టీడీపీ నాయకుడి దురుసు ప్రవర్తనపై ఆగ్రహం
● సమస్యలపై మాట్లాడితే సంగతి
తేలుస్తానంటూ హెచ్చరిక
● టీడీపీ నాయకుడి తీరుపై ప్రజా సంఘాల నేతల ఆగ్రహం
పార్వతీపురం రూరల్: టీడీపీ నాయకుడు రాష్ట్ర కొప్పలవెలమ డైరెక్టర్ గొట్టాపు వెంకటనాయుడు వైఖరి ప్రజాస్వామ్య విరుద్ధమని సీపీఎం సీనియర్ నాయకుడు ఎం.కృష్ణమూర్తి తీవ్రంగా ఖండించారు. రాజకీయ అండదండలతో గిరిజనులను బెదిరించడం మానుకోవాలని ఆయన తేల్చి చెప్పారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ వద్ద ఆయన మాట్లాడుతూ గిరిజన సంఘం నాయకుడు పాలమెట్ట రాముకు గురువారం రాత్రి వెంకటనాయుడు ఫోన్ చేసి జమదాల సచివాలయం వద్ద నిరసన చేయడం పట్ల ప్రశ్నిస్తూ దుర్భాషలాడారని.. ఇకనైనా ఇటువంటి పనులు మానుకోలేకుంటే నీ సంగతి తేలుస్తా.. అని బెదిరించారన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేయడం తమ హక్కు అని, జమదాల గ్రామ సచివాలయం వెంకటనాయుడు జాగీరు కాదని సీపీఎం నాయకులు స్పష్టం చేశారు. జమదాల ప్రాంతంలో జరుగుతున్న భూ సర్వేలోని తప్పులను సరి చేయాలని ఫిర్యాదు చేస్తే.. ఈ విధంగా అడ్డుకొనే ప్రయత్నం చేయడం వెనుక అక్రమాలపై వెంకటనాయుడు ప్రమేయం ఉందని వారు ధ్వజమెత్తారు. బెదిరింపులకు భయపడేదే లేదని, ప్రజల పక్షాన నిలబబడతామని పాలమెట్ట రాము తేల్చి చెప్పారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి కొల్లి గంగునాయుడు, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బంటు దాసు, మరికొందరు గిరిజనులు పాల్గొన్నారు.


