భద్రతలేకే భక్తుల మరణం
● చంద్రబాబు పాలనలో భక్తులకు భద్రత కరువు ● కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట ఘటన విచారకరం ● మరణించిన భక్తుల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ సాలూరులో క్యాండిల్ ర్యాలీ ● పాల్గొన్న మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్‌సీపీ శ్రేణులు, ప్రజలు ● అనారోగ్యాలతో మరణించిన గిరిజన విద్యార్థులకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్
సాలూరు:
చంద్రబాబు పాలనలో ప్రజలకు భద్రత కరువైందని, ఆలయాలు, పుష్కరాల్లో సంభవించిన మరణాలే దీనికి నిదర్శనమని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు పీడిక రాజన్న దొర అన్నారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాటలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ సాలూరు పట్టణంలో సోమవారం క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ రాజన్నదొర మాట్లాడుతూ.. టీడీపీ పాలనలోనే గోదావరి పుష్కరాలు, తిరుమలతిరుపతి దేవస్థానం, సింహాచలం, నిన్న కాశీబుగ్గ వేంకటేశ్వర స్వామి ఆలయాల్లో జరిగిన వివిధ ఘటనల్లో పదుల సంఖ్యలు భక్తులు మరణించారన్నారు. ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ఎప్పుడూ సనాతన ధర్మమంటూ మాట్లాడతారని, మరి ఈ సంఘటనలు జరిగినప్పుడు ఆయన ఏం చేస్తున్నార ని ప్రశ్నించారు. హిందువులు జరుపుకునే ప్రతి పండగ సనాతనధర్మంలో భాగమేనని, అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎందుకు ముందస్తు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రైవేట్ వ్యక్తులు నిర్మించిన ఆలయంలో జరిగిన సంఘటనకు ప్రభుత్వానికి సంబంధంలేదనడం విడ్డూరంగా ఉందన్నారు. వినాయకఉత్సవాలు, గ్రామాల్లో జరుపుకునే అమ్మవారి పండగ లు, నందెన్న ఉత్సవాల్లో భద్రతకు పోలీసులు ఎందుకు వస్తున్నారన్నారు. పండగల నిర్వహణకు పోలీసుల అనుమతి ఉండాలంటూ ముందస్తు హెచ్చరికలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. సినిమా థియేటర్ల వద్ద సైతం పోలీసుల భద్రత ఉంటుందని, ఆలయాల వద్ద లేకపోవడం విచారకరమన్నారు. కాశీబుగ్గ ఘటన విషయంలో పోలీసులది తప్పుకాదని, ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే వారు అక్కడ భద్రత కల్పించి ఉండేవారన్నారు. చనిపోయిన కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. భక్తుల మరణాలను రాజకీయం చేయకూడదని, వారి ఆత్మకు శాంతి కలగాలనే క్యాండిల్ ర్యాలీ నిర్వహించినట్టు చెప్పారు. ఇటీవల కాలంలో మన్యం జిల్లాలో 16 మంది గిరిజన విద్యార్థులు వివిధ అనారోగ్య కారణాలతో మరణిస్తే బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించకపోవడం బాధాకరమన్నారు. భాద్యత వహించాల్సిన మంత్రి.. నాకేం సంబంధమంటూ మాట్లాడడం శోచనీయమన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.


