పాలకొండ విభజనకు ఏర్పాట్లు..!
● జనరల్ కేటగిరీకి కేటాయిస్తారంటూ ముమ్మర ప్రచారం ● ఇప్పటికే సిద్ధమైన ఓటర్ల జాబితాలు
వీరఘట్టం: గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన జిల్లాల పునర్విభజనలో పాలకొండ నియోజకవర్గంను పార్వతీపురం మన్యం జిల్లాలో చేర్చారు. ప్రస్తుతం పార్వతీపురం మన్యం జిల్లాలో పాలకొండ, సాలూరు, కురుపాం నియోజకవర్గాలు ఎస్టీలకు, పార్వతీపురం ఎస్సీలకు కేటాయించారు. ఇటీవల పాలకొండ డివిజన్ కేంద్రాన్ని జిల్లా చేయాలని, లేదంటే పాత శ్రీకాకుళం జిల్లాలో ఉంచాలనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. పాలకొండ నియోజకవర్గాన్ని విభజనచేసే దిశగా అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. సామాజిక వర్గాలుగా చూస్తే నియోజకవర్గంలోని వీరఘట్టం, పాలకొండలో అధిక శాతం మంది బీసీలు ఉన్నారు. వీరిలో చాలా మంది పాలకొండను జనరల్ కేటగిరీకి కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. అందుచే సమీపంలో ఉన్న వంగర మండలంలో కూడా అధిక శాతం మంది బీసీలు ఉండడంతో వంగర మండలాన్ని పాలకొండ నియోజకవర్గంలో చేర్చాలనే ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం పాలకొండ నియోజకవర్గంలో ఉన్న సీతంపేట, భామిని మండలాలతో పాటు పక్కనే ఉన్న కొత్తూరు మండలంతో కలిపి సీతంపేటను నియోజకవర్గ కేంద్రంగా మార్చుతారనే ప్రచారం సాగుతోంది. వాస్తవానికి సీతంపేటను నియోజకవర్గ కేంద్రంగా మార్చాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు.
నియోజవర్గాల పునఃర్విభజన జరిగితే పార్వతీపురం మన్యం జిల్లాలో ఐదు నియోజకవర్గాలు ఉంటాయి. ప్రస్తుతం ఉన్న పాలకొండ, పార్వతీపురం, సాలూరు, కురుపాంతో పాటు కొత్తగా సీతంపేట నియోజకవర్గం ఏర్పడుతుందని సమాచారం. ప్రస్తుతం జిల్లాలో 7.75 లక్షల మంది ఓటర్లు ఉన్నా రు. వీరితో పాటు పాలకొండ విభజన జరిగితే కొత్తగా ఈ నియోజవర్గంలో చేరే వంగర మండలంలో 43వేల మంది ఓటర్లు, సీతంపేటలో చేరే కొత్తూరు మండలంలో ఓటర్లు 57 వేల మందితో కలపి మరో 1 లక్ష మంది ఓటర్లు జిల్లాలో చేరే అవకాశం ఉంది.
పాలకొండ నియోజకవర్గాన్ని విభజన చేస్తే ఇక్కడ అభివృద్ధి జరుగుతుందా అంటే.. చాలా మంది అవుననే సమాధానం చెబుతున్నారు. జనరల్ కేటగిరీకు ఈ నియోజకవర్గాన్ని కేటాయిస్తే పోటీ కూడా అధికంగా ఉంటుందని, వనరుల సద్వినియోగంపై శ్రద్ధపెరిగి, అభివృద్ధి జరుగుతుందన్నది రాజకీయ విశ్లేషకుల మాట. అయితే, పాలకొండ నియోజకవర్గం విభజన జరుగుతుందా?లేదా? పాలకొండను జిల్లా కేంద్రంగా మార్చుతారా? లేదంటే పాత శ్రీకాకుళంలో విలీనం చేస్తారా అన్నది వేచి చూడాల్సిందే. 2026లో జరగనున్న జనగణన తర్వాత ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం లభిస్తుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.


