ప్రభుత్వ భూమి దురాక్రమణ
● తప్పుడు పత్రాలతో విక్రయం ● లోకాయుక్తకు ఫిర్యాదు
సాక్షి, పార్వతీపురం మన్యం: పార్వతీపురం పట్టణంలో దాదాపు రూ.18 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమి దురాక్రమణ జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ అండదండల తో.. తప్పుడు పత్రాలతో ఈ స్థలాన్ని విక్రయించినట్లు తెలుస్తోంది. రెవెన్యూ, రిజిస్ట్రేషన్, మున్సిపల్ అధికారులకు ఇందులో భారీ ఎత్తున ముడుపులు అందాయన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. పార్వతీపురం పట్టణ నడిబొడ్డున వరహాల గెడ్డ పోరంబోకు ప్రభుత్వ భూమిని కొందరు తప్పుడు సర్వే నంబర్లు నమోదు చేసి ఇటీవల రిజిస్ట్రేషన్ చేయించుకున్న ట్లు తెలుస్తోంది. సర్వే నంబర్ 410లోని వరహాల గెడ్డ పోరంబోకు భూమిని 411 సర్వే నంబర్‌గా నమోదు చేసి 1,200 గజాల స్థలాన్ని వ్యాపారులకు విక్రయించినట్లు ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇందులో అధికార పార్టీ పెద్దల హస్తం ఉన్నట్లు చెబుతున్నాయి. ఇదే భూమిని గతంలో ప్రభుత్వ భూమిగా రెవెన్యూ అధికారులు గుర్తించి హెచ్చరిక బోర్డులు, సరిహద్దు రాళ్లను కూడా ఏర్పాటు చేశా రు. అప్పుడు ప్రభుత్వ భూమిగా గుర్తించి.. ఇప్పు డు ప్రైవేటుగా ఎలా యాజమాన్య హక్కులను బదలాయిస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. సదరు భూమి యజమానికి సర్వే నంబర్ 411లో కేవలం 400 గజాల స్థలం మాత్రమే ఉన్నప్పటికీ.. 1200 గజాల స్థలాన్ని ఎలా అమ్మగలిగారని అంటున్నా రు. ఇటీవల పార్వతీపురం పట్టణంలో భూ ఆక్రమ ణలు పెరిగాయి. ఎవరైనా దీన్ని ప్రశ్నిస్తే.. బెదిరిస్తూ దౌర్జన్యాలకు పాల్పడు తున్నారని సమాచారం. నిబంధ నల ప్రకారం గెడ్డ పోరంబోకు, చెరువులలో భవన నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేయకూడదు. మున్సిపల్ యంత్రాంగం ఇటువంటి నిర్మాణాలకు యథేచ్ఛగా అనుమతులు జారీ చేస్తోంది. ఈ క్రమంలో పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆక్రమణలకు గురైన స్థలాన్ని సీపీఎం జిల్లా కార్యదర్శి కొల్లి గంగునాయు డు ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు సోమవారం పరిశీలించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ భూముల దురాక్రమణలు పెరిగాయన్నారు. జిల్లా కలెక్టర్ తక్షణమే ఈ సమస్యపై సమగ్రమైన దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో ఇంత దారుణంగా ప్రభుత్వ స్థలాలు, భూములు, చెరువులు దురాక్రమణ జరుగుతుంటే.. రెవెన్యూ, పోలీస్, రిజిస్ట్రేషన్ శాఖ నిద్రావస్థలో ఉండడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దీనిపై లోకాయుక్తకు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు.


