బస్సెక్కాలంటే భయం..!
కార్తీక మాసం కావడంతో అమాంతం పెరిగిన రద్దీ ఉచిత బస్సు ఎఫెక్ట్‌తో ఆలయాలకు పోటెత్తుతున్న మహిళలు సాధారణ ప్రయాణికులకు ఇక్కట్లు
కార్తీక మాసం.. ఏకాదశి కావడంతో గత శనివారం గరుగుబిల్లిలోని తోటపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ప్రధానంగా మహిళలతో ఆలయం కిటకిటలాడింది. వారిలో దాదాపు అందరూ ఉచిత బస్సులో ప్రయాణం చేసి వచ్చిన వారే.. ఫలితంగా ఇటు పార్వతీపురంతోపాటు, అటు పాలకొండ మార్గంలోని బస్సుల్లో విపరీతమైన రద్దీ ఏర్పడింది. లోపల అడుగు పెట్టడానికి కూడా ఖాళీ లేనంతగా బస్సులు కిక్కిరిసిపోయాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇదే పరిస్థితి.
సాక్షి, పార్వతీపురం మన్యం: ఉచిత బస్సులు సాధారణ ప్రయాణికులకు చుక్కలు చూపెడుతున్నాయి. గతంలో దగ్గరలో ఉన్న గ్రామాలకు, ఆలయాలకు వెళ్లాలంటే ద్విచక్ర వాహనాలు, ఆటోలను ఆశ్రయించేవారు. ఇప్పుడు మహిళలంతా పది అడుగుల దూరానికి కూడా బస్సు వెళ్లే మార్గమైతే ఆర్టీసీ సర్వీసులను ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుతం కార్తీక మాసం కావడంతో మహిళా ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగింది. జిల్లాలోని పార్వతీపురం, సాలూరు, పాలకొండ ఆర్టీసీ డిపోల పరిధిలో 264 బస్సు సర్వీసులు నడుస్తున్నాయి. ఇందులో సుమారు 180 బస్సుల వరకు మహిళల ఉచిత ప్రయాణానికి కేటాయించినవే. దూర ప్రాంతాలైన విజయవాడ, రాజమండ్రి తదితర ప్రాంతాలకు వెళ్లే సూపర్ డీలక్స్ బస్సులు మినహా.. పార్వతీపురం, పాలకొండ, సాలూరు డిపోల్లో అధిక శాతం పల్లెవెలుగు, ఆల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ సర్వీసులే. ఇటు పాలకొండ, శ్రీకాకుళం వైపు వెళ్లాలన్నా.. అటు విజయనగరం, విశాఖపట్నం, సాలూరు, బొబ్బిలి తదితర ప్రాంతాలకు వెళ్లాలన్నా.. పల్లెవెలుగుతోపాటు, ఎక్స్‌ప్రెస్ సౌకర్యం ఉంది. వీటిలో మహిళలు ఉచితంగా ప్రయాణించే అవకాశం ఉండటంతో ఆ మార్గాల్లో నడిచే బస్సులన్నీ నిత్యం రద్దీగా మారుతున్నాయి. మొత్తంగా రోజులో దాదాపు 80 వేల మంది వరకు ప్రయాణం చేస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.
సాధారణ ప్రయాణికులకు అవస్థలు
ఉచిత ప్రయాణం గత ఆగస్టులో ప్రారంభమైన తర్వాత ఆర్టీసీ సర్వీసుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఈ తాకిడికి సరిప డా కొత్త బస్సులను ఆర్టీసీ వేయలేదు. ఉన్నవాటిలో అధిక శాతం కాలం చెల్లినవే. గతం కంటే ఇప్పుడు ప్రయాణించే వారి సంఖ్య పెరగడం.. దాదాపు సీటింగుకు రెట్టింపు సంఖ్య బస్సులో ప్రయాణికు లు ఉండటంతో చాలా వరకు బస్సులు కదలడం లే దు. దీనికితోడు స్టాప్‌లు ఎక్కువ కావడంతో గంట ప్రయాణం కాస్త రెండు, మూడు గంటలు పడు తోంది. బస్సులు మధ్యలోనే మొరాయిస్తున్నాయి. ప్రస్తుతం కార్తీక మాసం కావడంతో ఆలయాలకు వెళ్తున్న మహిళల సంఖ్య మరింత పెరిగింది. వీరంతా ఆర్టీసీ సర్వీసులనే ఆశ్రయించడంతో బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. దీనివల్ల రెగ్యులర్‌గా ప్రయాణించే ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులకు బస్సులు దొరకడం కష్టమైపోతోంది. సమయానికి వెళ్లలేకపోతున్నట్లు విద్యార్థులు, ఉద్యోగు లు తమ వద్ద మొరపెట్టుకుంటున్నారని కండక్టర్లు చెబుతున్నారు. ఆ విషయంలో తామూ ఏమీ చేయ లేకపోతున్నామని.. ఖాళీ లేకున్నా, మహిళలు చెప్పినచోటల్లా బస్సు ఆపాల్సి వస్తోందని, లేకుంటే ఫిర్యా దులు చేస్తున్నారని వాపోతున్నారు. విజయనగరం వెళ్లే ప్రయాణికుడు ఇటీవల సాయంత్రం 4.30 గంటలకు కాంప్లెక్స్‌కు వెళ్తే.. రాత్రి 7 గంటల వరకు బస్సు ఎక్కలేకపోయానని ఆందోళన వ్యక్తం చేశా డు. ఏది చూసినా కిక్కిరిసిపోతున్నాయని వాపోయాడు.
ఇటీవల పాలకొండ నుంచి చీపురుపల్లి వెళ్లే మార్గంలోని ఒక పాసింజర్ సర్వీసులో 82 మంది ప్రయాణం చేశారు. ఇందులో మగ ప్రయాణికులు ముగ్గురే. మిగిలిన వారంతా మహిళలే. వీరంతా గుంపులుగా వివిధ ప్రాంతాల నుంచి మానసాదేవి
ఆలయానికి ప్రయాణమైన వారే.
బస్సెక్కాలంటే భయం..!


