ఏరియా ఆస్పత్రి ప్రక్షాళనకు చర్యలు
● పాలకొండ ఏరియా ఆస్పత్రిని తనిఖీ చేసిన సబ్ కలెక్టర్, డీసీహెచ్‌ఎస్
● పనితీరు మెరుగుపర్చుకోవాలని వైద్యులకు హెచ్చరిక
పాలకొండ: స్థానిక ఏరియా ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో రోగులకు మెరుగైన సేవలందడంలేదన్న అంశంపై ‘నర్సింగ్ విద్యార్థులే దిక్కు’ అనే శీర్షినక ‘సాక్షి’లో శుక్రవారం ప్రచురితమైన కథనానికి కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి స్పందించారు. ఆస్పత్రిలో సేవలపై వైద్యాధికారులను ఆరా తీశారు. సమగ్ర నివేదిక ఇవ్వాలని సబ్ కలెక్టర్‌తో పాటు జిల్లా వైద్యశాఖ అధికారులను ఆదేశించారు. ఆ మేరకు పాలకొండ సబ్ కలెక్టర్ పవర్ స్వప్నిల్ జగన్నాథ్ ఆస్పత్రిని తనిఖీ చేశారు. ఆస్పత్రిలో వైద్యుల హాజరు పరిశీలించారు. పనితీరు మెరుగుపర్చుకోవాలని ఎముకుల విభాగం వైద్యురాలికి సూచించారు. వైద్యులు ఇంత నిర్లక్ష్యం చేస్తుంటే మీరేం చేస్తున్నారని సూపరింటెండెంట్ డాక్టర్ చిరంజీవిని ప్రశ్నించారు. ముగ్గురు వైద్యులను మౌఖికంగా హెచ్చరించామని, వీరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని సూపరెండెంట్ వివరణ ఇచ్చారు. మద్యం మత్తులో ఉంటూ విధులకు వస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు వైద్యులు తన కార్యాలయానికి వచ్చి వివరణ ఇవ్వాలని సబ్ కలెక్టర్ ఆదేశించారు. అంతకు ముందు జిల్లా వైద్య విధాన పరిషత్ అధికారి జి.నాగభూషణరావు ఆస్పత్రిని సందర్శించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైద్యులకు షోకాజు నోటీసులు ఇవ్వాలని సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. పలుమార్లు హెచ్చరిస్తున్నా వైద్యుల తీరు మారడం లేదని అసంతృప్తి వ్యక్తంచేశారు. ప్రజలకు మెరుగైన సేవలందించాలని, లేదంటే బదిలీపై వెళ్లిపోవాలన్నారు.
ఏరియా ఆస్పత్రి ప్రక్షాళనకు చర్యలు
ఏరియా ఆస్పత్రి ప్రక్షాళనకు చర్యలు


