పింఛన్ల కోసం ఎదురుచూపు!
● 1500 మంది హెచ్‌ఐవీ బాధితులకు అందని పింఛన్
విజయనగరం ఫోర్ట్: జిల్లాలో అర్హులైన వృద్ధులు, వితంతువులతో పాటు హెచ్‌ఐవీ బాధితులకు కూడా కొత్తగా పింఛన్లు మంజూరు కావడం లేదు. పింఛన్ కోసం దరఖాస్తు చేసి నెలలు తరబడుతున్నా మంజూరు కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటినా ఇంతవరకు ఒక్క హెచ్‌ఐవీ బాధితుడికి కూడా పింఛన్ మంజూరు కాలేదు. వారంతా పింఛన్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. హెచ్‌ఐవీ రోగులకు రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. దీనివల్ల వారు మంచి పౌష్టికాహారం తీసుకోవాలి. హెచ్‌ఐవీ బారిన పడినవారిలో అధికశాతం మంది పేదవారే. పౌష్టికాహారం కొనుగోలు చేసే ఆర్థిక స్థోమత వారికి ఉండదు. పింఛన్ వస్తే ఆ డబ్బులతో పౌష్టికాహారం తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. హెచ్‌ఐవీ రోగుల సంక్షేమానికి కృషి చేస్తున్నామని చెబుతున్న కూటమి సర్కారు వారికి పింఛన్లు మాత్రం మంజూరు చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
జిల్లాలో 6,670 మంది బాధితులు
జిల్లాలో 6,670 మంది హెచ్‌ఐవీ బాధితులు ఉన్నారు. వీరిలో పురుషులు 2,755 మంది కాగా మహిళలు 3,646 మంది, పిల్లలు 269 మంది ఉన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 1500 మందికి కొత్తగా అప్పట్లో పింఛన్లు మంజూరు చేసింది. ప్రస్తుతం జిల్లాలో 1970 మంది హెచ్‌ఐవీ బాధితులకు పింఛన్లు అందుతున్నాయి. మిగిలిన వారిలో 1500 మంది వరకు కొత్తగా దరఖాస్తు చేసుకున్నారు. హెచ్‌ఐవీ బారిన పడి ఏఆర్‌టీ కేంద్రంలో ఆరు నెలల పాటు మందులు వాడిన వారు పింఛన్ కోసం దరఖాస్తు చేసేందుకు అర్హులు.
‘జామి మండలానికి చెందిన ఓ వ్యక్తికి హెచ్‌ఐవీ సోకింది. హెచ్‌ఐవీ బాధితులకు ఇచ్చే రూ.4 వేలు పింఛన్ కోసం ఏడాది కిందట దరఖాస్తు చేసుకున్నారు. ఇంతవరకు పింఛన్ మంజూరు కాలేదు.’
చీపురుపల్లి మండలానికి చెందిన ఓ వ్యక్తి హెచ్‌ఐవీ బారిన పడ్డాడు. ఏడాదిన్నర కిందట హెచ్‌ఐవీ బాధితులకు ఇచ్చే రూ.4 వేలు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అతనికి ఇంతవరకు పింఛన్ మంజూరు కాలేదు.’
కొత్తగా మంజూరు కాలేదు
హెచ్‌ఐవీ రోగులు 1970 మందికి ప్రస్తుతం పింఛన్లు అందతున్నాయి. కొత్తగా ఎవరికీ పింఛన్లు మంజూరుకాలేదు.
– డాక్టర్ కె.రాణి,
జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి


