జిల్లా స్థాయి క్రీడాకారుల ఎంపిక
బొబ్బిలి: ఏపీ రెసిడెన్షియల్ పాఠశాల ఆవరణలో జిల్లా స్థాయి క్రీడాకారుల ఎంపికను శనివారం నిర్వహించారు. డివిజన్‌లోని 7 మండలాలకు చెందిన 200 మంది క్రీడాకారులు పాల్గొనగా ఆయా క్రీడా పోటీల్లో అత్యుత్తమ ప్రతిభను కనబర్చిన వారిని గుర్తించి జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని నిర్వాహకులు తెలిపారు. లాంగ్ జంప్, హైజంప్, త్రోబాల్ వంటి పోటీలను నిర్వహించినట్టు తెలిపారు. కార్యక్రమంలో ఎంఈవో గొట్టాపు వాసు, డివిజన్ ఇన్‌చార్జ్ ఎన్వి నాయుడు, ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు, ఏడు మండలాల పి.డి.లు పాల్గొన్నారు.
ములగ విద్యార్థినికి అరుదైన అవకాశం
పార్వతీపురం రూరల్: మండలంలోని ములగ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు అరుదైన గౌరవం దక్కింది. భారత రాజ్యాంగ దినోత్సవం పురష్కరించుకొని నిర్వహించిన పోటీల్లో పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని బంకపల్లి భార్గవి ప్రధమ స్థానాన్ని సాధించి తన ప్రతిభను కనబరుస్తూ ఈ నెల 26న ఆంధ్రప్రదేశ్ శాసనసభలో జరిగే రాష్ట్ర స్థాయి ఉత్సవాల్లో పాల్గొనేందుకు అర్హత సాధించింది. ఈ మేరకు అదే రోజున నిర్వహించే మాక్ అసెంబ్లీ సమావేశాల్లో మంత్రులు, ముఖ్యమంత్రితో పాటు పాల్గొని అవకాశం దక్కడం పట్ల పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థిని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. అరుదైన అవకాశం దక్కించుకున్న భార్గవికి ప్రధానోపాధ్యాయులు పెంట రామకృష్ణ అభినందించారు.
‘ఓపెన్’ ఫీజు గడువు పెంపు : డీఈవో
విజయనగరం అర్బన్: ఓపెన్ స్కూల్‌లో పది, ఇంటర్ కోర్సుల ప్రవేశాలకు దరఖాస్తు చేసుకొని ఫీజులు చెల్లించని వారి కోసం ఈ నెల 8వ తేదీ వరకు గడువు పెంచినట్టు డీఈవో యు.మాణిక్యంనాయుడు తెలిపారు. రెగ్యులర్ టెన్త్ పరీక్షల్లో ఫెయిల్ అయిన అభ్యర్థులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఎస్సెస్సీ పరీక్షలకు హాజరు కావాలనుకునే అభ్యర్థులు రూ.300 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ దరఖాస్తులు ‘ఏపీఓపెన్‌స్కూల్.జీఓవి.ఐఎన్’ వెబ్‌సైట్‌లో సమర్పించుకోవాలని తెలిపారు. జిల్లా నెట్‌వర్క్ సెంటర్ల ద్వారా ఫీజు చెల్లింపునకు సదుపాయం ఉందని అర్హత కలిగిన అభ్యర్థులు ఆలస్యం కాకుండా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ఇప్పటికే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ లేదా కన్వర్షన్ చేసిన అభ్యర్థులు కూడా నిర్ణీత గడువులోగా ఫీజు చెల్లింపును పూర్తి చేయవచ్చని తెలిపారు.
బొబ్బిలిలో చోరీ
బొబ్బిలి: పట్టణంలోని వెలమవారి వీధిలో ఓ అపార్ట్‌మెంటులో నివసిస్తున్న ఉపాధ్యాయురాలు బెవర రాధ ఇంట్లో శుక్రవారం రాత్రి దొంగలు పడ్డారు. బీరువాను బద్దలు కొట్టి దాచుకున్న దాదాపు 10 తులాల బంగారు ఆభరణాలను పట్టుకుపోయారు. తన కుమార్తె పుట్టపర్తిలో విద్యనభ్యసిస్తుండగా భర్త రామకృష్ణ కుమార్తె వద్దకు వె వెళ్లారు. శుక్రవారం రాధ తన పుట్టింటికి వెళ్లగా శనివారం మధ్యాహ్నం తిరిగి వచ్చి చూసేసరికి తలుపుల గడులు, బీరువా తెరిచి ఉన్నాయని దీంతో తమకు సమాచారం ఇచ్చినట్టు ఎస్‌ఐ రమేష్ తెలిపారు. ఇప్పటికే క్లూస్ టీం వచ్చి పరిశీలించిందని దర్యాప్తు చేపట్టామని ఎస్‌ఐ తెలిపారు. ఫిర్యాదు ఇంకా అందలేదని, పూర్తి వివరాలను త్వరలో తెలియజేస్తామని తెలిపారు.
వ్యక్తి ఆత్మహత్య
గుర్ల: మండలంలోని గుజ్జింగివలసకు చెందినన బద్రి రాంబాబు(30) మనస్తాపానికి గురై శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. బద్రి రాంబాబుకు కుటుంబ సభ్యులు మూడేళ్లుగా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఒక్క సంబంధం కూడా నిశ్చయం కాకపోవడంతో పెళ్లి కాదనే నిర్ణయానికి వచ్చి మనస్తాపానికి గురై ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గుర్ల హెడ్ కానిస్టేబుల్ త్రినాధ్ కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. మృతునికి తల్లి అప్పయ్యమ్మ ఉన్నారు.
జిల్లా స్థాయి క్రీడాకారుల ఎంపిక
జిల్లా స్థాయి క్రీడాకారుల ఎంపిక
జిల్లా స్థాయి క్రీడాకారుల ఎంపిక


