ఆర్టీసీ టికెట్‌పై రాయితీ
పాలకొండ రూరల్: పాలకొండ నుంచి విజయవాడ వెళ్తున్న ఇంద్ర బస్సులకు సంబంధించి టికెట్‌పై 20 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు జిల్లా ఆర్టీసీ అధికారి పి.వెంకటేశ్వరరావు తెలిపారు. పాలకొండ డిపోను ఆయన శుక్రవారం సందర్శించారు. ఇంద్ర బస్సుల్లో ప్రయాణికుల కు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. డిసెంబ ర్ 31వరకు ప్రయాణ రాయితీ కొనసాగుతుందన్నారు. పాలకొండలో రాత్రి 7 గంటలకు బస్సు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు విజయవాడ చేరుతుందని, ఆన్‌లైన్‌లో టికెట్స్ బుక్ చేసుకోవచ్చని తెలిపారు.
విజయనగరం: పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల ఆరోగ్యమే పరమావధిగా మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాలు చేపడితే, వాటిని కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గమంటూ విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైఎస్సార్‌సీపీ బాధ్యత గల ప్రతిపక్షంగా చేస్తున్న పోరాటం అంతం కాదని, ఆరంభం మాత్రమేనని స్పష్టంచేశారు. చంద్రబాబునాయుడు ప్రభుత్వం ప్రైవేటీకరణ ఆలోచన విరమించుకునేంత వరకు ప్రజల పక్షాన పోరాటం చేస్తామన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఎక్కడ మంచి పేరు వస్తుందోనన్న భయంతోనే చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటీకరణకు పూనుకుందన్నారు. ధర్మపురిలోని సిరిసహస్ర రైజింగ్ ప్యాలెస్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. కోటి సంతకాల సేకరణ కార్యక్రమం తుది దశకు చేరుకుందని చెప్పారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రతి నియోజకవర్గం నుంచి 50 వేల నుంచి 70వేల వరకు సంతకాలు సేకరణ జరిగిందన్నారు. గ్రామాలు, వార్డుల్లో ఇంటింటికీ వెళ్లి సంతకాలు సేకరించిన పార్టీ శ్రేణులను ఆయన అభినందించారు. సేకరించిన సంతకాలను ఈ నెల 16న రాష్ట్ర గవర్నర్‌కు వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో అందజేస్తామన్నారు.
విజయనగరం అర్బన్: జిల్లాలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ హామీ పథకం కింద 100 రోజుల పని కల్పనలో అలసత్వం తగదని కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి అన్నారు. పనుల కల్పనలో వెనుకబడిన మండలాల అధికారులపై శుక్రవారం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో అసహనం వ్యక్తంచేశారు. వంగర, మెంటాడ, జామి, వేపాడ, కొత్తవలస మండలాలు ప్రతి వారం ప్రగతి తగ్గుతుండడంపై నిలదీశారు. వెంటనే మెమోలు జారీ చేయాలని ప్రాజెక్టు డైరెక్టర్‌ను ఆదేశించారు. గుర్ల, విజయనగరం, ఎల్.కోట, రేగిడి, భోగాపురం మండలాల్లో నిర్దేశిత లక్ష్యాల సాధనకు పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. రోజువారీ వేతనం రూ.300 కంటే తక్కువ రాకుండా చూడాలన్నారు.
● వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో నిర్వహించిన మరో టెలికాన్ఫరెన్స్‌లో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో స్క్రబ్‌టైఫస్ వ్యాధిపై ప్రజల్లో అనవసర ఆందోళన రాకుండా విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
● జిల్లా అభివృద్ధి సూచికల్లో పలు శాఖలు వెనుకబడి ఉండడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తంచేశారు. పరిశ్రమలు, మహిళా అండ్ శిశు సంక్షేమం, పోలీస్, ఫిషరీస్, పశుసంవర్థక, ఉద్యానవన శాఖలు తమ ప్రగతిని తక్షణం మెరుగుపరచుకోవాలని, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగితాలపై మాత్రమే కాకుండా క్షేత్రస్థాయిలో నిజమైన, రియలిస్టిక్ డేటాను సిద్ధం చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో సీపీఓ బాలాజీ పాల్గొన్నారు.


