి ఆస్పత్రుల పాలచేస్తున్నాయి. పెద్దలతో పాటు చిన్నారులు, విద్యార్థులు తరచూ జ్వరాలబారిన పడి ఆస్పత్రుల్లో చేరుతున్నా చంద్రబాబు ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క దోమతెర కూడా పంపిణీ చేయలేదు. అధికారంలోకి వచ్చి 18 నెలలవుతున్నా దోమల తెరల పంపిణీపై ప్రభుత్వం శ్రద్ధచూపకపోవడంపై మన్యం ప్రజలు మండిపడుతున్నారు. పేరెంట్–టీచర్ మీటింగ్ అంటూ సినిమాసెట్టింగ్‌లు వేసి జనాలను మభ్యపెట్టడం కాదని, ప్రజలకు, విద్యార్థులకు ఏమి కావాలో తెలుసుకుని ముందుకు సాగాలని గిరిజన, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఇదీ పరిస్థితి...
పార్వతీపురం మన్యం జిల్లాలో సీతంపేట ఐటీడీఏ పరిధిలో 20 సబ్‌ప్లాన్ మండలాలుండగా వీటిలో 1187 గిరిజన గ్రామాలున్నాయి. 36,452 గిరిజన కుటుంబాలు ఉండగా, 1,51,052 మంది జనాభా నివసిస్తున్నారు. మలేరియా హైరిస్క్ గ్రామాలు 120 వరకు ఉన్నాయి. పీహచ్‌సీలు, ఏరియా ఆస్పత్రుస్పెపిడమిక్ సీజన్‌లో 400లకు పైగా మలేరియా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యసేవలు పొందిన వారి సంఖ్య దీనికి రెట్టింపు ఉంటుంది. ఐదేళ్ల కిందట రెండు లక్షల దోమతెరలను పంపిణీ చేశారు. దోమల నివారణకు దోహదపడేలా సింథటిక్ పెరాత్రిన్ మందు పూతతో ప్రత్యేకంగా తయారు చేసిన దోమతెరలను అప్పట్లో పంపిణీ చేశారు. మూడు నుంచి ఐదుగురు కుటుంబ సభ్యులున్న ఒక్కో కుటుంబానికి రెండు చొప్పున.. అంతకు మించి ఉన్నవారికి మూడు చొప్పున అందజేశారు. అవి ఇప్పుడు ఎందుకూ పనికిరాకుండా పోయాయి.
విద్యార్థులకు తప్పని దోమకాట్లు..
ఐటీడీఏ పరిధిలో 44 ఆశ్రమ పాఠశాలలు, 13 రెసిడెన్షియల్ పాఠశాలలు, మూడు గురుకుల కళాశాలలు, 13 పోస్టు మెట్రిక్ వసతిగృహాలున్నాయి. వీటిలో దాదాపు 20 వేల మంది గిరిజన విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరికి కూడా దోమతెరలు పంపిణీ చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు వారికి కూడా పంపిణీ జరగలేదు. గతంలో ఇచ్చిన దోమతెరలు నామమాత్రంగా అక్కడక్కడా వినియోగిస్తున్నారు. పాఠశాలల్లో విద్యార్థులు పెరిగిన స్థానంలో దోమతెరలు పంపిణీ లేదు.
దోమతెరల పంపిణీ ప్రతిపాదన ఉంది. స్టాక్ వచ్చిన వెంటనే పంపిణీ చేయడానికి చర్యలు తీసుకుంటాం. మలేరియా కేసులు నమోదైనచోట పంపిణీ చేస్తున్నాం. వసతి గృహాల విద్యార్థులకు కూడా దోమతెరలు పంపిణీ చేస్తాం.
– జె.మోహన్‌రావు,
మలేరియా నివారణ సబ్‌యూనిట్ ఆఫీసర్
ఏజెన్సీ వాసులకు పంపిణీకాని దోమతెరలు
అధికారం చేపట్టి 17 నెలలైనా పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం
ఒక్క దోమతెర కూడా ఇవ్వని వైనం
దోమల దాడితో ఇబ్బందులు పడుతున్న మన్యం ప్రజలు


