ఇద్దరు అసమర్థుల వల్లే గిరిజన బిడ్డలకు ఈ దుస్థితి!
ఎక్స్‌గ్రేషియా ఎగ్గొట్టేందుకే మంత్రి బాధ్యాతారాహిత్య వ్యాఖ్యలు
కలెక్టర్ మీద ఎలాంటి ఒత్తిడి ఉందో..!
జిల్లాలో ఉన్న అసమర్థ మంత్రి, విప్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వారి నాయకుడిని ఒప్పించడంలో విఫలమయ్యారని.. అది వారి చేతకానితనం అని పుష్ప శ్రీవాణి విమర్శించారు. తాము ప్రతిపక్షంలో ఉన్నా సరే.. గిరిజన పిల్లల కష్టాన్ని తమ నాయకుడు జగన్ మోహన్ రెడ్డికి వివరించి, కేజీహెచ్‌కు తీసుకెళ్లామని గుర్తు చేశారు. ఘటనను చూసి చలించిన ఆయన.. గిరిజన కుటుంబాలను ఓదార్చి, భరోసా ఇచ్చారని తెలిపారు. అక్కడే మృతి చెందిన ఇద్దరి పిల్లల కుటుంబాలకు తమ పార్టీ తరపున రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారని వివరించారు. ఆ మొత్తం కూడా వెంటనే అందజేశామని తెలిపారు. అది నాయకుడి గొప్పతనమన్నారు. ప్రభుత్వంలో ఉండి, వారు చేసినదేమిటి అని ప్రశ్నించారు. వారు వేస్ట్.. వారికి ఏం చెప్పినా వేస్ట్ అని విమర్శించారు. ‘మంత్రి ఎప్పుడూ ఒక మాట అంటుంటారు. వారు ఏది చెప్పినా, చంద్రబాబునాయుడు సలహాలు అడుగుతారంట. కచ్చితంగా వీరు సలహా ఇచ్చి ఉండరు. లేకపోతే అడిగి ఉండరు. ఎక్స్‌గ్రేషియా వద్దని వీరే చెప్పేసి ఉంటారేమో!’ అని సందేహం వ్యక్తం చేశారు. విద్యార్థుల మరణాలపైనా ఆమె పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం తమ ప్రాంత గిరిజన బిడ్డలన్న జాలి కూడా వీరికి లేదని అన్నారు. గిరిజనులకు ఏం జరిగినా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా ఉండదన్నారు.
సాక్షి, పార్వతీపురం మన్యం: ఇద్దరు అసమర్థుల వల్లే జిల్లాలో గిరిజన బిడ్డలకు అన్యాయం జరుగుతోందని మాజీ ఉప ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ కురుపాం నియోజకవర్గ ఇన్‌చార్జి పాముల పుష్పశ్రీవాణి అన్నారు. కురుపాం నియోజకవర్గంలో ప్రభు త్వ నిర్లక్ష్యం కారణంగా అనారోగ్యంతో మృతి చెందిన కల్పన, అంజలి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియాను ఇవ్వడంలో నిర్లక్ష్యం, వివక్ష చూపుతున్నారని ధ్వజమెత్తారు. కొన్ని చోట్ల ప్రభుత్వానికి సంబంధం లేనటువంటి ఘటనల్లోనూ స్పందించి, పరిహారం అందజేస్తున్నారని.. అమాయక గిరిజన ప్రజలకు ఇవ్వడానికి ఎందుకు ఆలోచిస్తున్నారని ప్రశ్నించారు. ‘ఒక అసమర్థ మంత్రి.. ఒక అసమర్థ విప్.. వీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, సున్నితమైన అంశాన్ని ముఖ్యమంత్రికి చెప్పి, ఎక్స్‌గ్రేషియా తెచ్చుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే వీరి చేతకానితనం. మన నాయకుడిని ఒప్పించాలంటే అది సత్తా బట్టి ఉంటుంది. వీరిద్దరికీ అది లేదని అర్థమవుతోంద’ని విమర్శించారు. కురుపాం నియోజకవర్గంలోని పలువురు ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, వైఎస్సార్‌సీపీ నాయకులతో కలిసి కలెక్టరేట్‌లో కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డిని శుక్రవారం ఆమె కలిశారు. తమ నియోజకవర్గంలో ఇద్దరు విద్యార్థుల మరణాలు, పరిహారం, అసంపూర్తిగా నిలిచిపోయిన గిరిజన ఇంజినీరింగ్ కళాశాల నిర్మాణం, ధాన్యం కొనుగోలు తదితర సమస్యలపై వినతిపత్రం అందజేశారు. అనంతరం కలెక్టరేట్ వెలుపల మీడియాతో ఆమె మాట్లాడారు.
