చెరువులో మట్టి మాయం..!
● జేసీబీలతో తవ్వి తరలింపు
● సోమసాగరానికి గర్భశోకం
● చోద్యం చూస్తున్న అధికారులు
కురుపాం: వడ్డించే వాడు మనవాడైతే ఏ వరుసలో కూర్చున్నా అందాల్సింది అందక మానదన్న నానుడి కురుపాం తెలుగు తమ్ముళ్లకు వర్తించక మానదు. వివరాల్లోకి వెళ్తే..మండల కేంద్రంలోని శివ్వన్నపేటలో ఉన్న సోమసాగరం చెరువులో గడిచిన మూడు రోజులుగా జేసీబీలతో చెరువు గర్భంలోని మట్టిని తవ్వేస్తున్నారు. ఇప్పటివరకు చెరువులో యంత్రాలతో మట్టి తవ్వి సుమారు 250 ట్రాక్టర్‌ల లోడులను తరలించారు. ఈ మట్టిని ఎందుకు తవ్వుతున్నారో..? ఎక్కడికి తరలిస్తున్నారో అర్థం కావడం లేదు. పోనీ ఇరిగేషన్, రెవెన్యూ అధికారుల అనుమతి ఉందా? అంటే అదీ లేదని సంబంధిత అధికారులు చెప్పడం శోచనీయం. ఇంతతంతు మూడు రోజులుగా జరుగుతన్నా కూతవేటు దూరంలో ఉన్న ఇరిగేషన్ అధికారుల స్పందన లేక పోవడంతో వారి తీరును ప్రజలు, రైతులు దుయ్యబడుతున్నారు.
గురుకులానికి తరలిస్తున్నట్లు నెపం
నెల రోజుల క్రితం గురుకుల పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు పచ్చకామెర్లతో మృతి చెంది, వందల సంఖ్యలో విద్యార్థులు ఆస్పత్రి పాలవగా జిల్లా మంత్రి అచ్చెం నాయుడు పాఠశాలను సందర్శించి పాఠశాలలో మట్టి ఊటకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే తెలుగుదేశం కార్యకర్తలే తమ సొంత డబ్బులతో అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. ఇదే అదునుగా తీసుకున్న కురుపాం మండల తెలుగుదేశం నాయకుల కళ్లు దగ్గరే ఉన్న సోమసాగరం చెరువుపై పడ్డాయి. ఇక అనుకున్నదే తడవుగా మట్టిని తమ ఇష్టానుసారం తరలించేస్తున్నారు. ఇంత తంతు అనధికారికంగా జరుగుతున్నా అధికారులు మాత్రం నోరు మెదపడం లేదు. దీనికి కారణం అధికార పక్షానికి టార్గెట్ అవుతామని ప్రశ్నించలేని పరిస్థితి ఉంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు అక్రమ మట్టి తవ్వకాలపై దృష్టి సారించాల్సి ఉందని పలువురు కోరుతున్నారు.


