1800 కేజీల పేదల బియ్యం పట్టివేత
సాలూరు రూరల్: సాలూరు మండలం సారిక గ్రామంలో అక్రమంగా తరలించేందుకు ఆటో లో సిద్ధంగా ఉన్న 1800 కేజీల పేదల బియ్యంను విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ సతీష్, సిబ్బంది శనివారం పట్టుకున్నారు. ఒడిశాకు అక్రమంగా తరలిస్తుండగా పీడీఎస్ బియ్యం పట్టుకున్నట్టు ఆయన తెలిపారు. నిందుతులు జంపా సురేష్, కొర్ర మహేంద్రపై కేసు నమోదుచేసి బియ్యాన్ని తహసీల్దార్‌కు అప్పగించామని తెలిపారు.
పంట పొలాల్లో ఏనుగులు.. ఆవేదనలో కర్షకులు
జియ్యమ్మవలస: పంట చేతికొచ్చేవేళ పొలాల్లో ఏనుగుల సంచారంతో రైతులు భయాందోళన చెందుతున్నారు. కళ్లముందే ఏనుగులు పంటను ధ్వంసం చేస్తుండడంతో కంటతడిపెడుతున్నారు. వెంకటరాజపురం, గవరమ్మపేట, సుభద్రమ్మవలస, చింతల బెలగాం, సింగనాపురం, రాజీపేట, పెదమేరంగి, బాసంగి, బట్లభద్ర, బిత్రపాడు గ్రామాలకు చెందిన రైతులు ఏనుగుల రాకతో బెంబేలెత్తుతున్నారు. శని వారం ఉదయం వెంకటరాజపురం గ్రామంలో వరి ధాన్యం రాశులను చిందరవందర చేసిన ఏనుగులు సాయంత్రం 6 గంటల సమయంలో గ్రామంలోకి రావడంతో మళ్లించే ప్రయ త్నం చేశారు. అటవీ సిబ్బంది ఏనుగులకు కాపలాగా ఉంటున్నారే తప్ప తరలించే ఏర్పాటు చేయడంలేదని రైతులు వాపోతున్నారు.
దివ్యాంగుల జీవితాల్లో
‘గురుదేవా’ వెలుగులు
● కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి
కొత్తవలస: వివిధ ప్రమాదాలు, పోలియో, కుష్టు వ్యాధితో అవయవాలు కోల్పోతున్నవారి జీవితాల్లో గురుదేవా చారిటబుల్ ట్రస్టు వెలుగులు నింపుతోందని కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి అన్నారు. మంగళపాలెం సమీపంలోని గురుదేవా చారిటబుల్ ట్రస్టును కలెక్టర్ శనివారం సందర్శించారు. ట్రస్టు ఆధ్వర్యంలో నడుస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, క్యాన్సర్ ఆస్పత్రి, కృత్రిమ అవయవాల తయా రీ యూనిట్ విభాగాలను పరిశీలించారు. కృత్రిమ అవయవాలను వినియోగిస్తున్న దివ్యాంగులతో మాట్లాడి వారి అనుభవాలను తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగులకు సేవ చేయడం దైవసేవగా భావించాలన్నారు. అతి తక్కువ ఖర్ఛుతో కృత్రిమ అవయవాలు తయారుచేసి అందజేయడం గొప్పవిషయమన్నారు. దివ్యాంగులకు సేవచేసే భాగ్యం గురుదేవాకు దక్కిందన్నారు. ట్రస్టు చైర్మన్ రాపర్తి జగదీష్‌బాబును ప్రత్యేకించి అభినందించారు. ఈ సేవలు కొనసాగించేందుకు తనవంతు సహకారం అందస్తానని తెలిపారు. కార్యక్రమంలో కొత్తవలస తహసీల్దార్ పి.సునీత, ఆర్‌ఐ షణ్ముఖరావు, తదితరులు పాల్గొన్నారు.
వరలక్ష్మి రైస్ మిల్లుపై చర్యలు
● డీ ట్యాగ్ చేసిన అధికారులు
విజయనగరం ఫోర్ట్: రైతుల నుంచి అదనంగా ధాన్యం డిమాండ్ చేస్తున్న రైస్ మిల్లును పోర్టల్ నుంచి డీ ట్యాగ్ చేశారు. శ్రీకేవీర్ వరలక్ష్మి రైస్ ఇండసీ్త్ర మిల్లు యాజమాన్యం అదనపు ధాన్యం డిమాండ్ చేస్తున్నారని చీపురుపల్లి మండలానికి చెందిన రైతులు యల్లంటి సూర్యారావు, బూరాడ రమణ, తుంపల్లి త్రినాథ జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం విచారణలో నిజమని తేలడంతో జేసీ సేతుమాధవన్ చర్యలు తీసుకున్నారు. రైస్ మిల్లుకు తదుపరి ధాన్యం కేటాయింపు లేకుండా చర్యలు తీసుకుంటామని జేసీ తెలిపారు.
1800 కేజీల పేదల బియ్యం పట్టివేత
1800 కేజీల పేదల బియ్యం పట్టివేత


