బ్లాక్ రైస్ సాగు సందర్శన
కురుపాం: మండలంలోని ములగ గ్రామానికి చెందిన టి.రామకృష్ణ సాగుచేసిన బీపీటీ–2841 బ్లాక్‌రైస్ పంటను కృషి విజ్ఞాన కేంద్రం ప్రొగ్రాం కో ఆర్డినేటర్ డాక్టర్ ధ్రువ, వ్యవసాయ శాస్త్రవేత్తలు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ధ్రువ మాట్లాడుతూ బీపీటీ–2841 రకం బ్లాక్‌రైస్‌ను బర్మా రైసుకు దీటుగా సాగు చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ రకం 135 రోజుల పంటకాలం. ఎకరాకు 2 నుంచి 2.5 టన్నుల దిగుబడి వస్తుందన్నారు. కేవీకే ద్వారా రైతులకు విత్తనాలు సరఫరా చేసినట్లు తెలిపారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డాక్టర్ స్రవంతి, డాక్టర్ అనంత విహారితో పాటు 60 మంది రైతులు పాల్గొన్నారు.
టూరిజం అభివృద్ధికి చర్యలు
సీతంపేట: సీతంపేట ఏజెన్సీలో టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్టు గిరిజన సంక్షేమశాఖ మంత్రి జి.సంధ్యారాణి అన్నారు. స్థానిక అడ్వంచర్ పార్కులో హాట్‌బెలూన్‌ను ఆమె శనివారం ప్రారంభించారు. బిర్సాముండా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంతకముందు మెట్టుగూడ జలపాతం నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, కలెక్టర్ ప్రభాకరరెడ్డి, జేసీ యశ్వంత్‌కుమార్ రెడ్డి, పాలకొండ సబ్‌కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్, ఏపీఓ ఎస్‌వీ గణేష్, టీడీపీ ఇన్‌చార్జి పి.భూదేవి, తదితరులు పాల్గొన్నారు.
రామతీర్థానికి పోటెత్తిన భక్తులు
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం సీతారామస్వామివారి దర్శనానికి భక్తులు శనివారం పోటెత్తారు. కార్తీకమాసం తొలి ఏకాదశి కావడంతో ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ముందుగా రామకోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలను విడిచిపెట్టారు. అనంతరం సీతారామస్వామికి పూజలు చేశారు. యాగశాలలో అర్చకులు విశేష హోమాలు జరిపించిన అనంతరం వెండి మండపంలో స్వామి నిత్యకల్యాణ వేడుకను కనులపండువగా నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ప్రైవేట్ దేవాలయాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు
● కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి
విజయనగరం అర్బన్: శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు జిల్లాలో జరగకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని దేవాలయ నిర్వాహకులకు సూచించారు. జిల్లా పరిధిలో ఉన్న అన్ని ప్రైవేట్ దేవస్థానాల్లో సీసీ కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పండగలు, జాతర సమయంలో తగిన భద్రతా చర్యలు, బారికేడ్లు, క్యూలైన్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భక్తుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఏ చిన్న నిర్లక్ష్యం జరిగినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆలయాల వద్ద గత ఘటనలను నివేదిక రూపంలో అందజేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
బ్లాక్ రైస్ సాగు సందర్శన


