జాతీయ స్థాయిలో క్రీడాకారులు రాణించాలి : జేసీ
పార్వతీపురం టౌన్: విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, వారికి ఉన్నత వేదికలపై అవకాశాలు కల్పించడమే క్రీడల ప్రధాన ఉద్దేశమని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి తెలిపారు. క్రీడలు కేవలం విజయం కోసం మాత్రమే కాదని, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందించడానికి ఉపయోగపడతాయని ఉద్ఘాటించారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో రాణించాలని ఆకాంక్షించారు. జన్ జాతీయ గౌరవ దివాస్ వేడుకల్లో భాగంగా స్థానిక ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి ఆటలు మరియు క్రీడలు ఐటీడీఏ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి జేసీ ముఖ్య అతిథిగా పాల్గొని ఆటలను, క్రీడలను లాంఛనంగా ప్రారంభించారు. ఆర్చరీ, జావలిన్ త్రో, వాలీబాల్, కబడ్డీ, వక్తత్వ, వ్యాస రచన పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన క్రీడాకారులను, కోచ్‌లను, పీఈటీలు, పీడీలను జేసీ అభినందించారు. అనంతరం వాలీబాల్ క్రీడలో పాల్గొని జేసీ కాసేపు క్రీడాకారులతో కలిసి ఆడారు. క్రీడలతో విద్యార్థుల్లో మానసిక ఉల్లాసం, ఉత్తేజంతో పాటు ఆరోగ్యంగా ఉంటారని, ప్రతీ విద్యార్థి ఏదో ఒక క్రీడ, ఆటల్లో నైపుణ్యాన్ని పెంపుందించుకోవాలని అన్నారు. జిల్లా స్థాయి విజేతలు రాష్ట్ర స్థాయిలో కూడా పతకాలు సాధించి జిల్లాకు మంచి పేరును తీసుకురావాలని ఆకాంక్షించారు. అలాగే వ్యాసరచన, వక్తృత్వ పోటీలను జేసీ తిలకించారు. కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీవో పి.మురళీధర్, ఆర్.కృష్ణవేణి, క్రీడాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు.


