కన్నీటి వరద
● చి’వరి’లో మునిగిన రైతు
● వర్షంతో కోలుకోలేని కష్టం
● పెట్టుబడి కూడా దక్కని పరిస్థితి
● ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకోలు
పాలకొండ మండలం తంపటాపల్లి గ్రామంలోనే సుమారు 450 ఎకరాల మేర వరి నేలవాలి, ఎందుకూ పనికి రాకుండా పోయింది. ఇప్పటికీ పంట పొలాల్లో నడుం లోతు వరకు నీరు నిలిచే ఉంది. ఎంత కట్టలు కడుతున్నా.. ప్రయోజనం ఉండడం లేదు. నాలుగు రోజులుగా నీటిలోనే ఉండటంతో మొలకలు వచ్చేస్తున్నాయి. ఇక్కడ మాజీ పీఏసీఎస్ అధ్యక్షుడు అల్లు శ్రీరామ్మూర్తికి 30 ఎకరాల మేర ఉంటే.. అందులో దాదాపు 15 వేల ఎకరాల వరకూ నీట పాలైంది. రూ.వేలల్లో మదుపులు పెట్టి.. చి‘వరి’కి ఇలా నిండా మునిగిపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పాలకొండ మండలం తుమరాడలో పూలు, కూరగాయల సాగు అధికం. 30 కుటుంబాల వరకు బంతి, చామంతి, వాడంబరాలు.. కూరగాయలు, దొండ, బీర, చిక్కుడు, క్యాబేజీ తదితర పంటలు సాగు చేస్తున్నారు. చాలా వరకు పంటలు దెబ్బతిన్నాయి. పూలమొక్కలు వాడిపోతున్నాయి. ఎండ ఎక్కితే కూరగాయల పాదులు కుళ్లిపోయే ప్రమాదం ఉందని మహిళా రైతు పి.పార్వతి చెబుతోంది.
సాక్షి, పార్వతీపురం మన్యం/పాలకొండ రూరల్/మక్కువ: మోంథా తుపాను.. రైతుకు మోత మోగించింది. మూడు రోజులపాటు ఏకధాటిగా కురిసిన వాన.. గురువారం మధ్యాహ్నం నుంచి తెరిపిచ్చింది. వర్షం వెళ్లినా.. చేలలో నీళ్లు ఇంకా ఇంకలేదు. రూ.వేలల్లో పెట్టుబడి పెట్టిన రైతుల ఆశలు పొలాల్లోనే నేలవాలిపోయాయి. పార్వతీపురం మండలం, సాలూరు రూరల్, పాచిపెంట, మక్కువ, బలిజిపేట, సీతానగరం, పాలకొండ, కురుపాం, గుమ్మలక్ష్మీపురం, భామిని తదితర మండలాల్లో ఖరీఫ్ వరి, పత్తి, ఇతర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. సుమారు 1,105 హెక్టార్లతో వ్యవసాయ పంటలు, 18.72 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. పత్తి, మొక్కజొన్న రైతులకూ కష్టం తప్పలేదు. పాచిపెంట, కురుపాం, సాలూరు, కొమరాడ తదితర మండలాల్లో పత్తి పంట తడిచి ముద్దయ్యింది. జిల్లాలో పత్తి సుమారు 17 వేల ఎకరాల్లో సాగవుతుండగా.. దాదాపు 187 ఎకరాల మేర నష్టపోయినట్లు ప్రాథమిక అంచనా. జిల్లాలోని పలు మండలాల్లో కూరగాయల సాగు కూడా అధికంగా ఉంది. వర్షం వెలిసి.. ఎండ తీవ్రంగా కాయడంతో పంట కుళ్లిపోయే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
పంటకు దోమపోటు
మరోవైపు పంటలకు తెగుళ్ల బెడద వెంటాడుతోంది. నాలుగు రోజులుగా చేలు నీళ్లలో ఉండిపోవడం వల్ల ఓ వైపు మొలకలు వస్తున్నాయి. మరోవైపు సుడిదోమ వ్యాపిస్తోంది. దోమ నివారణకు రైతులు మందు పిచికారీ చేయాల్సి వస్తోంది. ఇది అదనపు వ్యయంగా మారుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నేను నాలుగెకరాలు వరి సాగు చేస్తున్నాను. ఇటీవల వచ్చిన మోంథా తుపాను మమ్మల్ని నిలువునా ముంచింది. ముంపు మీద మూడెకరాలు పోయింది. సుడిదోమ పట్టేయడం వల్ల మరో ఎకరా నష్టపోయాను. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి.
– అల్లు దుర్గారావు, రైతు, తంపటాపల్లి,
పాలకొండ మండలం.
కన్నీటి వరద
కన్నీటి వరద
కన్నీటి వరద
కన్నీటి వరద


