క్రీడలతో మానసికోల్లాసం
బొండపల్లి: క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు గురువారం ఆయన బొండపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లాస్థాయి అధెట్లిక్స్ పోటీల ఎంపికను ప్రారంభించారు. ఈ సంధర్బంగా ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి 500 మంది క్రీడాకారులు హాజరు కాగా పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు ఈనెల 8 నుంచి శ్రీకాకుళంలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ క్రీడల్లో రాణించిన విద్యార్థులకు విద్య, ఉద్యోగాల్లో 3 శాతం రిజర్వేషన్ అమలు చేయనున్నట్లు తెలిపారు. అలాగే 200 కిలోమీటర్లు దాటి పోటీలకు హాజరయ్యే విద్యార్థులకు ఉచితంగా రిజర్వేషన్ సౌకర్యం కల్పించడంతో పాటు, రోజు దాటితే అలవెన్సు కూడా ఇచ్చే సౌలభ్యం కల్పించినట్లు తెలిపారు. క్రీడల్లో రాణించే విద్యార్థులు చదువులోనూ రాణిస్తారని ఈ విషయాన్ని ప్రతి విద్యార్థి గుర్తుంచుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో డీఈఓ యు.మాణిక్యం నాయుడు, వైస్ ఎంపీపీ జి.ఈశ్వర్రావు, సర్పంచ్ బొండపల్లి ఈశ్వర్రావు, తహసీల్దార్ డోలా రాజేశ్వర్రావు, ఎంపీడీఓ జి.గిరిబాల, స్కూల్‌గేమ్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎల్‌వి రమణ, గోపాలరావు, హెచ్‌ఎం ఉమామహేశ్వర్రావు, ఎంఈఓ2 ఎ.వెంకటరమణ, రాపాక అచ్చిం నాయుడు, నంబూరి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
మంత్రి కొండపల్లి శ్రీనివాస్


