మహోజ్వల మంత్రం ‘వందేమాతరం’
● కలెక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి
పార్వతీపురం రూరల్: బ్రిటీష్ పాలనపై పోరాటానికి యావత్‌భారత జాతిని ఏకతాటిపై నిలిపిన మహోజ్వల మంత్రం వందేమాతరం గేయమని, దాని స్ఫూర్తితో దేశ ఔన్నత్యాన్ని పెంచే దిశగా ప్రతిఒక్కరూ నడుచుకోవాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర కాంక్షను రగిలించిన వందేమాతరం గీతం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న తరుణంలో శుక్రవారం కలెక్టరేట్ ఆవరణలో ఎన్‌సీసీ, స్కౌట్ పాఠశాల విద్యార్థుల నడుమ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ బంకిమ్ చంద్ర ఛటర్జీ కలం నుంచి జాలువారిన ఈ గేయం ప్రతిపౌరునిలో ఉద్యమస్ఫూర్తి నింపిందన్నారు. అనంతరం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సెల్ఫీపాయింట్ వద్ద కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు ఫొటోలు దిగారు. కార్యక్రమంలో డీఆర్వో కె.హేమలత, విద్యాశాఖాధికారులు రాజ్‌కుమార్, వై.నాగేశ్వరరావు, రెడ్‌క్రాస్ చైర్మన్ శ్రీరాములు, విద్యార్థులు పాల్గొన్నారు.


