బస్సుల్లో భద్రత లెస్సు! | - | Sakshi
Sakshi News home page

బస్సుల్లో భద్రత లెస్సు!

Nov 7 2025 7:21 AM | Updated on Nov 7 2025 7:21 AM

బస్సు

బస్సుల్లో భద్రత లెస్సు!

బస్సుల్లో భద్రత లెస్సు!

హడలెత్తిస్తున్న వరుస ప్రమాదాలు

మొన్న పార్వతీపురం, నేడు పాచిపెంట ఘాట్‌రోడ్డులో ఘటనలు

సాక్షి, పార్వతీపురం మన్యం: కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో 19 మంది..రంగారెడ్డి జిల్లా చేవెళ్ల దుర్ఘటనలో 24 మంది దుర్మరణం చెందిన విషయం విదితమే. తెలుగు రాష్ట్రాల్లో వరుసఘటనలు ప్రయాణికులను హడలెత్తిస్తున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లాలోనూ గురువారం ఉదయం పాచిపెంట మండలంలోని ఘాట్‌ రోడ్డు వద్ద ఇదే తరహా ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సులో మంటలు రేగాయి. కాసేపటికే వాహనం మొత్తం అగ్నికి ఆహుతైంది. డ్రైవర్‌ అప్రమత్తత వల్ల పెనుప్రమాదం తప్పింది. అదృష్టవశాత్తు బస్సులో ఉన్న వారందరూ సురక్షితంగా బయటపడ్డారు.

దీపావళి ముందు రోజు విజయనగరం నుంచి పార్వతీపురం వచ్చిన ఆర్టీసీ బస్సులో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను గుట్టుగా రవాణా చేశారు. పార్సిల్‌ కేంద్రం వద్ద వాటిని దించే క్రమంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. రవాణా చేసే సమయంలో బస్సులో ఇదే పేలుడు సంభవించి ఉంటే పెను ప్రమాదమే జరిగి ఉండేది. ఈ ఘటనలు బస్సుల్లోని భద్రతను ప్రశ్నిస్తున్నాయి. ప్రయాణికులు సురక్షితమేనా? అన్న సందేహాలు లేవనెత్తున్నాయి.

– గతంలోనూ పార్వతీపురం మండలం బాలగుడబ వద్ద ఓ ప్రైవేట్‌ స్కూల్‌ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారు. డ్రైవర్‌ మృతిచెందాడు. డ్రైవర్‌ మద్యం తాగి వాహనం నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగింది.

భద్రత డొల్ల..తనిఖీలు నిల్‌

ఆర్టీసీ సర్వీసుల్లో అధికశాతం కాలం చెల్లినవే. ప్రభుత్వ సర్వీసులు కావడంతో వాటిపై పెద్దగా దృష్టి సారిస్తున్న దాఖలాలు ఉండడం లేదు. మహిళలకు ఉచిత ప్రయాణం పుణ్యమాని..ప్రయాణికుల సంఖ్య బాగా పెరిగింది. కొన్ని బస్సుల్లో 70 మందికి పైగా ప్రయాణిస్తున్నారు. అధిక లోడు..జిల్లాలో చిన్న రహదారులు.. గోతుల మార్గాలే ఎక్కువ కావడం వల్ల బస్సులు తరచూ మొరాయిస్తున్నాయి. ఇవే కాక..ప్రైవేట్‌ సర్వీసులూ అధికంగానే నడుస్తున్నాయి. రాయగడ, నారాయణపట్నం, బత్తిలి, గుణుపూరు, ఇచ్ఛాపురం వంటి ప్రాంతాలకు ప్రైవేట్‌ సర్వీసులు రోజూ రాకపోకలు సాగిస్తున్నాయి. విజయవాడ, హైదరాబాద్‌ వంటి నగరాలకు స్లీపర్‌ బస్సులు కూడా జిల్లా నుంచి నిత్యం వెళ్తున్నాయి. వాటిలో తనిఖీలు తరచూ జరగడం లేదు. స్కూల్‌ బస్సులు సైతం ఫిట్‌నెస్‌ సరిఫికెట్‌లు లేకుండానే నడుస్తున్నాయి. వాటిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన సంబంధిత అధికారులు షరా ‘మామూలుగా’ వదిలేస్తున్నారు.

ప్రమాదాలకు ఆస్కారం..

జిల్లాలో ఏ మూలకు వెళ్లినా గుంతల రహదారులే దర్శనమిస్తున్నాయి. ప్రమాదాలకు ఆస్కారమిస్తున్నాయి. రహదారుల నిర్వహణను కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసింది. గుంతలు లేని రహదారులు అంటూ కొద్ది రోజులు ఆర్భాటం చేసి వదిలేసింది. ఆంధ్రా–ఒడిశా ప్రధాన మార్గమైన బొబ్బిలి–పార్వతీపురం, పార్వతీపురం–కొమరాడ–కూనేరు, ఇటు పార్వతీపురం నుంచి పాలకొండ వెళ్లే మార్గంలో అడుగడుగునా పెద్ద గుంతలు ఎదురవుతున్నాయి. దీనికితోడు ఎక్కువ గ్రామీణ ప్రాంతాల లింకు రోడ్లు కావడం..సాలూరు తర్వాత ఒడిశా వెళ్లే మార్గంలో ఘాట్‌రోడ్డు కావడం వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. అంతర్రాష్ట్ర రహదారి కావడంతో వాహనచోదకులు రోజుల తరబడి ప్రయాణం సాగిస్తున్నారు. నిద్ర, మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఇటీవల పోలీసులు రాత్రివేళల్లో వాహనాలను ఆపి, చోదకులు ముఖం కడుక్కునేందుకు నీళ్లు అందిస్తున్నారు. ప్రమాదాల నివారణకు వినూత్న కార్యక్రమం చేపట్టారు. మరోవైపు ప్రమాదాలు జరిగినప్పుడే ఆర్టీవో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. తర్వాత వదిలేస్తున్నారు. దీనివల్ల నిర్వాహకులకు, చోదకులకు భయం ఉండడం లేదు. బస్సుల్లో పూర్తిస్థాయి భద్రతా ప్రమాణాలు పాటించేలా పోలీసులు, రవాణా శాఖాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.

బస్సుల్లో భద్రత లెస్సు!1
1/1

బస్సుల్లో భద్రత లెస్సు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement