తడిసిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి
● అరకొర బస్సులు... కిక్కిరిసిన ప్రయాణాలు
● ఏపీ రైతు సంఘం డిమాండ్
కార్తీక పుణ్యమాసంలో ఆలయాల సందర్శనకు పెద్ద సంఖ్యలో మహిళలు ప్రయాణమవుతున్నారు. ఉచిత బస్సు సదుపాయం ఉపయోగించుకునేందుకు బస్ కాంప్లెక్స్‌లకు చేరుతున్నారు. వీరికి సరిపడా బస్సులు వేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో వచ్చిన అరకొర బస్సుల్లో గమ్యస్థానాలకు చేరుకునేందుకు పోటీపడుతున్నారు. కిక్కిరిసిన ప్రయాణాలు సాగిస్తున్నారు. దీనికి ఈ చిత్రమే సజీవ సాక్ష్యం. గరుగుబిల్లి సమీపంలోని తోటపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లేందుకు పాలకొండలో బస్సు ఎక్కేందుకు పోటీపడుతున్న మహిళలను చిత్రంలో చూడొచ్చు. – పాలకొండ రూరల్
ఆశ వర్కర్ సేవలకు అవార్డు
మెంటాడ: మోంథా తుఫాన్ ప్రభావంతో వర్షాలు జోరందుకున్నవేళ.. మెంటాడ మండలం జగన్నాథపురానికి చెందిన మీసాల పార్వతి అనే గర్భిణికి పురిటినొప్పులు ఆరంభమయ్యాయి. విషయం తెలుసుకున్న ఆశ కార్యకర్త వై.బంగారమ్మ వెంటనే గర్భిణి వద్దకు చేరుకుంది. సపర్యలు చేస్తూనే ఆటోలో ఆండ్ర రిజర్వాయర్ కాలువ గట్టు గుండా ఆస్పత్రికి తరలించింది. తల్లీబిడ్డకు అండగా నిలిచింది. ఈ విషయాన్ని స్థానిక వైద్యాధికారులు ఉన్నత వైద్యాధికారులు, ప్రభుత్వానికి నివేదించడంతో సీఎం ప్రశంసించారు. అమరావతిలో శనివారం అవార్డును అందజేశారు.
పార్వతీపురం రూరల్: మోంథా తుఫాన్ దెబ్బకు జిల్లాలో మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోయారని, ప్రభుత్వం తక్షణమే పరిహారం చెల్లించాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బంటు దాసు, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డి రమణమూర్తి డిమాండ్ చేశారు. పార్వతీపురం మండలం డోకిశీల పంచాయతీ పరిధిలోని జోగుదారు మెట్టవలస, గెంజిగెడ్డ, ములక్కాయవలస తదితర గిరిజన గ్రామాల్లో వర్షాలకు పాడైన మొక్కజొన్న పంటను శనివారం పరిశీలించారు. రైతుల చేతికొచ్చిన పంటను నాణ్యత దెబ్బతిందన్న షాకుచూపి దళారులు క్వింటాకు రూ.600 తక్కించి కొనుగోలు చేస్తున్నారని, ప్రభుత్వం కొనుగోలు కేంద్రం ఏర్పాటుచేసి క్వింటాను రూ.2400కు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే గిరిజన రైతులు సుమారు రూ.30 లక్షల వరకు నష్టపోతారన్నారు. పంట నష్టం సరిగా అంచనా వేయకుండా రైతులకు అన్యాయం చేస్తే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో బేతా నాగభూషణరావు, తాడంగి లక్ష్మయ్య, రాజేష్, బికూ తదితరులు పాల్గొన్నారు.
తడిసిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి
తడిసిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి


