మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై సమాచారం ఇవ్వండి
పార్వతీపురం టౌన్: జిల్లాలో మాదకద్రవ్యాలు, మత్తు పదార్ధాల అక్రమ రవాణా జరుగుతున్నట్టు తమ దృష్టికి వస్తే 1972 టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి సమాచారం అందించాలని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి సూచించారు. ముఖ్యంగా విద్యార్థులు, యువత ఈ విషయంలో చురుకుగా పాల్గొని, వివరాలను అందజేయాలని కోరారు. మాదకద్రవ్యాల రవాణా నివారణ, రహదారి భద్రతపై అవగాహన సదస్సు శుక్రవారం స్థానిక ఆర్టీసీ డిపోలో రవాణా, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను వాహన డ్రైవర్లు తెలిసి చేసినా, తెలియక చేసినా శిక్షార్హులు అవుతారని స్పష్టం చేశారు. ఈ అక్రమ రవాణాకు చట్టంలో కఠిన శిక్షలు ఉన్నాయని, జీవితాంతం జైలులోనే ఉండాల్సి ఉంటుందని హితవు పలికారు. అందువలన ప్రతీ డ్రైవర్ కూడా తమ వాహనాల్లో తీసుకువెళ్లే బ్యాగులను, సంచులు, ఇతర సామగ్రిపై దృష్టి సారించాలని, అనుమానస్పదంగా ఉంటే తక్షణమే టోల్ ఫ్రీ నంబరుకు సమాచారం ఇవ్వాలన్నారు. ప్రతీ డ్రైవర్ కచ్చితంగా రహదారి భద్రత నియమాలు పాటించాలని కలెక్టర్ తేల్చి చెప్పారు.
ఎస్పీ ఎస్.వి.మాధవ్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో విశాలమైన రహదారులు లేకపోవడం, ఉన్న రహదారుల్లో సక్రమంగా రహదారి భద్రత నియమాలు పాటించని కారణంగా ఈ ఏడాదిలో సుమారు 80 మంది వరకు మృతి చెందారని, 150 మంది వరకు క్షతగాత్రులు అయ్యారని వెల్లడించారు. అతి వేగం, మితిమీరిన మనుషులను వాహనాల్లో ఎక్కించుకొని వెళ్ళి ప్రమాదాలు జరిగితే, వారితో పాటు వాహనంలో ఉండే వారి జీవితాలు నాశనం అవుతాయని తెలిపారు. ప్రతీ వాహన డ్రైవరు క్రమశిక్షణ కలిగి ఉండాలని, జాగ్రత్తలు, నియమాలు తప్పక పాటించాలని సూచించారు. ఆర్టీసి డ్రైవర్లు ఎక్కడ పడితే అక్కడ వాహనాలను ఆపకుండా, సేఫ్ ప్రదేశాల్లో నిలపాలని సూచించారు. అనుమానాస్పదంగా ఉండే బ్యాగులు, సామగ్రిపై దృష్టి సారించి 1972కు సమాచారం అందించాలని అన్నారు. ముఖ్యంగా కోరాపుట్, రాయపూర్ ప్రాంతాల నుంచి గంజాయి రవాణా అవుతుందని, ఈ ప్రాంతాలే కాక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిపై నిఘా ఉంచి సమాచారం చేరవేయాలన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ వి.మనీషారెడ్డి, సబ్ కలెక్టర్ ఆర్.వైశాలి, జిల్లా ప్రజా రవాణా అధికారి పి.వెంకటేశ్వరరావు, జిల్లా రవాణా శాఖాధికారి టి.దురా్గాప్రసాద్ రెడ్డి, ఎకై ్సజ్, పోలీస్ తదితర శాఖల అధికారులు, ఆర్టీసీ అధికారులు, ప్రభుత్వ, ప్రైవేట్ వాహన డ్రైవర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి


