రైతుల అభ్యున్నతికి కృషి చేయాలి
● మంత్రి కొండపల్లి శ్రీనివాస్
నెల్లిమర్ల రూరల్: రైతుల అభ్యున్నతికి సెంచూరియన్ విశ్వ విద్యాలయం దోహదపడాలని, వారి ఆదాయం రెట్టింపుకు కృషి చేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. మండలంలోని టెక్కలి సెంచూరియన్ వర్సిటీలో రైతు సమ్మేళనం కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని, వ్యవసాయం లాభసాటిగా మారేందుకు అవసరమైన సూచనలను రైతులకు అందజేయాలన్నారు. వర్సిటీ వైస్ ప్రెసిడెంట్ డీఎన్ రావు మాట్లాడుతూ మట్టి లేకుండా వ్యవసాయం, గాలితో పంటలు పండించడం.. తదితర వినూత్న ప్రయోగాలకు శ్రీకారం చుట్టామన్నారు. విజయనగరం, గజపతినగరం, నెల్లిమర్ల నియోజకవర్గాల్లో గ్రామాలను దత్తత తీసుకుని నూతన పద్ధతులను రైతులకు వివరిస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు లోకం మాధవి, పూసపాటి అదితి గజపతిరాజు, తదితరులు పాల్గొన్నారు.
నేడు సీనియర్ ఫెన్సింగ్ క్రీడాకారుల ఎంపికలు
విజయనగరం: రాష్ట్ర స్థాయిలో జరగనున్న సీనియర్స్ సీ్త్ర, పురుషుల ఫెన్సింగ్ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా క్రీడాకారుల ఎంపికలు ఈ నెల 9న ఆదివారం నిర్వహించనున్నట్టు చీఫ్ కోచ్ డివి.చారి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నగర శివారుల్లో గల విజ్జి స్టేడియంలో ఉదయం 9 గంటల నుంచి ఎంపికలు ప్రారంభమవుతాయని, ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని రాజమండ్రిలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు పంపనున్నట్టు తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