మారుమూల, గిరిజన ప్రాంత అభివృద్ధిని.. చదువును కాంక్షిస్తూ కురుపాంలో నాటి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి 2020 అక్టోబర్‌లో గిరిజన ఇంజినీరింగ్ కళాశాల పనులను ప్రారంభించారని పుష్ప శ్రీవాణి తెలిపారు. గత ప్రభుత్వ హయంలోనే 70 శాతం పనులు పూర్తయ్యాయని గుర్తు చేశారు. ఎన్నికల తర్వాత మిగులు పనులను పూర్తి చేయకుండా ఈ ప్రభుత్వం అలానే వదిలేసిందన్నారు. ఇక్కడ ఇంజినీరింగ్ కాలేజీ పూర్తయితే 50 శాతం సీట్లు గిరిజన విద్యార్థులకే లభిస్తాయని, ఈ ప్రాంతం రూపురేఖలే మారిపోదునని చెప్పారు. ఇది కూడా కూటమి ప్రభుత్వానికి ఇష్టం లేదన్నారు. కురుపాం సీహెచ్‌సీ అదనపు భవనాలను గత ఎన్నికలకు ముందే రూ.3 కోట్ల వ్యయంతో పూర్తి చేశామని.. ఈ 18 నెలల కాలంలో చిన్నపాటి మరమ్మతులు పూర్తిచేసి దానిని అందుబాటులోకి తీసుకు రాలేకపోయారని తెలిపారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి పేరు వస్తుందనే.. వీటిని నిర్లక్ష్యంగా వదిలేశారని చెప్పారు. ఇటీవల ఆస్పత్రిలో విద్యార్థులు చికిత్స పొందుతున్న సమయంలో పడకలు చాలక.. ఇద్దరు, ముగ్గురిని ఒకే బెడ్ మీద ఉంచారని గుర్తు చేశారు. అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నచోట గర్భిణులను, బాలింతలను, చిన్నపిల్లలను, డయేరియా రోగులను కూడా అదే గదిలో పెట్టేశారని చెప్పారు. భవనాన్ని ప్రారంభిస్తే ప్రజలకు ఉపయోగపడదా? అని ప్రశ్నించారు. కేవలం రాజకీయ కుట్రతో, వైఎస్సార్‌సీపీకి పేరు వస్తుందన్న అక్కసుతో ప్రారంభించడం లేదని చెప్పారు.
తాను పట్టుకున్న కుందేలుకు మూడే కాళ్లన్నట్లు మంత్రి సంధ్యారాణి వాదిస్తున్నారని.. వాస్తవాలను దాచి పై నుంచి వచ్చిన స్క్రిప్ట్‌ను పదేపదే ఫాలో అవుతున్నారని పుష్పశ్రీవాణి విమర్శించారు. రాష్ట్రంలో ప్రైవేట్ ట్రావెల్స్, సంస్థల్లో ప్రమాదాలు జరిగినా, వివిధ చోట్ల ప్రభుత్వానికి సంబంధం లేకపోయిన మరణాలకూ పరిహారం ప్రకటించిన కూటమి ప్రభుత్వం.. గిరిజన విద్యార్థుల మరణాలను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ‘సీతంపేటలో విద్యార్థి చనిపోతే కుటుంబ సభ్యులు, ప్రజాసంఘాలు, గిరిజనుల ఆందోళన నేపథ్యంలో అక్కడి డీడీ రూ.2 లక్షల పరిహారం, కుటుంబంలో ఒకరికి అవుట్‌సోర్సింగ్ ఇస్తామని మీడియా ఎదుటే ప్రకటించారు. నిన్న జరిగిన జెడ్పీ సమావేశంలో మా జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు అడిగిన సందర్భంలో తామెక్కడా ప్రకటించలేదని మంత్రి అంటున్నారు. దీన్నిబట్టి గిరిజన పిల్లలు చనిపోతే ప్రభుత్వానికి పట్టదని అర్థమవుతోంద’ని ఆమె తెలిపారు.
