విద్యార్థులకు పనిపాఠం!
తాళ్లబురిడి ఎంపీపీ స్కూల్‌లో కుర్చీని
శుభ్రం చేస్తున్న విద్యార్థి
పార్వతీపురం రూరల్:
పిల్లలు చక్కగా చదువుకుని ప్రయోజకులైతే కుటుంబ పరిస్థితి మారుతుందన్న ఆశతో తల్లిదండ్రులు కూలీనాలీచేసి ప్రభుత్వ బడులకు సాగనంపుతున్నారు. అక్కడ పుస్తకాలు పట్టుకోవాల్సిన చేతులతో పనులు చేయిస్తుండడం వారిలో ఆందోళన నింపుతోంది. ప్రతినెలా ప్రభుత్వం ఏదో ఒక కార్యక్రమాన్ని తలపెట్టడం.. ప్రభుత్వ బడుల్లో చదువుతున్న చిన్నారులకు చదువును దూరం చేయడం పరిపాటిగా మారిందంటూ వాపోతున్నారు. ప్రైవేటు పాఠశాలల పిల్లలు ఏ బాదరబందీ లేకుండా చదువులు సాగిస్తుంటే.. ఇక్కడ మాత్రం అరకొర నిధులు విదిల్చి మెగా పేరెంట్–టీచర్ మీటింగ్ (పీటీఎం) అంటూ హడావుడి చేయడం... పిల్లల తో షామియానాలు మోయించడం, కుర్చీలు, బెంచీలు తుడిపించడంపై తల్లిదండ్రులు భగ్గుమంటు న్నారు. చంద్రబాబు ప్రభుత్వ తీరును దుమ్మెత్తి పోస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తును చక్కదిద్దాల్సి న చదువుల నిలయం చివరకు పనులు చేయించే నిలయంగా మార్చేస్తున్నారని వాపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినట్లు ఊదరకొడుతున్న ‘మెగా పేరెంట్ టీచర్ మీటింగ్’ క్షేత్రస్థాయిలో నిధుల లేమితో ‘మెగా ఇబ్బందుల మీటింగ్’లా దర్శనమిచ్చిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
అన్ని పనులూ విద్యార్థులతోనే...
పార్వతీపురం మండలంలోని బందలుప్పి,తాళ్లబురి డి పాఠశాలల్లో నిర్వహించిన పీటీఎం ఏర్పాట్లన్నీ విద్యార్థులతోనే చేయించారు. టెంట్లు వేయడం దగ్గరి నుంచి కార్యక్రమం అయ్యాక వాటిని తీసి అప్పగించే వరకు అన్నీ చిన్నారులే చేశారు. చదువుల తల్లి ఒడిలో అక్షరాలు దిద్దాల్సిన చేతులు.. బరువులు మోస్తూ, టెంట్లు కడుతూ కనిపించడం తల్లిదండ్రులను విస్మయానికి గురిచేసింది.
అతిథులకు మర్యాద.. విద్యార్థులకు ఇబ్బంది
వచ్చిన వారికి మంచినీళ్లు, భోజనాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే, తగిన సిబ్బంది లేకపోవడంతో ఆ భారం కూడా పిల్లలపైనే పడింది. తాళ్లబురిడి ఎంపీపీ స్కూల్లో 50 మంది విద్యార్థులు ఉంటే, వారిని ఉపాధ్యాయుల పర్య వేక్షణలోనే పనులకు పురమాయించారు. అద్దెకు తెచ్చిన కుర్చీలు మోయడం, బెంచీలు సర్దడం వంటి పనులు విద్యార్థులే చేశారు. భోజనాల అనంతరం బెంచీలపై, కుర్చీలపై పడిన మెతుకులను శుభ్రం చేసే పనులనూ విద్యార్థులే చక్కబెట్టారు. పిల్లలతో ఈ పనులేంటి? అని పలువురు తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేశారు.
కార్యక్రమానికి ప్రభుత్వం కేటాయించిన నిధులు ఏ మూలకు? అన్నట్టుగా ఉన్నాయి. తాళ్లబురిడి జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో 130 మంది విద్యార్థులు ఉన్నారు. కనీసం టెంట్ వేయడానికి కూడా నిధులు చాలలేదో.. లేక ఆసక్తి లేదో తెలియదు కానీ, చెట్టు నీడనే వేదికగా మార్చేశారు. కొన్ని బెంచీలు, మరికొన్ని కుర్చీలు వేసి సమావేశాన్ని ‘మమ’ అనిపించారు. నిధులు ఇవ్వకుండా ఆర్భాటంగా ఆదేశాలు జారీచేస్తే క్షేత్రస్థాయిలో జరిగేది ఇలాంటి తంతు మాత్రమేనని ఈ ఘటన అద్దం పడుతోంది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో విద్యార్థుల భవితవ్యంపై శ్రద్ధ అంటే.. వారిని ఇలా పనులకు వినియోగించడమేనా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
విద్యార్థులకు పనిపాఠం!
విద్యార్థులకు పనిపాఠం!


