రేషన్ ఉచితం.. చార్జీల భారం
రేషన్ సరుకుల కోసం సుమారు 50 కి.మీ ప్రయాణిస్తున్న గిరిజనులు పని మానుకుని డిపోలకు పరుగులు ఎండీయూ వాహన వ్యవస్థ రద్దుతో అష్ట కష్టాలు
సాలూరు: వారంతా రెక్కాడితే గాని డొక్కాడని గిరిజనులు. ప్రభుత్వం ఇచ్చే ఉచిత రేషన్ బి య్యం కోసం చార్జీల భారం మోసేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతినెలా ఆర్థికంగా చితికిపోతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. సాలూరు మండలంలోని కరడావలస గిరిశిఖర గ్రామం. అక్కడ గిరిజనులంతా ప్రతి నెలారేషన్ సరుకుల కోసం దండిగాం జీసీసీ డిపోకు రావాలి. దీనికోసం వారు కరడావలస గ్రామం నుంచి రొడ్డవలస మీదుగా ఆంధ్రా–ఒడిశా ఘాట్‌రోడ్డు దిగి పి.కోన వలస దాటి సాలూరుకు చేరుకుంటున్నారు. సాలూరు నుంచి మామిడిపల్లి మీదుగా దండి గాంకు చేరుకుంటారు. ఓ వైపు సుమారు 50 కి. మీ దూరం. దీనికోసం ప్రైవేటు వాహనానికి ఒక వైపు మనిషికి రూ.200 చొప్పున చెల్లిస్తున్నారు. రానుపోను చార్జీలు ఒక్కొక్కరికి రూ.400 అవుతోంది. మరోవైపు భోజనం ఖర్చులు, కోల్పోయి న పనిదినం అన్నీ కలిపి రేషన్ సరుకుల కోసం సరాసరి రూ.1000 నష్టపోవాల్సి వస్తోందంటూ గిరిజనులు వాపోతున్నారు. బియ్యం ఉచితంగా ఇచ్చిన చార్జీలు తడిసిమోపెడు అవుతున్నాయని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గత ఐదేళ్లూ వాహనంతో వచ్చి మా ఊరికి దగ్గరలోనే బియ్యం ఇచ్చేవారని చెబుతున్నారు. కూలి పనులు కూడా మానుకోవాల్సిన అవసరం ఉండేది కాదని చెబుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక మాకు కష్టాలు తప్పడంలేదన్నారు.
కరడావలస నుంచి ఘాట్‌రోడ్డు గుండా పి.కోనవలస మీదుగా సాలూరు చేరుకుంటాం. అక్కడ నుంచి దండిగాంకు వెళ్తాం. ప్రైవేటు వాహనాలే మాకు ఆధారం. చేసేది లేక రానుపోను రూ.400 చార్జీలు అవుతున్నాయి. భోజనం ఖర్చులు, కూలి పని మానుకోవడం వల్ల కోల్పోయిన డబ్బులు కలిపితే రూ.1000 వరకు నష్టపోతున్నాం. ప్రభు త్వం, అధికారులు ఆలోచించి గ్రామంలోనే ఇచ్చే ఏర్పాట్లు చేయాలి. – చోడిపల్లి సుబ్బారావు,
రేషన్ లబ్ధిదారుడు, కరడావలస
రేషన్ సరుకుల కోసం మేము చాలా కష్టపడాల్సి వస్తోంది. వ్యయప్రయాసలు పడుతున్నాం. ప్రభుత్వం మా గురించి ఆలోచించాలి.
– పాలిక ఈశ్వరరావు,
గిరిజన రేషన్ లబ్ధిదారుడు, కరడావలస