కురుపాం బాలిక గిరిజన గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థినులు కల్పన, అంజలి మరణాలపై మంత్రి సంధ్యారాణి వాస్తవాలను దాచి అబద్ధాలు చెబుతున్నారని పుష్పశ్రీవాణి ధ్వజమెత్తారు. ఇది పూర్తిగా బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు.. మంత్రి పదవిలో ఉన్నా ఆమె తీరు మారలేదని విమర్శించారు. దసరా సెలవులకని పాఠశాల నుంచి వెళ్లిపోయాకే అనారోగ్యం పాలయ్యారని, మరణాలు సంభవించాయని ఆమె చెప్పడం ఎక్స్‌గ్రేషియా ఎగ్గొట్టే ప్రయత్నంలో, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే అని ఆరోపించారు. కలెక్టర్‌కు ట్రైబల్ వెల్ఫేర్ డీడీ ఇచ్చిన నివేదికలో ఏముందో తెలియదా? అని ప్రశ్నించారు. ‘కల్పన 30వ తేదీన ఆస్పత్రిలో చేరింది.. ఒకటో తేదీన చనిపోయిందని మంత్రి అంటున్నారు. ఇది ఆమెకున్న అవగాహనా రాహిత్యమా..? కల్పన పది రోజులు ఆస్పత్రిలోనే ఉందన్న విషయం అందరికీ తెలుసు. మరో విద్యార్థిని దుడ్డుఖల్లు పీహెచ్‌సీకి తీసుకెళ్తే సాధారణ జ్వరమని చెప్పి మందులిచ్చి పంపించేశారు. నాలుగు రోజులు మందులు వాడాక ఆమె చనిపోయింది. జ్వరం వచ్చిన ఐదు రోజులకే ఎవరైనా చనిపోతారా? మనిషిలో ఇమ్యూనిటీ ఉంటుంది. ఎంత తీవ్రత అయితేనే గానీ వెంటనే చనిపోరు. సరైన చికిత్స, సకాలంలో అందకే పిల్లలు చనిపోయారు. ఇది మీ ప్రభుత్వం, యంత్రాంగం నిర్లక్ష్యం కాదా? 22 నుంచి సెలవులు అయితే.. 20, 21వ తేదీల్లో పిల్లలను పంపించేయడం ఏమిటీ? రిపోర్ట్స్ అబద్ధమా.. మంత్రి మాటలు అబద్ధమా.. ఆరోగ్యం బాగోలేని పిల్లలను ఇళ్లకు ఎలా పంపుతారు. పాఠశాలల్లో అనారోగ్యం పాలైన విద్యార్థులకు వైద్యం అందించే బాధ్యత ప్రభుత్వానిది కాదా?’ అని పుష్పశ్రీవాణి ప్రశ్నించారు
ఇద్దరి అసమర్థ పాలకుల మీద నమ్మకం లేకనే ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని కలెక్టర్‌కు ఈ రోజు వినతి పత్రం అందించామని పుష్పశ్రీవాణి తెలిపారు. ఆయన రియాక్షన్, రెస్పాన్స్ చూస్తే కలెక్టర్ మీద కూడా ఎంత ఒత్తిడి ఉందో అర్థం అవుతుందని చెప్పారు. అధికారులంటే ఎమ్మెల్యేలో, మంత్రులో చెప్పిన పని చేయడం కాదని.. ప్రతిపక్షంగా ప్రజల తరఫున చెప్పే సమస్యలపైనా సానుకూలంగా స్పందించాలన్నారు. జిల్లాలో నేటికీ ధాన్యం కొనుగోలు ప్రారంభం కాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అవసరమైన గన్నీలూ సమకూర్చలేదని తెలిపారు.
తక్షణం గన్నీలు అందించి, ధాన్యం సేకరణ ప్రారంభించాలని కలెక్టర్‌ను కోరినట్లు ఆమె చెప్పారు. గిరిజన విద్యార్థుల కుటుంబాలకు పరిహారం ఇచ్చే వరకూ తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. గిరిజనులు, విద్యార్థులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమన్నారు.


